తెలుగింట తొలి పండుగ

Ugadi 2020

ప్రతి తెలిగింట్లోనూ తొలిపండుగ ఉగాది బుధవారం (మార్చి25న) వచ్చేసింది. మనం సాదా శీదాగా చెప్పుకునే ఉగాది అనే పదం వెనుక ఎన్నో విశేషార్ధాలున్నాయి. ఉగస్య ఆది అనేదే ఉగాది. “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పారు.

వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’

ప్రకృతి విశేషం
శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.”ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది.ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది-పర్వదినం.

ఈ ఉగాది పండుగ మన జీవితంలో ఎదరయ్యే మంచి, చెడు, కష్ట, సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని సైతం ఇస్తుంది. అలాగే ఉగాది పండుగ సందర్భంగా అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఇప్పటికే కరోనా వైరస్ అనే మహమ్మారి కూడా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ సమయాన్నే మన బుషులు ‘యమద్రంస్టలు’అన్నారు. యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్ధం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి.

ఉగాది పచ్చడి మహాఔషధం
ఉగాది పండుగ వెనుక ఒక వైజ్జానిక అంశం కూడా ఉంది. ఈ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటారు. ఉగాది పచ్చడిని ఒక మహాఔషధమని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుండి శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ స్వీకరించాలి. అలా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలనేవి దరిచేరవు. ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఈ ఉగాది పచ్చడి. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటి వల్లే వస్తాయి.

విషపదార్థాలను తొలగిస్తుంది
ఉగాది పండుగ రోజున చేసే తైల అభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం)శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విషపదార్థాలు)ను తొలగిస్తుంది. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్లన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. ఉగాది పండుగ సందర్భంగా మన ఇంటిని పూలతో అలంకరించుకుంటూ ఉంటాం. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగినవి. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.

క్రిములు నశిస్తాయి
ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ 9 రోజుల పాటూ వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్రపౌర్ణమి వరకూ దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఒక్క రోజుకాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం. మొత్తంగా చూస్తే ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15రోజుల పాటు నియమబద్ద జీవితం, పవిత్రమైన, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు.
.
ఆయుర్వేదంలో
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని ‘నింబ కుసుమ భక్షణం‘, ‘అశోకకళికా ప్రాశనం‘ అని పేర్లతో వ్యవహరించేవారు. రుతువులలో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే రోగాల నుండి రక్షణగా, ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇంతకుముందు ఉగాది పచ్చడిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవారు. బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు విజయానికి సంకేతంగా భావిస్తారు. వేపలోని చేదు దు:ఖానికి, నష్టానికీ, ద్వేాషానికీ, అపజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ రెండు కలిపి తీసుకుంటే కష్టసుఖాలు, ప్రేమానురాగాలు, విజయం చేకూరాలని చెప్పడమే. ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు‘ అనే మంత్రాన్ని చదువతూ ఉగాది పచ్చడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

Send a Comment

Your email address will not be published.