ప్రపంచ తెలుగు మహోత్సవం సిడ్నీ

ప్రపంచ తెలుగు మహోత్సవం సిడ్నీ

దేశమేగిన ఎందు కాలిడినా పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గర్వమ్ము రాయప్రోలు సుబ్బారావు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ నుచు శ్రీ కృష్ణ దేవరాయలు పట్టం గట్టిన భాష మనది. నడక నేర్వని పూర్వమే అమ్మ నేర్పిన మాతృ భాష మనది. ‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ గా పరదేశీయుల మన్నన లందుకున్న అమర భాష మనది. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో మూడవ స్థానం మనది. ‘మనం’ అన్న పదంలో మన భాష ఒక పాశంలా మనందరినీ బంధించి ఒక అనుబంధాన్ని కల్పించింది. మన భాష నేడు వన్నె తరిగి మన్నన కొరవడి చిన్నబోతుండటం భాషాభిమానులను ఖిన్నులను చేస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా మన భాష పై ఉన్న మక్కువ ఒక అడుగు వెనుకకు వేస్తుందనటంలో సందేహం లేదు. కాలానుగుణంగా కొత్త వరవడులు దిద్దని నాడు భాష అంతరించి పోవడానికి బాట ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో సాధ్యమైనంతవరకు సాహితీ సదస్సులు, సాంస్కృతిక వేడుకలు జరిపితే మన మనుగడ కొనసాగించడానికి, భావి తరాలకు అద్భుతమైన సంస్కృతీ సాంప్రదాయాలను అందించే తరంగా నిలిచిపోతాం. ఈ పరంపరలో ఆస్ట్రేలియా తెలుగు వారికి చరిత్ర పుటల్లో మిగిలిపోయే సదవకాశం అంది వచ్చింది. ఒక జాతి గర్వించదగ్గ మహోన్నతమైన మన భాషా సంస్కృతీ సంప్రదాయాలను పునః ప్రతిష్టించాలని భావితరాలకు మన అక్షర సుమాలను సమూలంగా అందించాలన్న సువిశాల భావంతో ‘రాంకీ ఫౌండేషన్’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మొదటి “ప్రపంచ తెలుగు మహోత్సవం” 2012 వ సంవత్సరం జనవరి 5,6,7 తేదీల్లో ఒంగోలులో దిగ్విజయంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో వచ్చే ఉగాది సందర్భంగా 2013 ఏప్రిల్ నెల 12,13,14 వ తేదీల్లో సిడ్నీ నగరంలో రెండవ “ప్రపంచ తెలుగు మహోత్సవం” కన్నుల పండువుగా జరపాలని నిశ్చయించారు. ఈ ఉత్సవాల్లో ఆంధ్ర ప్రదేశ్ నుండి నిష్ణాతులైన తెలుగు పండితులు, కళాకారులు విచ్చేసి వివిధ నృత్య నాట్య సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరియు ఇతర దేశాల నుండి ఎంతో మంది భాషాభిమానులు, భాషాప్రవీణులు, వ్యాపార నిపుణులు పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఈ క్రింద నుదహరించిన వైవిధ్యమైన అంశాలు వుంటాయి.

  • వక్తృత్వ పోటీలు
  • వంటల పోటీలు
  • వ్యాస రచనల పోటీలు
  • పాటల పోటీలు
  • నృత్య కళా ప్రదర్సనలు
  • జానపద గీతాలు
  • సురభి నాటక ప్రదర్సన
  • కవి సమ్మేళనము
  • పల్లె పండగలు

మీ ప్రాంతం నుండి వీలున్నంత వరకూ ఎక్కువ మంది తెలుగు వారిని ప్రోత్సహించి ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యులుగా పాలు పంచుకోవాలని మనవి చేస్తున్నాము. సిడ్నీ నగరంలో తగు వసతి సౌకర్యాలు కల్పించడానికి సాయశక్తుల కృషి చేస్తామని హామీ నిస్తాము. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక సంచికను కూడా ప్రచురించడం జరుగుతుంది. ఈ సంచికలో తెలుగు ప్రాశస్త్యం, కవితలు, కధలు, కధానికలు మరెన్నో భాషా పరమైన విషయాలపై కూలంకుష వ్యాసాలు ప్రచురింప బడతాయి. మీ నగరాల్లోనూ లేక మీకు తెలిసిన వారందరికీ తగు ప్రోత్సహన్నిచ్చి ఈ సంచికకు మంచి రచనలను పంపవలసిందిగా కోరుతున్నాం. జైతెలుగుతల్లి

Send a Comment

Your email address will not be published.