ప్రపంచ తెలుగు మహోత్సవం మహా యజ్ఞం

ప్రపంచ తెలుగు మహోత్సవం మహా యజ్ఞం

  ఏప్రిల్ 12, 13, 14 వ తేదీలలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ మహానగరములో రెండవ ప్రపంచ తెలుగు మహోత్సవం రంగ రంగ వైభవంగా తెలుగు దనం ఉట్టిపడేలా కన్నుల పండువుగా జరిగింది. ఈ ఉత్సవానికి ఆస్ట్రేలియాలోని అన్ని నగరాలనుండే కాకుండా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల నుండి ప్రత్యేక ప్రతినిధులు రావడం ఎంతో ముదావహం. భారత దేశం నుండి జానపద నృత్య కళాకారులు, మిమిక్రీ, బుర్రకధ, హరి కధ వంటి ప్రాచీన కలలలో అద్భుతమైన ప్రావీణ్యత గల షుమారు వంద మంది ఈ ఉత్సవంలో పాల్గొనడం విశేషం. ముఖ్య అతిధులుగా ప్రముఖ సినీ గాయకులు పద్మభూషణ్ శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం, మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు, ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, 20 సూత్రాల సంఘం అధ్యక్షులు శ్రీ నారెడ్డి తులసి రెడ్డి గారు, సినీ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు, రామ్కీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీమతి ఆళ్ళ దాక్షాయని రెడ్డి గారు ఈ ఉత్సవంలో పాల్గొని సభికులనందరినీ ఆకట్టు కున్నారు. ఆస్ట్రేలియా ప్రముఖుల్లో NSW మంత్రి వర్యులు శ్రీ విక్టర్ డోమినేల్లో, పార్లమెంటు సభ్యులు శ్రీ జేసన్ క్లేర్, గ్రీన్వే పార్లమెంటు సభ్యులు మిచెల్ రోల్లాండ్, పరమాట పార్లమెంటు సభ్యులు శ్రీ జేఫ్ఫ్ లీ, బ్యాంక్స్ టౌన్ మేయర్ శ్రీ కార్ల్ ఆశ్ఫోర్, షౌకత్ ముసల్మాన్ MLC, సబ్ కాంటినెంట్ ఫ్రెండ్స్ అఫ్ లేబర్ అధ్యక్షులు శ్రీ హరీష్ వేల్జి, యునైటెడ్ ఇండియా అసోసియేషన్స్ అధ్యక్షులు శ్రీ అమరిందర్ బజ్వా పాల్గొన్నారు ఈ ప్రముఖులతో పాటు ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మణి శర్మ సంగీత విభావరి మరియు పాడుతా తీయగా వారి వీనులవిందైన సంగీత రాగలహరి ప్రేక్షకులను ఎంతో ఆకట్టు కున్నాయి. ఆస్ట్రేలియాలోని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు ముఖ్యంగా మెల్బోర్న్, కాన్బెర్రా మరియు బ్రిస్బేన్ నగరాలనుండి వచ్చిన తెలుగు భాషాభిమానులు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను అద్దం పట్టే కార్యక్రమాలను రంగ స్థలం పై ప్రదర్శించి అందరి మన్నలను పొందారు. మొదటి రోజు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారు జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఉత్సవ ప్రారంభోత్సవం జరిగింది. తమ స్వాగాతోపన్యాసంలో ప్రపంచ తెలుగు మహోత్సవం అధ్యక్షులు శ్రీమతి అరుణ చంద్రాల గారు సభానలన్కరించిన ముఖ్య అతిధులు మరియు కళాకారులు సభికులకు స్వాగతము పలుకుతూ ఈ ఉత్సవం నభూతో నభావిష్యతిగా వర్ణించారు. తమ ప్రారంభోపన్యాసంలో శ్రీ బాలు గారు ఈ మహోత్సవం ఆస్ట్రేలియా గడ్డపై మొదటి సారి జరగడం ఎంతో ఆనందదయకమని తెలుగు భాష అభివృద్ధికి ఈ ఉత్సవాలు తోడ్పడి భాషా వికాసానికి, అభివృద్ధికి దోహద పడతాయని అభిలషించారు. శ్రీ తులసి రెడ్డి గారు తమ తెలుగు భాషా వాక్పటిమతో మన భాష యొక్క ఔన్నత్యాన్ని అందులోని మాధుర్యాన్ని సభికులందరికీ తెలియజేసి ఎంతో ఉత్తేజ పూరితమైన ఉపన్యసాన్నిచ్చారు. శ్రీ గరికిపాటి వారు కీలకోపన్యాసంలో ఇప్పుడు తెలుగు భాషకున్న దైన్య స్థితిని తనదైన సరళిలో వ్యంగ్య పూర్వకంగా వివరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. శ్రీ కోడూరు రామ మూర్తి గారిని “ప్రవాసాంధ్ర కళా బంధు” బిరుదునిచ్చి సత్కరించిన తదుపరి “పాడుతా తీయగా” వారి సంగీత కార్యక్రమంతో మొదటి రోజు కార్య క్రమం ముగిసింది. రెండవ రోజు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి అధ్వర్యంలో “తెలుగు భాష అమలుపై ప్రవాసాంధ్రుల అభిప్రాయాలు” అన్న శీర్షికన ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మరియు ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ఎన్నెన్నో ఆసక్తి కరమైన చర్చనీయంసాలను వివిధ కోణాల్లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వంశీ మధుకర్ ప్రచురించిన “తెలుగు వెలుగులూ – జిలుగులూ” పుస్తకాన్ని శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామీణ వాతావరణం మరియు జీవన విధానానికి అద్దం పట్టే ఛాయా చిత్రాలు అద్భుతమైన రీతిలో ప్రచురించడం జరిగింది. డప్పులు, రింగ్ డాన్సు, మిమిక్రీ, సిడ్నీ వారి సంగీత విభావరి మరియు ఇతరత్రా కార్యక్రమాలతో పాటు మెల్బోర్న్ సాహిత్యాభిలాషుల “జాతర” కార్యక్రమం అందరినీ ఎంతో అలరించింది. ప్రపంచ తెలుగు మహోత్సవం యొక్క ముఖ్యోద్దేసానికి అనువుగా ఈ జాతర లో ఎన్నో గ్రామీణ కళా రూపాల్ని కనుల విందుగా ప్రదర్శించటం జరిగింది. వీటిలో ముఖ్యంగా బుట్ట బొమ్మలు, గంగిరెద్దులాట, బుడబుక్కలాట, పులి వేషాలు, జానపద నృత్యం, బుర్రకధ మొదలైన జానపదులతో పాటు నరసింహ స్వామి విగ్రహంతో ఊరేగింపు కనుల విందుగా జరిగింది. ఆ తదుపరి కాన్బెర్రా తెలుగు సంఘం సమర్పించిన సాంస్కృతిక కార్యక్రమం ఎంతో చూడ ముచ్చటగా ఉండింది. శ్రీ మణి శర్మ గారి సంగీత విభావారితో ఈ రోజు కార్యక్రమం ముగిసింది మూడవ రోజు మెల్బోర్న్ “భువన విజయం” కవితా గోష్టితో పరమాట పార్క్ లో ఉత్సవ వేడుకలు మొదలయ్యాయి. భువన విజయ కార్యక్రమంలో కవితలు, భాషపై వ్యాసాలు, జానపద పాటలు, ప్రపంచ తెలుగు మహోత్సవం పై ప్రబోధ గీతం మొదలైనవి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ యోగి వల్టాటి రచించిన మొదటి కదా సంకలనం “అక్కో నీ బాంచన్ ” శ్రీ MV రామిరెడ్డి గారి చేతుల మీదుగా మరియు శ్రీ మురళి ధర్మపురి గారి “మురళి ముషాయిరా” శ్రీ మాధవపెద్ది సురేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించ బడ్డాయి. తరువాత బ్రిస్బేన్ తెలుగు భాషాభిమానులు భరత నాట్య నృత్య ప్రదర్సన మరియు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆనందింప జేసాయి. ఈ రోజు డప్పు నృత్యంతో పాటు హరికధ బుర్ర కధ కళాకారులు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసారు. మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి వారి హాస్యరస ఉపన్యాసం ప్రేక్షకుల్ని ఎంతో ఉత్తేజ పరిస్తే ప్రముఖ సినీ హాస్య నటుడు శ్రీ బ్రహ్మానందం రాక అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ముగింపు సభలో అటు ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన పలువురు అతిధులతో పాటు ఆస్ట్రేలియా ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మానందం గారిని సత్కరించడంతో మూడు రోజుల మహోత్సవం ఘనంగా ముగిసింది.

Send a Comment

Your email address will not be published.