తాతకు తగ్గ మనవడు 'తారక్ '

తాతకు తగ్గ మనవడు ‘తారక్’
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు

తెలుగు చిత్రపరిశ్రమలో తాతకు తగ్గ మనవడుగా గుర్తింపు పొందాడు తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్). ఇతని పేరు నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావుకు మనుమడు మాత్రమే కాదు తనహావభావాలతో నటనా పరిణితితో ఆయననే గుర్తుకుతీసుకొస్తుండడం ఇతని ప్రత్యేకత

తారక్ మే 20, 1983 న జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు.

చిత్ర రంగంలో
ఇతని తాత ఎన్ టీ రామారావు , తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తరువాత బాల రామాయణము చిత్రంలో తారక్ రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పొందింది . ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు . ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు. ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి . బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి . రాఖీ చిత్రంలో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది.

2007 లో గత చిత్రాలు “స్టూడెంట్ నెం.1”, “సింహాద్రి”ల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి, లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు. 2008 లో “మెహర్ రమేష్” దర్శకత్వంలో నటించిన “కంత్రి” అనే చిత్రం పరాజయం పొందింది.

2010 లో “వి.వి.వినాయక్” దర్శకత్వంలో వచ్చిన “అదుర్స్” మంచి విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం “వంశీ పైడిపల్లి” దర్శకత్వంలో వచ్చిన “బృందావనం” ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

2011 లో “మెహర్ రమేష్” దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో “శక్తి” చిత్రం కూడా పాటల చిత్రీకరణ బాగున్నా, సినిమా పరాజయం పాలయింది. 2011, అక్టోబరు 6న “సురేందర్ రెడ్డి” దర్శకత్వంలో విడుదలైన “ఊసరవెల్లి” మొదటిరోజు 18 కోట్లకు పైగా వసూలు చేసింది. తదుపరి “బోయపాటి శీను” దర్శకత్వంలో వచ్చిన “దమ్ము” చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచినా, ప్రేక్షకుల, అభిమానులను మెప్పించలేకపోయింది . శ్రీనువైట్ల దర్శకత్వంలో “బాద్ షా” చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా, రభస అనే చిత్రాలు అభిమానుల మన్ననలు పొందలేకపోయాయి.

2015 తన పాత చిత్రం ఆంధ్రావాలా దర్శకుడు పురి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ లో నటించి ఎన్నో ఏళ్ళుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో అధ్బుత నటన కనబరచినందుకుగాను పలువురి నుండి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాక జెమిని ఛానెల్లో ఈ చిత్రం ప్రసారమై 26.5 టి.ఆర్.పితో అన్ని రికార్డులను చెరిపివేసింది. 2015 ఐఐటీ మద్రాస్‌ టాక్‌ సెషన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూ.ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు, తారక రాముని తర్వాత మళ్లీ అంతటి దివ్యరూపం భాష యాస తనకే ఉన్నాయని కితాబిచ్చారు రాజమౌళి, తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక ప్రజాదరణ సాధించి రికార్డు సృస్టించింది. ఈ చిత్రంలో అతని గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు, ఫోర్బ్స్ మోస్ట్ డిసైరబుల్ మెన్-2015లో రెండవ స్థానాన్ని సంపాదించాడు.

ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు. ఇది కూడా ఘన విజయాన్ని సాధించింది. 2017 దసరాకి జై లవ కుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. బుల్లితెరలో కూడా “బిగ్ బాస్”షో ద్వారా తను ఏంటో నిరూపించుకున్నాడు. 2010 లో వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్ర్రంలో ఉత్తమ నటన ప్రదర్శించాడు . దీని తరువాత ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ తో మల్టీస్టారర్ చిత్రంనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు (మే20న) పుట్టినరోజు జరుపుకొంటున్న తారక్ ని తెలుగు ప్రేక్షకలోకం అభినందిస్తోంది.

Send a Comment

Your email address will not be published.