పక్కా మాస్ ‘దేవదాస్’

DevDasమాస్ సినిమాలు మెచ్చే ప్రేక్షకులకు సంతృప్తి కలిగించేలా ‘దేవదాస్’ మల్టీ స్టారర్ సినిమా గురువారం విడుదలైంది. తెలుగు సినిమాలో మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే ఈ మల్టీస్టారర్ చిత్రాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. మధ్యలో స్టార్ హీరోలు మల్టీస్టారర్లపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇలాంటి చిత్రాలు రాలేదు. ఇప్పుడు యువ హీరోలు మాత్రం తోటి హీరోలను నటించడానికి సై అంటున్నారు. అందుకే తెలుగులో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్లు బాగానే వస్తున్నాయి. అలాంటి వాటిలో ‘దేవదాస్’ ఒకటి. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం పై పెద్ద అంచనాలే ఉన్నాయి శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ
డాక్టర్ దాస్ (నాని).. ఎంబీబీఎస్, ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. తన మంచితనం, నిజాయతీతో కార్పోరేట్ హాస్పిటల్‌లో ఉద్యోగం కోల్పోతాడు. ఇక చేసేదేమీ లేక దూల్‌పేట‌లో పాడుబడిన క్లినిక్‌ను మళ్లీ తెరిచి రోగుల కోసం వేచి చూస్తూ ఉంటాడు. మరోవైపు, ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌గా ఎదిగిన దేవ(నాగార్జున) పదేళ్ల తరవాత అనుకోని కారణాల వల్ల హైదరాబాద్‌కు వస్తాడు. అప్పటికే అతని కోసం ఎదురుచూస్తున్న పోలీసులు దేవపై ఎటాక్ చేస్తారు. ఈ ఎటాక్‌లో గాయాలతో బయటపడిన దేవ.. నేరుగా దాస్ క్లినిక్‌కు వెళ్తాడు. దాస్ అతనికి చికిత్స చేసి కాపాడతాడు. అయితే దేవ గురించి పోలీసులకు చెప్పడు. అతని గురించి తెలుసుకుని మార్చాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. మరోవైపు ఎలా ఉంటాడో తెలియని దేవాను పట్టుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. మరి దేవాను దాస్ మార్చగలిగాడా? చివరకు దేవ పోలీసులకు దొరికాడా? వీళ్ల ప్రయాణంలో పూజ (రష్మిక మందన), జాహ్నవి (ఆకాంక్ష సింగ్) పాత్రలు ఏమిటి? అనేదే సినిమా.

ఎలా ఉందంటే..
నలుగురు ప్రాణాలు తీయడంలో లేని ఆనందం ఒక ప్రాణాన్ని కాపాడటంలో ఉంటుంది. ఒకరిని ఒకరు చంపుకోవడం కాదు.. వీలైతే ఒక ప్రాణాన్ని కాపాడగలగాలి. ఇదే ఈ సినిమా ప్రధానాంశం. కథలో పెద్దగా బలం లేకపోయినా కథనాన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బాగానే నడిపించారు. తరవాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడి ఊహకు అందుతున్నప్పటికీ సరదా సరదా సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. నాగార్జున, నాని స్టార్‌డమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమా మొత్తాన్ని వీళ్లిద్దరూ తమ భుజస్కందాలపై నడిపించారు. నాగ్, నాని మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. కామెడీ, ఎమోషన్ అన్నీ పండాయి.

ఫస్టాఫ్‌లో దాస్-దేవ స్నేహం, అలాగే దాస్-పూజ లవ్ ట్రాక్‌ను చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో దేవా ఎలా మారాడో చూపించారు. ఫస్టాఫ్‌లో కామెడీ, లవ్ ట్రాక్, పాటలతో ఆహ్లాదరకంగానే ఉంటుంది. ఇంటర్వల్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ సెకండాఫ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని ప్రేక్షకుడిలో కలుగజేస్తుంది. కానీ ఆ ఆసక్తి సెకండాఫ్‌లోకి అడుగుపెట్టాక ఎంతసేపో ఉండదు. ఎందుకంటే అప్పటికే సినిమా ఎటు వెళ్తుందో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. దేవ-జాహ్నవి లవ్ ట్రాక్‌ కూడా అంత ఆసక్తికరంగా ఏమీ లేదు. అయితే ఒక చిన్న పిల్లాడి మరణం దేవాలో మార్పుతీసుకొచ్చిన సన్నివేశం ప్రేక్షకుడితో కంటతడి పెట్టిస్తుంది. ఆ పిల్లాడు చనిపోయే ముందు దేవాతో చెప్పే మాటలు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే ఆఖర్లో ఒక ఫైట్, విలన్‌ను చంపేయడం కామన్. కాకపోతే క్లైమాక్స్‌లో ఆసక్తికర సన్నివేశం ఉంది. అదేంటో థియేటర్‌లోనే చూడాలి.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా నాగార్జున, నాని కోసమే తీసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్రల్లో వీళ్లిద్దరూ అంత బాగా నటించారు. మంచితనం, నిజాయతీ, ఎవరికీ హాని తలపెట్టని తత్వం కలిగిన డాక్టర్ పాత్రలో నాని నటన అద్భుతం. తన అమాయకత్వంతోనే హాస్యాన్ని పండించారు. నాని కనిపించే ప్రతి సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. ఇక డాన్ పాత్రలో నాగార్జున అదరగొట్టారు. సుమారు అరవయ్యేళ్ల వయసులోనూ కండలు తిరిగిన బాడీతో కింగ్ అనిపించుకున్నారు. అక్కినేని అభిమానులకు ఇది ఫుల్ ఫీస్ట్. ఆ స్టైల్, గ్లామర్, కాస్ట్యూమ్స్.. నాగ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తాయి. ‘నువ్వు చదివే స్కూలుకి నేను హెడ్ మాస్టర్‌ని రా’ అంటూ విలన్‌తో నాగ్ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది. ఇక రష్మిక మందన తన క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యతే ఉంది. టీవీ యాంకర్ జాహ్నవిగా ఆకాంక్ష మెప్పించింది. ప్రధాన విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్‌ చూడటానికి బాగున్నాడు. అయితే నటించడానికి ఆయనకు పెద్దగా స్కోప్ లేదు. శరత్‌ కుమార్, మురళీశర్మ, నరేష్, సత్య, రావు రమేష్, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతికంగా..
సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను నిర్మించినట్లు నిర్మాత సి.అశ్వినీదత్ చెప్పారు. సినిమా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పాటల చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. మణిశర్మ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా నాగార్జున స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే ప్రతిసారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సినిమా నిడివి కాస్త ఎక్కువగానే ఉంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది.. కథలో కొత్తదనం, వైవిధ్యం లాంటివి కోరుకుండా రెండున్నర గంటలపాటు వినోదం ఉంటే చాలు అనుకునే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ కలగలిపిన ఓ కమర్షియల్ సినిమా ‘దేవదాస్’

నటీనటులుః
నాగార్జున, నాని,రష్మిక మందన,ఆకాంక్ష సింగ్,వెన్నెల కిషోర్,రావు రమేష్,నవీన్ చంద్ర,నరేష్ వీకే,కునాల్ కపూర్,శరత్ కుమార్
దర్శకత్వంః శ్రీరామ్ ఆదిత్య

Send a Comment

Your email address will not be published.