చిరంజీవి అల్లుడు 'విజేత'

Vijetha1

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ హీరో అయినా చిరంజీవిని అనుకరించడం ఆనవాయితీగా మారింది..గతంలో చిరంజీవి హిట్ సినిమా టైటిల్ ‘విజేత’ తో అతని అల్లుడు కల్యాణ్ దేవ్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులముందుకు వచ్చాడు. ‘విజేత’ అనే పేరు వినగానే ఎవరికైనా చిరంజీవి నటించిన చిత్రమే గుర్తొస్తుంది. తన కుటుంబ కోసం ఓ యువకుడు ఏం చేశాడనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి అదే పేరుతో అందులోనూ చిరంజీవి అల్లుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం కాబట్టి… అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. మరి చిరు అల్లుడు కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా నటించిన ‘విజేత’ ఎలా ఉంది? తండ్రీ-కొడుకుల అనుబంధాన్ని ఈ చిత్రంలో ఎలా చూపించారు? తొలి చిత్రంతో చిరు అల్లుడు ఏమేరకు ఆకట్టుకున్నాడు అనే విషయాలపై అందరికీ ఆసక్తి సహజమే!

ఇదీ కథ
శ్రీనివాసరావు(మురళీశర్మ) ఓ మంచి తండ్రి. తన ఆశయాలను, కోరికలను, ఇష్టాలను చంపుకొని కుటుంబం కోసం బతుకుతుంటాడు. రామ్‌(కల్యాణ్‌దేవ్‌) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటాడు. అతనేమో అత్తెసరు మార్కులతో పాసైన బ్యాచ్‌. ఉద్యోగం రాదు. శ్రీనివాసరావు స్నేహితుల పిల్లలు మంచి పొజిషన్‌లో ఉంటారు. కానీ, తన కొడుకు ఎప్పుడు ఎదుగుతాడా? అన్న బెంగతో ఉంటాడు శ్రీనివాసరావు. రామ్‌ మాత్రం బాధ్యతలేవీ పట్టకుండా తిరుగుతుంటాడు. తన కాలనీలో ఉన్న జైత్ర(మాళవిక నాయర్‌)ను ఇష్టపడతాడు. అసలు సీరియస్‌నెస్‌ లేని రామ్‌కు జీవితం విలువ.. నాన్న విలువ.. బాధ్యతల విలువ ఎలా తెలిశాయి? తనలో మార్పు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అనేదే కథ!

విశ్లేషణ
సినిమాను విశ్లేషిస్తే పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. వాటిని గుర్తించి, తల్లిదండ్రులు కోల్పోయిన జీవితాన్ని Vijetha-Movieతిరిగి ఇవ్వడం పిల్లల బాధ్యత అన్న సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఇలాంటి కథలు మనం చాలా చూసి ఉంటాం. ఆవారాగా తిరిగే కుర్రాడు మళ్లీ ఒక మంచి మార్గంవైపు నడిచి తల్లిదండ్రులు గర్వపడేలా ఎలా ఎదిగాడన్నదే ఈ సినిమా కాన్సెప్ట్‌. తండ్రికి కొడుకుపై ఉండే ప్రేమ.. కొడుక్కి తండ్రిపై ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేసిన సినిమాగా దీనిని అనుకోవచ్చు. మెగా అల్లుడు కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా పరిచయం అయిన సినిమా ఇది. కల్యాణ్‌దేవ్‌లోని బలాల్ని, మరింత బలంగా చూపించాలని కాకుండా, మాస్‌ హీరోగా ఎలివేట్‌ చేయాలని కాకుండా, కథను కథగా చెప్పాలనే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. ఈ విషయంలో దర్శక-నిర్మాతలను అభినందించాలి. చాలా సింపుల్‌ కథను, అంతే సింపుల్‌గా ఎలాంటి హడావిడి లేకుండా మొదలు పెట్టారు. తొలి సగంలో తండ్రికి కొడుకుపై ఉండే ప్రేమ.. వాళ్లు చేసే త్యాగాలు కుర్రాళ్ల ఆకతాయితనం.. బాధ్యతలేని వ్యవహారం.. వీటి చుట్టూనే సాగింది.

ద్వితీయార్ధంలో తన తప్పు తెలుసుకున్న రామ్‌.. తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచి, తండ్రిని విజేతగా ఎలా నిలబెట్టాడనేది చూపించారు. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో ఎమోషన్స్‌ బాగా కనిపించాయి. ఒక తండ్రి కోసం తనయుడు పడే ఆరాటాన్ని దర్శకుడు బాగా తెరకెక్కించగలిగాడు. అవన్నీ కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. సీరియస్‌గా కథ, కథనంలో సత్యం రాజేశ్‌ ఎపిసోడ్‌ నవ్వులను పంచుతుంది. పతాక సన్నివేశాలను భావోద్వేగాలతో నడిపించి, కంటతడి పెట్టించేలా చేశాడు. మొత్తంగా చూస్తే ఇదో ఫ్యామిలీ డ్రామా! తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టిన చిత్రం. మాస్‌ ఎలిమెంట్స్‌ వినోదం, మిస్సయినట్లు కనిపించినా, ఇంటిల్లిపాదీ చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శకుడు తెరకెక్కించాడు.

నటీనటుల తీరు
కల్యాణ్‌దేవ్‌కు ఇదే తొలి చిత్రం. మెగా కాంపౌడ్‌ నుంచి వచ్చాడు కాబట్టి, అతనిపై ప్రత్యేకమైన ఫోకస్‌ ఉంటుంది. వాటిని వీలైనంత వరకూ అందుకోగలిగాడు. నటన విషయంలో ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. ఒకే ఒక పాటలో డ్యాన్స్‌ చేశాడు. అతని బలాలు తెలియాలంటే మరో రెండు, మూడు సినిమాల వరకు వేచి చూడాలి. మాళవిక శర్మ ఎప్పటిలాగానే సహజంగా నటించింది. అయితే, ఈ కథలో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. ఎక్కువ మార్కులు మురళీశర్మకే పడతాయి. ఒక విధంగా ఈ కథకు తనే హీరో. తన అనుభవాన్ని అంతా రంగరించి, మరోసారి మంచి తండ్రి అనిపించుకున్నాడు. నాజర్‌, రాజీవ్‌ కనకాల, సత్యం రాజేశ్‌, పృథ్వీ చిన్న పాత్రలే చేసినా, ఎవరికి వారు ప్రతిభను చూపించారు. సాంకేతికంగా.. ఈ సినిమా బాగుంది. సెంథిల్‌ కెమెరా పనితనం ఈ సినిమాకు రిచ్‌లుక్‌ను తీసుకొచ్చింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. దర్శకుడు ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రాసుకున్నాడు. దాన్ని కుటుంబమంతా చూసేలా తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెర ముందుః
: కల్యాణ్‌దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీశర్మ, నాజర్‌, సత్యం రాజేశ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు
తెర వెనుకః
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, సినిమాటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌, నిర్మాత: సాయి కొర్రపాటి, దర్శకత్వం: రాకేశ్‌ శశి

Send a Comment

Your email address will not be published.