నదీ, సముద్రం..మనిషి

నదీ, సముద్రం..మనిషి

మనం ఎక్కడి నుంచి ఈ భూమ్మీదకు వచ్చాం?
ఈ భూమ్మీద నుంచి మళ్ళీ ఎక్కడికి పోతున్నాం?
ఇత్యాది ప్రశ్నలు జ్ఞానమాలిక తాళాలు.

ఈ ప్రశ్నలు అందరిలో ఎప్పుడో అప్పుడు వచ్చినా కొందరే జవాబు కోసం వెతుకుతారు….జ్ఞానం పొందగల వారికే పుట్టుకొస్తాయి జవాబులు కూడా….

నేను ఎవరు?
ఈ ప్రపంచం ఎలా వచ్చింది?
ఇదేమిటి?
జననం
మరణం
మరణం
జననం
ఎలా వచ్చాయి?
ఇలా నీకు నీలో ప్రశ్నించుకో
దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది
అంటోంది ఉపనిషత్తు….

ఈ ప్రశ్నలు అడిగే వ్యక్తి చీకట్లో దీపం వెలిగించి అడుగుతాడు …
దీపం వెలుగులో అతను జవాబులు తెలుసుకుంటాడు…చూస్తాడు…
అలా దీపం వెలిగించి జవాబులు దర్శించుకున్న వాళ్ళు తాము చూసి తెలుసుకున్నది మనకు చెప్తారు…చూపించేలా చేస్తారు…

మనం ఎక్కడి నుంచి వచ్చామో
ఎక్కడికి వెళ్తామో
మనిషి మెదడుకి అందదు
దానిని మాటల్లో వర్ణించలేం
అందుకే జ్ఞానులు తాము దర్శించిన దానిని
విడమరిచి చెప్తారు
వాళ్ళల్లో ఓ సారూప్యం లేకపోలేదు
చాలా మంది నది అనే దానినే ప్రధాన ఉదాహరణంగా చెప్పుకొచ్చారు….

ప్రవహించే నదులు ఎలా తమ నామ రూపాలను త్యజించి
సముద్రంలో కలిసిపోతాయో
అలాగే జ్ఞాని
తన నామ రూపాలనుంచి విముక్తి పొంది
శ్రేష్టమైన వాటిలో విశిష్టమైన
తేజోమయమైన పురుషుడిని చేరుకుంటాడు
అని ఉపనిషత్తు మాట….

నదులన్నీ
సముద్రంకేసి వెళ్ళేలా
ఆకాశానికి
దిగువన ఉన్న వన్నీ
తావో దిశలోకి వెళ్తాయి అని ఓ తావో గురువు చెప్పారు.

దేవుడా,
నీ సముద్రం వైపు
పరుగులు తీసే నదులం మేము
మా కెరటాలు
చిన్న చిన్న అలలూ
నీ నుంచేగా వచ్చాయి అన్నాడు ఓ ఇంగ్లీష్ కవి…

మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి పోతున్నాం? వంటి వాటిని
“నదులూ – సముద్రం” ఎంతో గొప్పగా చెప్పాయి కదూ…?

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.