నాడు బిచ్చగత్తే ...

ramanasriమట్టిలోనే మాణిక్యాలు దాక్కుని ఉంటాయన్న పెద్దల మాట మనందరికీ తెలిసిందే. అలాంటి మాణిక్యాన్ని కనుగొని సాధనతో సానపడితే అవి సమాజానికీ కళారంగానికీ ఒక ప్రకాశాన్ని అందిస్తాయి. అటువంటి కళాకారిణి వనపర్తి రమణమ్మ. అలియాస్‌ రమణశ్రీ.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఈమెది. పుట్టింది చాలా పేద కుటుంబం. పొట్టకూటికి కూడా లేని పరిస్థితి. తోలుబొమ్మలాట వీరి కుటుంబ వృత్తి. ఇలాంటి కుటుంబాలు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని డీసీపల్లి, బోయలచిరివెళ్ల, నబ్బీనగరం, శంకర్‌నగరం, లింగంగుంట, పువ్వూరుపాడులలో ఉన్నాయి. వీరిలో డీసీపల్లి కళాకారులు దశాబ్దాల క్రితమే విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. అటువంటి కుటుంబానికి చెందిన వనపర్తి రమణమ్మ, తన అన్న ఆంజనేయులతో కలిసి ఏడేళ్ల పసిప్రాయం నుంచే పొట్టకూటి కోసం ఆత్మకూరు బస్టాండ్‌తో పాటు రోజుకోచోట వీధుల్లో తిరుగుతూ పాటలు పాడుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకునే వారు. ఈ క్రమంలో పౌరాణిక రంగంలో రాష్ట్రంలోనే దిగ్గజ కళాకారుడైన రేబాల రమణ ఓ సారి ఆత్మకూరు వచ్చినప్పుడు వీరి గురించి తెలుసుకున్నారు. ఆ అన్నా చెల్లెళ్ళని తన వద్దకు పిలిపించుకుని ఇక నుంచి రోడ్ల వెంబడి బిచ్చానికి తిరగవద్దని, కళాకారులుగా తీర్చిదిద్దుతానని ఆదాయ మార్గం చూపుతానని వెన్నుతట్టి ప్రోత్సహించారు. పౌరాణిక నాటకాలలో శిక్షణ ఇప్పించారు.

రమణ ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. మంచికళాకారిణిగా రూపొందింది విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి పౌరాణిక నాటకాల్లో నటించింది. చిత్ర, కలహకంటి, మాతంగి, బాలనాగమ్మ, లచ్చి, మంజరి, సంగు, ముత్తి, తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఓ దశలో ఆమెకు గుండెపోటు రావడంతో పౌరాణిక రంగ కళాకారులు ఆర్థికసాయం చేసి ఆపరేషన్‌ చేయించారు. ఆ తర్వాత కూడా ఆమె కళారంగానికి దూరం కాలేదు. నాటకాలు వేస్తూ రంగస్థల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే ప్రస్తుతం పౌరాణికాలకు ఆదరణ తగ్గిందన్నది రమణశ్రీ అభిప్రాయం. చిన్నతనం నుంచి కళాభిమానంతో ఈ రంగంపైనే ఆధారపడ్డాం. పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూ దిగ్గజ కళాకారుల సరసన నటించే అవకాశం దక్కింది. ప్రభుత్వ సహకారం అందించి పౌరాణికాలను కాపాడితే మాలాంటి కళాకారులతో పాటు ఈ కళ కూడా సజీవంగా నిలుస్తుందని రమణశ్రీ కోరుతోంది.

Send a Comment

Your email address will not be published.