నచ్చలేదా..ఎప్పటినుంచీ?

డియర్

నచ్చలేదంటున్నావు కదూ… ఎప్పటినుంచో చెప్తావా….

నీ సుతిమెత్తని దూదిపిందేల్లాంటి  పాదాలు గరుకు నేలమీద నడిచేటప్పుడు ఇబ్బందులు పడకూడదని దారిపొడవునా తివాచీ పరచి పువ్వులు చల్లానని నేను చెప్పినప్పుడా..?

నువ్వు జలక్రీడ చేసిన తర్వాత  సరోవరమంతా మకరందమయమవుతుందని నేను చెప్పినప్పుడా…?

అన్ని ఉదయాలూ రాత్రే నాకు….కానీ నువ్వొస్తే  ప్రతి రాత్రీ పగలే అని నేను చెప్పినప్పుడా..?

నీ బంగారు మేనిని చూసి నిలువెత్తు అద్దం సిగ్గుతో ఎరుపెక్కుతుందని నేను చెప్పినప్పుడా…?

నువ్వు పెదవులతో స్పృశించినప్పుడు విప్పారిన పువ్వు అల్లంతలోనే మళ్ళీ మొగ్గై నీ ముద్దు కోసం ఆరాట పడుతోందని  నేను చెప్పినప్పుడా…?

నువ్వు ఓర చూపులు చూసినప్పుడు దారి తప్పిన మేఘాలు మళ్ళీ సన్మార్గంలోకి వస్తున్నాయని నేను చెప్పినప్పుడా..?

నువ్వు నిద్ర పోకుండా రాత్రి నీ ఇంటి డాబా మీద విహరిస్తున్నప్పుడు నువ్వే అసలైన చందమామ అని మేఘాలు నీ ఇంటిని  చుట్టుముట్టాయని నేను చెప్పినప్పుడా..?

నీ చూపులు సోకితే బండరాయి అయినా కరిగిపోతుందని నేను చెప్పినప్పుడా..?

సరే , నచ్చలేదంటున్నావు….నన్ను…ఎప్పటినుంచో అనేది కచ్చితంగా చెప్పు….అది నిజమే కాదో నన్ను నేను సమీక్షించుకున్నప్పుడు తెలిసిపోతుంది…..

అందులోని వాస్తవం తేలినప్పుడు నన్ను నేను నీకు దూరంగానే ఉండనిస్తాను…

అప్పటి వరకు నీకూ నాకూ మధ్య ప్రేమ పర్వం విహరిస్తూనే ఉంటుంది….

ఏమంటావు

నీ యామిజాల జగదీశ్

 

Send a Comment

Your email address will not be published.