జ్ఞాపకాల వలయం

జ్ఞాపకాల వలయం

రాత్రి వీడ్కోలు పలికి వెళ్తున్నప్పుడు ఉదయం దగ్గర  నీడలను విడిచిపెట్టి పోతుంది.
అగరవత్తులు ఆరిపోయినా  పరిమళాన్ని విడిచిపెట్టి  పోతుంది.
నది  ఎండిపోయినా  అంతకుముందు వరకు  తాను నడచిన గుర్తులను విడిచిపెట్టి  పోతుంది.
ఇంటిని తగలుపెట్టిన నిప్పు సైతం   బూడిదను విడిచిపెట్టి పోతుంది.
మనిషి    మరణించినా ఏదో ఒకటి శేషంగా  విడిచి పెట్టి పోతాడు.

ఒక అతను  ప్రేమలో ఓటమి చవిచూసాడు.
అతను ప్రేయసి  అతనికి  దూరమై పోయింది.
ఆమె  ఇప్పుడు  అపరిచితురాలిగా మారిపోయింది.
ఆమె ఇక  ఎప్పుడూ అతనికి దొరకదు.
ఆమె  వెళ్ళిపోయింది. కానీ  ఆమె తన  గురించి అతనిలో  ఉన్న  జ్ఞాపకాలను ఆమె తనతో తీసుకుని  వెళ్ళలేకపోయింది.

అవి  అందమైన జ్ఞాపకాలు.
ఆమెను కలిసి, సరసాలాడి, ప్రేమించి,  ఇలా ఎన్నో జ్ఞాపకాలతో ఓ గూడు కట్టుకున్న  మనసు అది.
అతను ఆ  జ్ఞాపకాలను  దూరం  చేయలేదు. దూరం  చేయాలనుకున్నా  చేయలేకపోతున్నాడు.

మనసు  ఒక  కెమెరా.  అది  తీసిన ఫోటోలను దేనితోనూ చెరపలేము…దేనిని  వదులుకోవలసి  వస్తుందో దానిని  మనసు పెద్దగా  చేసుకుని మనముందు నడిపిస్తూ ఉంటుంది. హృదయంలో  కన్నీరు గీసిన చిత్రాలు  చెదరిపోవు.
జ్ఞాపకం ఒక  దీపం. హృదయ  చీకట్లో  అది  శోకాన్ని పుట్టిస్తుంది. అందరూ అతనిని  చూసి “ఆమె  నీకు  ఇక  లేదన్నట్టు ఖాయమైపోయింది. ఆమెను  ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆమెను మరచిపో”  అంటున్నారు.

వారిని  చూసి అతను  చెప్పాడు….
“అందమైన  జ్ఞాపక  దీపాలను
నన్ను మండించనివ్వండి
నా  హృదయంలో
ఆశల సమాధి ఉంది”  అని ఓ  ఉర్దూ కవితను చెప్తూ కాలం  గడుపుతున్నాడు.

–  యామిజాల  జగదీశ్

Send a Comment

Your email address will not be published.