దీపోత్సవం...దీపావళి

Candles Floating in Waterదీపావళి…హిందువుల పండుగలలో పెద్ద పండుగ అనిపించుకున్న బోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ తరావత హడావిడి చేసే పండుగలలో దీపావళి ముందుంటుంది. ఇది కూడా ఒక్కరోజుతో సరిపెట్టేసే పండుగ కాదు. కనీసం రెండు రోజులైనా చేసుకుంటారు ఈ పండుగను. అది కూడా ఆహా ఓహో అనే.

ఆశ్వయుజ మాసంలో జరుపుకునే పండుగ ఇది. మన భారత దేశంలో దక్షిణాదికన్నా గుజరాతీయులకు ఈ పండగ ఎంతో ముఖ్యమైనది. గుజరాతీ వారికి దీపావళి అనేది సంవత్సరాది. ఈరోజు నుంచే వారు పద్దులు కోసం కొత్త పుస్తకాలు పెట్టుకుంటారు. పైగా ఈ పుస్తకాలను కూడా ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు మంచి ముహూర్తం చూసి కొనుక్కుంటారు. అలా కొన్న వాటిని విలువైన పట్టు జేబురుమాళ్ళతో చుట్ట చుట్టి వాటి మీద పన్నీరు చల్లుతారు. ఆ తర్వాత వాటిని ఇంటికి తీసుకొచ్చి పూజిస్తారు.

గుజరాతీయులు దీపావళికి రెండు రోజులు ముందు, రెండు రోజుల తర్వాత కూడా ఈ పండగ చేసుకుంటారు. అంటే వారు దీపావళిని అయిదు రోజులపాటు చేసుకుంటారని వేరేగా చెప్పక్కర్లేదు.
గుజరాత్ కు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో దీపావళి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఆరోజు వారు ఇళ్ళను శభ్రం చేసుకుంటారు. ఇల్లంతా అలికి కడిగి రంగు రంగుల మొగ్గులు వేస్తారు. వీధి వాకిలి కూడా రంగురంగుల మొగ్గులతో ప్రత్యక్షమవుతాయి. అవి చూసే వారందరినీ ఆకట్టుకుంటాయి. అలా ఇల్లంతా శుచిగా ఉంచితే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని వారి నమ్మిక. ఆ రోజునుంచే వారు దీపాలు కూడా వెలిగించడం ప్రారంభిస్తారు. ఆరోజు అభ్యంగన స్నానం చేస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. సుగంధద్రవ్యాలు రాసుకుని ధన పూజ చేస్తారు.

ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే నరకచతుర్దశి, దీపావళి ఘనమైన రోజులు.

ఆశ్వయుజ బహుళ చుతుర్దశినే నరకచతుర్దశిగా జరుపుకుంటారు. నరకచతుర్దశినే ప్రేత చతుర్దశి అని అంటారు. గుజరాతీయులు ఈ నరకచతుర్దశిని కాల చౌదశ్ అని అంటారు. సంస్కృతంలో అయితే కాళచతుర్దశి అవుతుందది. అంటే అంధకారపు చతుర్దశి అని అర్థం.

ఈ చతుర్దశి నాడు ఎవరైతే నరకలోక వాసులకోసం దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలందరూ నరకలోకం నుండి స్వర్గలోకానికి చేరుకుంటారని ఓ కథనం. స్నానం చేస్తున్నప్పుడు తల చుట్టూ దీపం తిప్పడమూ, బాణాసంచా కాల్చడం సంప్రదాయం. చతుర్దశి రోజున నువ్వులనూనెతో తలంటుకోవాలి. ఎందుకంటే తిలతైలంలో లక్ష్మీదేవి ఆవేశించి ఉంటుందని ఓ అభిప్రాయం. మరోవిధంగా చెప్పాలంటే, నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన దినం కావడంతో దీనికి నరకచతుర్దశి అనే పేరు వచ్చినట్టు కూడా చెప్తారు. కానీ కొందరు ఈ మాటలు కొట్టివేసినప్పటికీ అధికశాతం మంది అభిప్రాయం మాత్రం ఇదే. నిర్ణయసింధువు ప్రకారం నరకచతుర్దశి అంటే నరకం నుండి తరింపజేసే చతుర్దశి అని అర్థం. మరుసటిరోజు దీపావళిని జరుపుకుంటారు. దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమిచ్చే రోజు కావడంతో దీనికి దీపావళి అనే పేరొచ్చింది. లక్ష్మిదేవి ఈరోజు భూలోకానికి వచ్చి ప్రతి ఇంటి తలుపు తడుతుందని ఆస్తికుల నమ్మిక. అందుకే ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలని అంటారు. ఈరోజు దీపాలు వెలిగించి చిన్నా పెద్దా ధనిక పేద అనే తేడాలు లేకుండా టపాకాయలు కాల్చి ఈ పండుగ జరుపుకుని ఆనందిస్తారు. బంధువులు, సన్నిహితులు, మిత్రులు కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. తీపిపదార్థాలు పంచుకుంటారు. దీపావళి పండుగకు వెలుతురు తీసుకొచ్చి చప్పుడు చేసే బాణాసంచా కాల్చడంలో ఓ ఆనందముంది. ఈ బాణాసంచా పొగకు దోమలు నశిస్తాయి. ఏదేమైనా ఈ పండుగను జాగర్తగా చేసుకోవడం ముఖ్యం. బాణాసంచా కాల్చేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. కనుక పిల్లలతో టపాకాయలు కాల్పించాలనుకునే పెద్దలు దగ్గరుండి ఆ పని చేయించడం ముఖ్యం. ఏదేమైనా ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలుగుమల్లి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
– యామిజాల

Send a Comment

Your email address will not be published.