జాము రాతిరి జాబిలమ్మ

image sridevi
జోలపాడనా…
ఆకాశం బ్రద్దలై భూదేవి నిలువెత్తునా చీలిపోయి విశ్వమంతా ప్రళయ తాండవంతో పిడుగులు ఉరుముల భీకర శబ్దంతో కృంగిపోయి గుండెలు పిండే వార్త. అంతేలే! చంద్రుని తారా వలయంలో వెలుగొందాల్సిన ఒక సితార భూమి మీద మానవుల మధ్య నడయాడుతుంటే సురదేవ గణాలకు కన్నుకుట్టక ఆనందిస్తారా? జన్మించేవారంతా మరణించక తప్పదంటారు. కానీ దానికి కూడా ఒక లెక్కుంది. మాకూ ఒక మనసుంది అని వాపోతున్నారు కోట్లమంది అభిమానులు. శ్రీదేవి ఇక లేరు అన్నది కల అయితే బావుణ్ణు అని మళ్ళీ మళ్ళీ ఒళ్ళు చిక్కుకుంటున్నారు. కన్నీరు మున్నీరై కలవరిస్తున్నారు.

Sridevi01

‘బూచాడమ్మ బూచాడు బుల్లెపెట్టెలో ఉన్నాడని’ నిన్న మొన్న పాడినట్లుంది. షుమారు 40 ఏళ్ళు ఏవత్భారత దేశాన్ని ఒక సుందర విహంగ వీక్షణంతో మైమరపించి బహుభాషా చిత్రాల్లో నటించి ఎందరి హృదయాలనో దోచుకొని అనంత లోకాలకు వెళ్ళిపోయిన శ్రీదేవి ఒక నటిగానే కాకుండా మంచి మనీషిగా కూడా పేరుగాంచారు. ఒక అందాన్ని ఉపమానంగా పోల్చాలంటే శ్రీదేవి. ఒక నటనను వర్ణించాలంటే శ్రీదేవి. ఒక వైవిధ్యాన్ని అధ్యయనం చేయాలంటే శ్రీదేవి. ఒక నాట్యాన్ని అభినయించాలంటే శ్రీదేవి.

‘మానవా మానవా’ అంటూ ఒక దేవతా మూర్తిగానే మురిపిస్తూ అనంతలోకాలకు వెళ్ళిపోయిన సౌందర్యమూర్తి. వైవిధ్యమున్నపాత్రలు ధరించి అత్యున్నత ప్రమాణాలకు పట్టంగట్టిన నటనా వైదేహి. పదహారేళ్ళ వయసు సినిమా వచ్చి సరిగ్గా 40 ఏళ్ళు. “సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా” అని ఊయల ఊగుతూ పాడిన పాట ఇంకా అభిమానుల గుండెల్లో నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంది. “నీ కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని…” ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు ప్రేమైక జీవులు.

తెలుగు సినిమా చూస్తుంటే తెలుగామ్మయని, తమిళం సినిమా చూస్తుంటే తమిళమ్మాయని, హిందీ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా ఈమె బాలీ వుడ్ నటేనని భాషా భేషజాలు లేకుండా పాత్రలో లీనమై ప్రతీ పాత్రలోనూ జీవించి తన జీవితానికి తానే కొలమానంగా అంచలంచెలుగా ఎదిగి అందని లోకాలకు ఎగిరిపోయిన శ్రీదేవికి అశృతార్పణలు.

Send a Comment

Your email address will not be published.