చీకటి వెలుగుల రంగవల్లి

Diwali

చీకటి వెలుగుల రంగవల్లి – దీపావళి
చీకట్లను పారదోలి పచ్చటి సమాజానికి దివ్వెల ముస్తాబు చేసే సార్వజనీన పండుగ దీపావళి. మతం, వర్గం, ప్రాంతం, చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా జరుపుకునే ఈ ఆనందాల వేడుకను పర్యావరణ హితంగా చేసుకుంటే వెలుగుల వరస మరింత ముందుకు చేరినట్టే. కాంతుల సమూహంలో ఒకింత పచ్చదనం చేకూరినట్టే. అందరికీ, అంతటికీ వెలుగులు అందించే దీపావళి మీద అవగాహన రోజురోజుకీ పెరుగుతోంది.

దీపావళి అనే మాటకు రూపురేఖల్ని చెరిపేసేలా ప్రస్తుత మార్కెట్‌ సంస్కృతి తన విశ్వ రూపాన్ని చూపిస్తోంది. ప్రకృతికి, జీవావరణానికీ, మనిషి ఆరోగ్యానికీ ఎలాంటి నష్టం కలిగినా పర్వాలేదు అనేదే ఆ సంస్కృతి లక్షణం. అయితే భారతీయ సంస్కృతిలో కీలకమైన దీపావళి పండగను పర్యావరణానికి ఎలాంటి హానీ జరగకుండా కూడా ఆనందంగా నిర్వహించుకోవచ్చు. దీపావళి అంటే భారీ స్థాయిలో మందుగుండు (క్రాకర్స్‌) కాల్చి పండగ చేసుకోవడం కాదు. కాలుష్యం తక్కువగా ఉండేలా, భారీ శబ్ధాలు లేకుండా వెలుగులు విరజిమ్మేలా హరిత దీపావళిని నిర్వహించుకుని ప్రకృతికి హాని కలగకుండా చూడాలి. ఇది మన కనీస బాధ్యత అనే స్పృహ కూడా ఇటీవలి కాలంలో పెరుగుతుండడం విశేషం. పర్యావరణానికి హాని చేయని నూనె దీపాల వెలుగులు, తక్కువ రసాయనాలతో తయారై, పరిధి దాటకుండా సరదాని అందించే బాణాసంచా, ఆకట్టుకునే సహజ రంగులతో వేసిన ముగ్గులతో పండుగ చేసుకుని హద్దులు లేని ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి ఏకైక మార్గం హరిత దీపావళే.

దీపావళి అంటే క్రాకర్స్‌ కాల్చడమే అనుకుంటారు చాలామంది. వేల రూపాయలు ఖర్చుపెట్టి మరీ భారీసంఖ్యలో వీటిని కొంటుంటారు. వాటిని పేల్చడం వల్ల విపరీతమైన శబ్దకాలుష్యంతో పాటు ప్రమాదకరమైన ఎన్నో రకాల రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి. ఇదంతా సహజ వనరుల కాలుష్యానికి దారితీస్తోంది. దీనివల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే చెవులు చిల్లులు పడేలా పేలే క్రాకర్స్‌ లేకుండా దీపావళి నిర్వహించడమే అందరికీ మంచిది. ఇంటిని, ఇంటి పరిసరాలను అందమైన మట్టి ప్రమిదలతో అలంకరించి ఆనందంగా దీపావళి జరుపుకోవడం ఎంతో మేలు.

అలంకరణలోనే ఆనందం
దీపావళిలో అలంకరణే ఆనందం. ఒకప్పుడు దీపాలను వరుసగా అలంకరించుకోవడమే దీపావళిగా మారింది. ఈ దీపాల అలంకరణ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉంటే ఇంకా మంచిది. రసాయన రంగులతో ముగ్గులేయడం వల్ల నీటి కాలుష్యం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సహజసిద్ధమైన రంగులు, బియ్యం పిండి, పప్పు ధాన్యాలను ఉపయోగించి రంగవల్లులను తీర్చిదిద్దండి. ఆ రంగవల్లులను బంతిపూలు, గులాబీలతో అలంకరించడం వల్ల వాటికి కొత్త అందం వస్తుంది. అలంకరణల్లో నూనెతో వెలిగించే ప్రమిదలే బెటర్‌. దీపావళి సందర్భంగా చాలామంది ఇళ్లు, వ్యాపార కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో పెద్ద ఎత్తున అలంకరిస్తుంటారు. దీంతో విద్యుత్‌ వినియోగం ఎక్కువవుతుంది. అందువల్ల మట్టి ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగించి, అలంకరణ చేయడమే ఉత్తమం. దీంతో విద్యుత్‌ ఆదా చేయడంతోపాటు కష్టపడి మట్టి ప్రమిదలను తయారు చేసేవారికీ సాయం చేసినవాళ్లమవుతాం. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా అల్యూమినియం, గట్టి ప్లాస్టిక్‌తో చేసిన ప్రమిదలు కనిపిస్తున్నాయి. వాటి వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో దీపాలు పెట్టేందుకు మట్టి ప్రమిదల్నే ఉపయోగించాలి. ఇంకా గోధుమ పిండి ప్రమిదలు, కొబ్బరి చిప్పలు, సముద్రపు గవ్వలతోపాటు కొన్ని రకాల పండ్ల తొక్కల్లోనూ దీపాలు వెలిగించొచ్చు. వీటివల్ల ఖర్చు తగ్గడంతోపాటు పర్యావరణానికీ మేలు జరిగి పచ్చని వెలుగులు మీ సొంతమౌతాయి.

దుబారా వద్దు
దీపావళి అంటే క్రాకర్స్‌ కొనడం మాత్రమే కాదని బంగారు ఆభరణాలు, రకరకాల కొత్త వస్తువులు కొనడమని, విలువైన కొత్త గృహౌపకరణాలు కొనడమని.. ఇలా రకరకాలుగా వ్యాపారవర్గాల ప్రకటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కొనుగోలుదారుకి అవసరం లేకపోయినా రకరకాల డిస్కౌంట్లు, ఈజీ ఫైనాన్స్‌ పథకాలు ఎరచూపి ఆకట్టుకుంటుంటారు. సాంప్రదాయం పేరుతో వినిమయత్వం పెంచే ధోరణి ఇది. చాలా సులభంగా ఎంతోమంది ఈ మాయలో పడిపోతున్నారు. ఇప్పుడు ధనతేరస్‌ దానిలో భాగమే! దీపావళికి ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి. పాత వస్తువులు వదిలేసి, కొత్తవి సమకూర్చుకోవాలి.. ఈ ఆలోచన పెంచటం వ్యాపారులు లాభాలని పోగేసుకోవడం కోసమే. అందువల్ల వీరి మాయలో పడితే సామాన్య జనానికి దీపావళి వెలుగివ్వడం కన్నా, వ్యాపారులకు మాత్రం వెలుగే వెలుగు! దసరా నుంచి సంక్రాంతి వరకూ కొనసాగించే ఈ ప్రచార హంగామా దాదాపు యాభై రెట్లు అమ్మకాలను పెంచుతుంది. వ్యాపారులు ప్రకటించే ప్రత్యేక ఆఫర్లు, ఉచితాలూ, బహుమతులూ… ఇలాంటి ఆకర్షక మంత్రాలు చాలా ఉంటాయి. ఖర్చును అనివార్యంగా పెంచే ఇలాంటి వినిమయ ఆకర్షణలు – చాలా కుటుంబాల్లో నిజమైన పండగ ఆనందాన్ని దూరం చేస్తాయి. అప్పుల ఊబిలోకి నెడతాయి. మంచి బహుమతులివ్వండి

దీపావళి పండుగకు ఏమీ కొనకపోతే ఎలా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఈ పండగలో ఏ సంప్రదాయం అని చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది. నిజమే దీనిని కూడా పర్యావరణహితంగా, దుబారాకు తావు లేని విధంగా కొనసాగించవచ్చు. ఎలా అంటారా? ఈసారి మీ స్నేహితులు, బంధువులకు మొక్కలు బహుమతులుగా ఇవ్వండి. మీకు దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్లండి. ఈ సీజన్లో బాగా బతికే మొక్కలు ఏవో అక్కడ నిర్వాహకులను అడగండి. మీకు నచ్చిన మొక్కల్ని మీ బడ్జెట్లో కొనుగోలు చేయండి. అక్కడి నుంచి మొక్కలను తీసుకొచ్చి, అందంగా అలంకరించి మీకిష్టమైనవారికి బహుమతిగా ఇవ్వండి. ఆ మొక్క మీ ఇంటి దగ్గర, లేదా మీ మిత్రుల ఇంటి దగ్గర బతికున్న రోజులన్నీ దీపావళినే గుర్తుచేస్తుంటుంది కదా! ఇప్పుడు మార్కెట్లో లెక్కలేనన్ని ఎకో ఫ్రెండ్రీ బ్రాండ్స్‌ క్లాతింగ్‌ లభ్యమవుతున్నాయి. మీరు కూడా ప్రకృతి ప్రేమికుడు, కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడే మనస్తత్వం గలవారైతే మీకు దగ్గరలోని ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్స్‌, ఆర్గానిక్‌ కాటన్‌ వస్త్రాలు విక్రయించే దుకాణాలను సందర్శించి వాటిని కొనుగోలు చేయండి. మీతోపాటు మీవారికి బహుమతిగా ఇవ్వండి. వీటితోపాటు పర్యావరణానికి మేలు చేసే జనపనార సంచులు, సౌరశక్తి గ్యాడ్జెట్లు, ఖాదీ దుస్తులు, రీసైకిల్‌కు అవకాశముండే రకరకాల బహుమతులను ఎంచుకోండి. వాటినే కొని బంధుమిత్రులకు ఇచ్చి పుచ్చుకోండి.
Diwali Kandil
క్రాకర్స్‌లోనూ ఎకోఫ్రెండ్లీ 
పర్యావరణ స్పృహ ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ దీపావళి క్రాకర్స్‌లో కొన్ని తమ స్వభావాన్ని మార్చుకుని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌గా మారుతున్నాయి. దీపావళి అంటేనే రంగులు విరజిమ్ముతూ.. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అందరినీ ఆకట్టుకోవడం అనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. దీపావళికి క్రాకర్స్‌ కాల్చడం తప్పనిసరి అని భావిస్తున్న వారంతా ఈ ఎకోఫ్రెంఢ్ల క్రాకర్స్‌ని ట్రైచేయడం కొంతవరకూ బెటర్‌. అలాంటివారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. కాన్‌ఫెట్టి, ఫ్లవర్‌ పవర్‌, ఫేక్‌నోట్‌, బర్ట్స్‌, స్నేక్‌మిక్స్‌లాంటి పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మామూలు బాణాసంచాలా కాకుండా, వాతావరణానికి అతి తక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. వీటి ధ్వని పరిమిత దూరం వరకే వినిపించడంతోపాటు కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్‌, ఫాస్పేట్‌ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు. అయితే వీటి లభ్యత చాలా స్వల్పంగానే ఉంది.

ప్రతి సాంప్రదాయం వెనకా గొప్ప సైన్సు ఉందని చెబుతూ ఉండే సూడోసైన్స్‌గాళ్లు ఈ దీపావళిని కూడా ఆందులోకి లాగేసారు. క్రాకర్స్‌ కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని ఇలాంటివారి అడ్డగోలు వాదన. ‘ఈ సీజన్‌లో దోమలు, ఇతర క్రిమికీటకాలూ ఎక్కువగా ఉంటాయి. అవి మనుషులపైనా, పంటలపైనా ఆశించి రకరకాల నష్టాలను కలిగిస్తుంటాయి. మందుగుండు కాల్చటం వల్ల వచ్చే పొగకూ, వాసనకూ అవి చనిపోతాయి లేదా దూరంగా పారిపోతాయి’ అని చెబుతారు. కొంతమంది అయోమయంలో ఉన్నవారు ఇది నిజమే అని నమ్మి వారు కూడా దీనిని ప్రచారం చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం వాస్తవం ఉండదు. దోమలను, ఈగలను, ఇతర క్రిమికీటకాలను నిర్మూలించటానికి అనేక సులభమైన పద్ధతులు ఉండగా- ఇంతస్థాయిలో శబ్ద, వాయు కాలుష్యం, ఖర్చూ అవసరమా అన్న పర్యావరణవేత్తల ప్రశ్నలకు సరైన సమాధానం ఈ సూడోసైన్స్‌గాళ్ల దగ్గర ఉండదు. అదేకాదు మనింట్లోని పెంపుడు జంతువులకే కాక మిగతా వన్యప్రాణికి ఈ రణగొణ ధ్వని విపరీతమైన చేటు చేస్తుంది. ఇదో తరహా జీవహింసే.

క్రాకర్స్‌తో కాలుష్యమే
ఎవరు ఎన్ని రకాలుగా సమర్థించాలని చూసినా క్రాకర్స్‌ని కాల్చడం వల్ల కాలుష్యం తప్పదన్న నిజాన్ని మరుగుపర్చలేరు. భారీ ఎత్తున కాల్చే బాణాసంచా కారణంగా దేశంలో రూ. పదివేల కోట్లు ఒక్కరోజులో అగ్గిపాలవుతున్నాయి. పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతోంది. ధ్వని, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. బాణాసంచా కాలుస్తున్నప్పుడు దేశంలో సుమారు 8 వేల మంది పిల్లలు గాయపడుతున్నారు. రెండు వేల మందికి పైగా చూపును కోల్పోతున్నారు. దీపావళి సమయంలో 6 నుంచి 10 శాతం కాలుష్య స్థాయి పెరుగుతోంది. నైట్రస్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వంటివి ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలితో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఇదివరకటి కంటే పెరిగిన క్రాకర్స్‌ వినియోగం వల్ల విష వాయువులు ప్రమాదకర స్థాయిలో వెలువడుతున్నాయి. మతాబుల వల్ల సల్ఫర్‌ అధిక సంఖ్యలో వాతావరణంలో విడుదలవుతోంది. బాంబుల వల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుంది. దీపావళి వేళ కాల్చే మందుగుండు వల్ల ఆస్తమా లాంటి రోగాలు బారిన పడే ప్రమాదం చిన్నారులకు ఎక్కువగా ఉంటుంది. గర్భిణులపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది సంప్రదాయ రీతిలో దీపాలు వెలిగించి, స్వీట్లు పంచుకోవటం వరకూ ఓకే కానీ అధిక శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాల్చటం వల్ల చెవి, గొంతు సమస్యలు రావటంతో పాటుగా హార్ట్‌ పేషంట్లకు బీపీ పెరగటం, టపాసులు కాల్చిన చేతులను పొరపాటున కళ్లలో పెట్టుకోవటం వల్ల కళ్లు దెబ్బతినటం లాంటి సమస్యలెన్నో వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలిస్తే భారీగా శబ్దం చేసే బాణసంచా మూలంగా తీవ్రమైన ధ్వని కాలుష్యం సంభవిస్తోంది. క్రాకర్స్‌ కాల్చినప్పుడు వాటికి నాలుగుమీటర్ల దూరంలో శబ్దం 125 డెసిబుల్స్‌కు మించి ఉండకూదని చట్టం చెబుతోంది. ఇంతకు మించిన శబ్దాన్ని నిషేధించారు. కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగంలో అవగాహనా రాహిత్యం వల్ల ఎక్కడా అమలు కావడం లేదు. ఈ శబ్ధ కాలుష్యం వల్ల మనిషిపై ఎంతో ప్రభావం పడుతోంది. పెద్ద శబ్ధాల వల్ల వినికిడి సమస్య రావచ్చు. రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. నిద్రపోయే వారికి తీవ్ర అంతరాయంగా మారుతుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినడంతో తాత్కాలికంగానే కాదు పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఆనందాన్ని పంచుకుంటూ
పండగ అంటేనే పదిమందితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం. అందులోనూ దీపావళి పండగ ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని పంచేది. అలాంటి ముఖ్యమైన రోజుని గత ఆరేళ్ళ నుంచి ఎవరూలేని అనాధలతో, వృద్ధులతో కలిసి జరుపుకుంటున్నారు హైదరాబాద్‌లోని స్టాస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు. కుటుంబసభ్యులతో కన్నా వసతి గహాల్లోని చిన్నారులు, బామ్మలు, తాతయ్యలతోనే కలిసి దీపావళి పండగను జరుపుకోవడం ఎంతో ఇష్టం అంటున్నారు వారు. నా అన్నవారు లేక జీవిత చరమాంకంలో చిటికెడు ప్రేమను కోరుకుంటున్న పెద్దలతోనూ, అమ్మ, నాన్న అనే పిలుపునకు దూరమై, లాలన, వాత్సల్యం కోసం ఎదురుచూస్తున్న పసిహదయాల మధ్య గత ఐదేళ్ల నుంచి దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు. దీపావళి రోజు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి, పది మంది కలిసి ఓ సమూహంగా విడిపోయి ముందుగా అనుకున్న వయోధికుల ఆశ్రమం వద్దకు కొందరు, పిల్లల వసతి గృహానికి చేరుకుంటారు. పగలంతా వారితో అడతారు. పాడతారు. వారికిష్టమైన పండుగ రుచులు పంచుతారు. సాయంత్రాలు వారిచేత ఎకో ఫ్రెండ్లీ స్కైల్యాంప్స్‌తో దీపావళి సంబరాలు జరుపుకుంటారు. పిల్లల చేత మాత్రం కాకరొత్తులు, వెన్నముద్దలు వంటి చిన్న చిన్న మతాబులు కాల్పిస్తారు. ఇంతకీ ఈ స్టాస్‌లోని వలంటీర్లందరూ ఇంజనీరింగ్‌, డిగ్రీ, ఎమ్‌.బీ.ఏ వంటి కోర్సులు చదువుతున్న వారే. సామాజిక మాధ్యమం ద్వారా ఒక వేదిక మీదకు వచ్చిన వీరంతా 2013లో మొదటిసారి చౌదరి గూడ మురికివాడలోని పిల్లలతో ఎకో ఫ్రెండ్లీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. క్రాకర్లకు బదులుగా పిల్లలచేత స్కై ల్యాంప్స్‌ ఎగురవేయించి ఆనందాన్నందించారు.

వీరే కాదు, సాధారణంగా ఈ పండుగలో ఇలాంటి సామాజిక అనుబంధాల్ని పెనవేసుకుపోయేవాళ్లు ప్రతి చోటా కనిపిస్తారు. మనింటి గోడపై పెట్టిన దీపాల వరసకు వారి వెలుగుల్ని జత చేస్తారు. మన చిన్నారికి ఓ కాకరపువ్వొత్తిచ్చి సరదా పడతారు.

వారికి తెలుసు..! పొద్దున్నే పెద్దలకు మిఠాయిని పంచి.. రాత్రుళ్లు వారి గుండె గాబరా పెంచడం, అందరికీ కేరింతలతో శుభాకాంక్షలు చెప్పి.. ఆస్పత్రులు దద్దరిల్లే పటాస్‌లు కాల్చడం, సాయంత్రాలు ముస్తాబైన పసివారితో సెల్ఫీలు దిగి.. ఆ తర్వాత వారిని క్రాకర్స్‌తో భయపెట్టడం, తులసి మొక్కకు దండం పెట్టి పర్యావరణానికి నష్టం చేకూర్చడం కాదు కదా దీపావళి అని. దీపాల వరసంటే మరో కుటుంబానికి, మరో ఇంటికి, మరో ప్రదేశానికి, మరో సమాజానికి వెలుగుల్ని పంచుకుపోవడమే కదా. తీయని మిఠాయి తినిపించి, పచ్చని కాంతుల్ని పంచుకుని ఈ పండుగలో మరో పదిమందిని కలుపుకుపోదాం. వరసలో మరొక్క దివ్వెను ముట్టిద్దాం. ్య

క్రాకర్స్‌తో ఆరోగ్యానికి ప్రమాదాలివే
దీపావళికి, ఇతర సందర్భాల్లో కాల్చే క్రాకర్స్‌ తయారీలో అనేక రకాల విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని కాల్చిన తర్వాత రసాయనాలన్నీ పీల్చే గాలిలో కలిసి, మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

– మెగ్నీషియం అనే రసాయనం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
– జింక్‌ వల్ల తలనొప్పి, వాంతులు వస్తాయి.- గాలిలో కలసిన సోడియం వల్ల శరీరంపై దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే చర్మక్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
– నైట్రేట్‌ అనే రసాయనం మోతాదు మించితే చాలా ప్రమాదం. ఇది మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
– గాలిలో కలిసిన కాపర్‌ను పీల్చడం వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస ఆడకపోవడం, విపరీతమైన దగ్గు వస్తుంది.
– కాడ్మియం అనే రసాయనాన్ని పీల్చడం అనీమియాకు దారితీస్తుంది. ఎక్కువగా పీలిస్తే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. రక్తహీనత తలెత్తుతుంది.
– లెడ్‌ శరీరంలోకి ప్రవేశిస్తే నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఎంత హరిత దీపావళి గురించి అవగాహన పెంచినా క్రాకర్స్‌ కాల్చడం ఈ పండగలో సర్వసాధరణమైపోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
– పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్‌ దుస్తులనే ధరించడం మంచిది.
– పిల్లలను క్రాకర్స్‌ కాల్చేటప్పుడు పెద్దవారు తోడుగా ఉండాలి.
– చేతులకు గ్లోవ్స్‌, కళ్లకు అద్దాలు, కాళ్లకు బూట్లు వేసుకొని క్రాకర్స్‌ కాల్చడం మంచిది.
– అగ్నిప్రమాదం జరిగితే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నీళ్లు అందుబాటులో ఉంచుకోండి.
– ఇంటి ముందు లేదా మేడపైన తాటాకులు కాల్చేముందు నీళ్లు చల్లండి. పందిరి ఉంటే దానిపై కూడా చల్లాలి.
– నిప్పురవ్వలు మీద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ అందుబాటులో ఉంచుకోవాలి.

ఈ దీపావళిని ఆనందంగా ఆహ్లాదంగా ఒక మధురస్మృతిలా జరుపుకొందాం

Send a Comment

Your email address will not be published.