తెలుగు భాష గుర్తింపునకు సువర్ణావకాశం

తెలుగు సంఘాలు మరియు ఇతర సంస్థలు ఉద్యమ ప్రాతిపదికన చేపట్టవలసిన అంశం

interpreterపరాయి గడ్డపై పర సంస్కృతితో సహ జీవనం చేస్తూ మన భాషా సంస్కృతులను కాపాడుకోవాలన్న తపనతో ఆస్ట్రేలియాలోని తెలుగువారు గత ఐదేళ్ళుగా అలుపెరుగని ప్రయాణంలో తెలుగు భాష గుర్తింపునకు చేసిన కృషిలో మొదటి మెట్టును అధిగమించడం తొలి విజయంగా భావించాలి.  తెలుగు భాష కమ్యూనిటీ భాషగా గుర్తించాలని ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టడం  (తెలుగు భాషకు గుర్తింపు – మరో ముందడుగు) దాని పర్యవసానంగా National Accreditation Authority for Translators and Interpreters Ltd (NAATI) సంస్థవారు కీలకమైన నిర్ణయం చేయడం అందరికీ తెలిసిన విషయమే.

అయితే మనందరి ముందు ఒక అత్యావశ్యకమైన కర్తవ్యం తొంగి చూస్తుంది.

ప్రస్తుతం National Accreditation Authority for Translators and Interpreters Ltd (NAATI) సంస్థ వారు తెలుగు నుండి ఇంగ్లీషు మరియు ఇంగ్లీషు నుండి తెలుగు అనువాదకులు (Translators) మరియు భాష్యకారుల (Interpreters) గురించి వారి వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది.  అయితే ప్రస్తుతం వారి వెబ్ సైట్ లో శోధిస్తే (Search)  ఎవరూ కనబడరు.  ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు భాషలో  NAATI సంస్థచే గుర్తింప బడ్డవారు ఎవరూ లేరు.

ఈ గుర్తింపు పొందడానికి వివిధ మార్గాలు NAATI సంస్థ వారు సవివరంగా పొందుపరిచారు.  ముఖ్యంగా విశ్లేషిస్తే:

  1. Diploma/Certification from a TAFE – ఏదైనా TAFE లో Translation/Interpretation డిప్లొమా కోర్స్ చేసి తెలుగు భాషలో NAATI వారు నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణత పొందడం
  2. Recognised Practising (https://www.naati.com.au/certification/recognised-practising/)

– ఇప్పటికే తెలుగు భాషలో ప్రావీణ్యత ఉండి ప్రబుత్వ సంస్థలకు గానీ, తెలుగు సంఘాలకు గానీ అనువాదం మరియు భాష్యకార్యం చేపట్టి ఉంటే వారు NAATI వారికి దరఖాస్తు చేసుకొని ఈ క్రింద నుదహరించిన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందవచ్చు:

  1. Language Competency (English),
  2. Intercultural Competency and
  3. Ethical Competency

పైనుదహరించిన వాటిలో మొదటి విభాగంలో గుర్తింపు పొందాలంటే కొంత సమయం మరియు ధనముతో కూడుకున్న పని.  అందుకని రెండవది చాలా మందికి అనువుగా ఉంటుంది.  మనలో చాలామంది తెలుగు భాషలో నిష్ణాతులు కనుక దరఖాస్తులు చేయడానికి ఇది వారికి గొప్ప అవకాశం.

ఎంత ఎక్కువమంది దరఖాస్తు చేస్తే అంత త్వరగా NAATI సంస్థ వారు గుర్తింపు పద్ధతిని క్రమబద్దీకరించడానికి అవకాశం ఉంటుంది.  మరియు తెలుగు భాష కమ్యునిటీ భాషగా గుర్తించడానికి మార్గం సులభతరమౌతుంది.

ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘాలు, ఇతర సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి సభ్యులందరికీ దరఖాస్తులు చేయడానికి ప్రోత్సహిస్తే తెలుగు భాష గుర్తింపు వేగవంతమౌతుంది.  ఈ విషయం తెలుగు సంఘాలు అతి ముఖ్యమైన అంశంగా పరిగణించి ఒక ఉద్యమ రూపంలో చేపట్టాలని తెలుగుమల్లి మనవి చేసుకుంటుంది.

Send a Comment

Your email address will not be published.