దివ్యమైనది మా మాట

సిడ్నీ తెలుగుబడి వార్షికోత్సవం – 2017

దివ్యమైనది మా మాట పలుకరో నీ నోట
పరదేశీయులు కూడా కడుమేచ్చేనంట
‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ గా పెరుగాంచెనట
అమ్మ భాషను మించినది అవనిలో లేదంట
IMG-20171206-WA0021
IMG-20171206-WA0028
IMG-20171206-WA0023అమ్మ పలుకులో ఉంది ఆత్మీయత. అమ్మ భాషలో ఉంది అనుబంధం. అక్షర క్రమంలో ఉంది దార్శనికత. అక్షర విన్యాసంలో వుంది సౌమ్యత.

తెలుగు అక్షరమే ఒక సంస్కృతికి ప్రతీక. ఒక జాతికి చిహ్నం. ఒక సంప్రదాయానికి నిదర్శనం. ఒక మహోత్కృష్టమైన వారసత్వానికి ప్రమాణం.
IMG-06-వేలమైళ్ళ దూరం వచ్చినా మన వారసత్వం మరువలేము. ప్రవాసంలో తరతరాలు జీవించినా మన వాసనలకు దూరం కాలేము. అక్షరమే మన ఆయుధంగా పయనిస్తే అమ్మ భాషని అమర భాషగా చేయగలము.
సిడ్నీ తెలుగు సంఘం ఏర్పడి పాతికేళ్ళు కావచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నో మార్పులు. ఎత్తు పల్లాలు. ఒడుదుడుకులు. అయినా 1993లో స్థాపించిన తెలుగు బడి ఒకటి రెండు సంవత్సరాలు అంతరాయం తప్ప ఇప్పటివరకూ కొనసాగిస్తూ భావి తరాల వారికి అక్షర సుమాలను అందిస్తూ స్పూర్తిదాయకంగా నిలిచారు.

ఈ నెల 2వ తేదీన అత్యంత వైభవంగా వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటు సభ్యులు జోడి మేకే మరియు జెఫ్ లీ విచ్చేసారు. న్యూ సౌత్ వేల్స్ ఫెడరేషన్ అఫ్ కమ్యూనిటీ లాంగ్వేజ్ స్కూల్ తరఫున ఉపాధ్యక్షులు తిరు తిరువనంత కుమార్, కౌన్సిలర్ చరిష్మా కలియండ, మాజీ కౌన్సిలర్ రాజ్ దత్త, హొర్న్స్ బీ మాజీ డిప్యుటీ మేయర్ శ్రీ గుర్దీప్ సింగ్ కూడా రావడం జరిగింది.

జోడీ మేకే మాట్లాడుతూ తెలుగు అసోసియేషన్ వారు తమ పిల్లలకు మాతృ భాష నేర్పించి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నందుకు అభినందించారు. జెఫ్ లీ మాట్లాడుతూ తెలుగు బడులు శ్రద్ధాసక్తులతో నిర్వహణలో ముఖ్య పాత్ర వహిస్తున్న శ్రీ మల్లిక్ రాచకొండ గారిని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రస్తుతం సిడ్నీలో ప్రతీ వారం 5 చోట్ల 20మంది స్వచ్చంద ఉపాధ్యాయులతో 100 మంది పిల్లలకు తెలుగు బడి నిర్వహిస్తున్నారు. శ్రీ మల్లిక్ రాచకొండ గారు గత పదేళ్లుగా తెలుగుబడి నిర్వహణలో ఎంతో శ్రద్ధ తీసుకొని ఇక్కడి పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆధునిక సాంకేతిక పద్ధతులను వాడి ఇప్పటివరకూ 4 పుస్తకాలు వ్రాసారు. ఈ పుస్తకాల్లోని పాఠ్యాంశాలు ఆధారంగా సిడ్నీలోని అన్ని బడుల్లో పిల్లలకు తెలుగు నేర్పించడం జరుగుతుంది.

సిడ్నీ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ కూచి మాట్లాడుతూ తెలుగు బదులు ఐదు చోట్ల దిగ్విజయంగా నడపడానికి కారకులైన శ్రీ మల్లిక్ రాచకొండ గారికి మరియు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర వహించిన పిల్లలు, తల్లిదండ్రులు, స్వచ్చంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు లఘు నాటికలు, పాటలు, శ్లోకాలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
IMG-20171206-WA0029
IMG-20171206-WA0022
IMG-20171206-WA0030

Send a Comment

Your email address will not be published.