జనం మెచ్చిన జాన‌ప‌ద కళ

జనం మెచ్చిన జాన‌ప‌ద కళ – ఒగ్గు క‌థ‌

1031

తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతీయుల జీవితాలతో పెనవేసుకుపోయిన జానపద కళారూపం ఒగ్గు కథ.

‘ఒగ్గు’ అనేది అచ్చమైన దేశీపదం. ఈ పదానికి ‘జెగ్గు’,’జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. దానినే కళాసాధనంగా వ్యక్తీకరించడాన్ని ‘ఒగ్గు’ అంటారు.

‘ఒగ్గు కథ’ కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటకాల సమ్మేళనం – గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ‘ఒగ్గు’ కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్దీ ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి, కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రధాన కథకులు, అయితే ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహా కళాకారులుంటారు ‘ఒగ్గు’ కథలో. ‘ఒగ్గు’ కథలను చెప్పే కళాకారులను ఒగ్గు గొల్లలు అంటారు.

ఒగ్గు దీక్ష తర్వాతే వీరు బీరన్న, మల్లన్న కథలు చెప్పేందుకు అర్హత సంపాదించుకొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదుటిన పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని, ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి, కాళ్లకి గజ్జెలు కట్టుకొని, నాట్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.

ఈ కథల ఇతివృత్తాల్లో శివుడు కథానాయకుడిగా ఉంటాడు. లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి చెమట నుండి బీరప్ప, మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తుంటారు. ‘ఒగ్గు’ కథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల, కుర్మలు తమ కుల పురాణంగా భావిస్తారు. కుర్మలు ఈ కథల్ని ఎక్కువ ప్రచారం చేశారు. తరువాతి కాలంలో ఇతర కులాల వాళ్లూ ఈ కళారూపాన్ని నేర్చుకొని, ప్రచారం చేశారు. ఇటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. బీరప్ప, మల్లయ్య కథలు మొదటి నుంచి ఉన్నాయి. ఆ తరువాత ఇతర కథలు పుట్టుకొచ్చాయి.

కళారూపం
folk-art

ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి.. ఒక నాట్యకళని వీక్షించినంత ఆనందం.. ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి.. ఒక సంగీత కచేరీలో దొరికేంత రసాస్వాదన లభిస్తుంది. అదొక సముద్రం. విభిన్నమైన కథా గాన కళా రూపాలలో ‘ఒగ్గు’ కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ వరంగల్‌, నల్లగొండ హైదరాబాదు జిల్లాలలో బహుళ ప్రచారంలో ఉంది. ఈ మూడు జిల్లాలలోనూ సుమారు 50 ‘ఒగ్గు’ కథా బృందాలు కథలు చెపుతూ ఉన్నాయి.

కథా వాయిద్యాలు
‘ఒగ్గు’ కథలో తప్పకుండా ఉండేది ‘ఒగ్గు’. దీన్ని పలు సన్నివేశాల్లో తాళానికి అనుగుణంగా, సంఘటనలకి అనుకూలంగా వాయిస్తూంటారు. ఒక్కోసారి ఈ వాయిద్యాన్ని ఆయా పాత్రలుగా ఊహింపజేస్తారు. ఉదాహరణకి చిన్నపిల్లాడిని లాలించే సందర్భం వచ్చినప్పుడు ఒగ్గుని ఆ చిన్నపిల్లాడిలా ఊహింపజేసి, ప్రేక్షకులని ఆ సంఘటనలో లీనం చేస్తారు. కథా నడకలో ‘ఒగ్గు’ కొంచెం డోలుకన్న తక్కువ ప్రాధాన్యతని కలిగుంటుంది. జానెడు పొడవుతో మధ్యభాగం ఇత్తడి లేదా చెక్కతో ఉండి, ఇరువైపులా మేక చర్మాన్ని బిగించి.. ఈ ‘ఒగ్గు’ని తయారుచేసుకుంటారు.

డోలు
అన్ని వాయిద్యాల్లోకెల్లా పెద్దది, ముఖ్యమైనది డోలు. డోలు మోతతోనే కథ ప్రారంభమవుతుంది. సుమారు ఒక మీటరు పొడవుండీ డ్రమ్ము ఆకారంలో ఇత్తడితో కానీ, చెక్కతో కానీ నిర్మాణమై ఉంటుంది. ఇరువైపులా మేక చర్మాన్ని అమర్చి, తాళ్ళతో బిగిస్తారు. గంభీరమైన ధ్వని చేస్తూ ప్రతి సన్నివేశంలో తప్పక మోగే వాయిద్యం డోలు. కథాగమనంలో కొన్ని సన్నివేశాల్లో ఉద్రేకం కలిగించడానికి డోలుని మెళ్ళో వేసుకుని, నాట్యం చేస్తారు. పళ్ళతో బిగించి పట్టుకుని తాండవం చేస్తారు. గుండ్రంగా ఆవేశంతో తిరుగుతారు. వీపుకు తగిలించుకుని, విన్యాసంగా వాయిస్తారు. ఇలా చిత్రవిచిత్ర చేష్టలతో జనాలకి విసుగు రాకుండా, రాత్రుళ్లు నిద్రపోకుండా ఆసక్తిగా కథని నడిపిస్తారు.

తాళాలు
అరచేతికి రెండింతలు పెద్దగా ఉండి ప్రతి రాగానికీ లయని అందిస్తూ, శ్రావ్యంగా మోగే వాయిద్యమే ‘ఒగ్గు’లో ఉపయోగించే తాళాలు. వీటికి తోడుగా చిన్నతాళాలనీ ఉపయోగిస్తారు. మెండు తాళం, దుయ్యర, మెండు దుయ్యర, ఆదితాళం, మెండు భైరవి, వలపోత బీగడ వంటి వివిధ రకాల తాళగతులను ఉపయోగిస్తారు.

నపీర
నపీర ఇత్తడి లోహంతో తయారవుతుంది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఒక చివర సన్నగా ఉండి, మరోవైపు కొంచెం వెడల్పుగా ఉంటుంది. నోటితో గట్టిగా ఊదితే భీకరమైన ధ్వని వినిపిస్తుంది. ఇంకా కాళ్ళకు గజ్జెలు, భుజంపై రుమాలు, చేతిలో చిన్న కర్రని కథా నడకకి ఉపయోగించుకుంటారు.

కథా నడక
oggu kathaఇతివృత్తం దగ్గర నుంచి కథనం వరకు ప్రత్యేకమైన శైలిలో నిర్మాణం పొందిన ప్రక్రియ ‘ఒగ్గు’కథ. జీవిత చరిత్రల్ని ఇతిహాసాలుగా మలిచే పద్ధతి ‘ఒగ్గు’ కథని చూసి నేర్చుకోవచ్చు. ఒక ప్రధాన కథకుడు, ఒక సహాయకుడు ముగ్గురు వంతగాళ్ళూ ఉంటే చాలు.. ఒగ్గు కథ అలవోకగా సాగిపోతుంది. ఒగ్గు కళాకారులకి ముఖ్యంగా నాలుగు విషయాలపై పట్టుంటుంది. వీరు ప్రదర్శించే ఈ అంశాల్లోని నైపుణ్యమే ఒగ్గుకథని జానపదుల హృదయ స్పందనల్లో ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో నిలబెట్టింది.

సంగీతం, ఉచ్ఛారణలో నైపుణ్యం
‘ఒగ్గు’ కథా నిర్వహణలో శబ్దం పాత్ర కీలకమైంది. సంభాషణలు, ధన్యనుకరణలు, రాగాలు అన్నీ శబ్దంపైనే ఆధారపడి ఉంటాయి. ‘ఒగ్గు’ కళాకారులు ఆశురచనా నైపుణ్యం కూడా కలిగి ఉంటారు. యతిప్రాసలు తప్పకుండా మాత్రా చందస్సులో కథా సందర్భానికి తగిన విధంగా పాటలు అల్లుతారు. మూలకథకి ఏమాత్రం భంగం కలగకుండా వీటిని జొప్పిస్తారు. అప్పుడప్పుడు హాస్యపు సంఘటనల్నీ శ్రోతల్లో ఉత్సాహం కలిగించడం కోసం సృష్టిస్తుం టారు.

కథచెబుతూ వెంటనే పాత్రదారునిగా మారటం, అందులో పూర్తిగా లీనమై వెనువెంటనే కథకుడిగా మారటం సంయమనం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకి అసాధ్యం. ‘ఒగ్గు’ కళారూపంలో ఇలాంటి ప్రత్యేకతలెన్నో. అరుదైన కళల జాబితాలోకి వెళ్ళే ప్రమాదంలో పడిన ‘ఒగ్గు’ కథనూ సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది

Send a Comment

Your email address will not be published.