దైవలీల

దైవలీల

భగవంతుడినే సదా నమ్ముకుని అతని చేయూతతోనే నడుస్తున్నట్టు జీవించే వారి విషయంలో కొన్ని  సంఘటనలు  ఆశ్చర్యపరుస్తాయి.  అలాంటి సంఘటనలు వారిలో దేవుడి  మీదున్న  విశ్వాసాన్ని మరింత  గట్టిపరుస్తాయి. అటువంటి వాళ్ళు ఏ కొండకోనల్లో ఉన్నా వారిని పరీక్షించి ఇట్టే మళ్ళీ ఆదుకునే  విషయాలు జరుగుతుంటాయి.

స్వామి   వివేకానంద జీవితంలో జరిగిన  ఈ  సంఘటనను చూద్దాం…

ఒకరోజు  స్వామి వివేకానంద  రాదా కొలనులో   స్నానం  చేయడానికి వెళ్ళారు.  అప్పట్లో  ఆయన  వద్ద  ఒక్క కౌపీనం మాత్రమే  ధరించేవారు.  ఆయన  వద్ద మరో గుడ్డ కూడా లేదు. ఆయన కౌపీనాన్ని  ఉతికి ఆరబెట్టి   స్నానం  చేయడానికి నీళ్ళల్లో  దిగారు.

స్నానం కానిచ్చుకుని   గట్టు మీదకు వచ్చారు. తీరా ఆయన  ఎక్కడైతే  కౌపీనం ఆరబెట్టారో అక్కడ  అది కనిపించలేదు….. చుట్టూ  చూసారు. కనిపించలేదు.

చెట్టు మీదకు చూసారు.  చెట్టు  మీద కూర్చున్న ఒక కోతి చేతుల్లో తన కౌపీనం కనిపించింది. కోతి నుంచి  ఆ కౌపీనాన్ని పొందడం అంత సులభమా? ఆలోచించారు.  ఆయన దగ్గర  మరో  వస్త్రం లేదు.  ఇప్పుడేం చెయ్యాలి…అని  ఆలోచించారు.

స్వామీజీకి రాధ  మీద కోపం  వచ్చింది.

అప్పుడు ఆయన  ఇలా అనుకున్నారు…

“అమ్మా….నేనిప్పుడు ఊళ్లోకి  ఎలా  వెళ్ళాలి? కనుక మరో  దారిలేక  నేను అరణ్యంలోకి  వెళ్ళక  తప్పదు. అరణ్యంలోని  ఉండి  అన్నపానాదులకు దూరమై పస్తులుండి  ఏదో ఒకరోజు చచ్చిపోతాను” అని అనుకుంటూ  వేగంగా దగ్గరున్న అరణ్యంలోకి అడుగులు వేసారు.

ఇంతలో  అక్కడికి ఓ భక్తుడు  వచ్చాడు. అతని వద్ద ఒక  కొత్త కాషాయ  వస్త్రం  ఉంది. అతను దానిని స్వామీజీకి ఇచ్చాడు.

అది అందుకున్న  స్వామీజీ  కళ్ళ  నుంచి  నీళ్ళు జలజలా  కారాయి.

మళ్ళీ ఆయన కొలను గట్టు   దగ్గరకు వచ్చి చూసారు. ఆశ్చర్యం,  ఆయన స్నానానికి  ముందు ఎక్కడైతే కౌపీనాన్ని ఉతికి ఆరవేసారో అక్కడే ఆ కౌపీనం ఉంది.

భగవంతుడి లీలలు ఇలాగే ఉంటాయి అనుకున్నారు స్వామీజీ…

– సుమా హరి

Send a Comment

Your email address will not be published.