ప్రబోదాత్మ

ప్రబోదాత్మ

పది సంవత్సరాలక్రితం
ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్ కొనేప్పుడు
డాలర్ పడిపోతే బావుండనుకొన్నా
పది సంవత్సరాల తరువాత
ఇండియాకి వెళ్ళాలనుకొంటూ
రూపాయి పడిపోవాలనుకొంటున్నా  …

 
విచిత్రం ! కాదు కాదు, స్వార్థం!
అసలు విషయమేంటంటే ?
ఈ మధ్యలో, వయసు పైబడి
తెల్లెంట్రుకలు ఎక్కువై,
కంటద్దాల పవర్ పెరిగి
ఎముకల పటుత్వం తగ్గి,
నరాల్లో సత్తువ నశించి

 
అన్నీ తినలేక, తిన్నా అరగక
నిద్ర చిధ్రమై, ఆసలు చావక,
అరే! పోతున్నానే..  ఎలా..?
ఎటుతిరిగీ, పోతానని తెలుసుకొని,
తిక్క సన్నాసిని, వేదాంతం వైద్యమనుకొని

 
మిడి మిడి జ్ఞానంతో , మెదడుకు మైనం పూసుకొని
గీత ముందేసుకొని, నా గజిబిజి మనసును
ఒక గీతలో పెట్టమని, దేవుడ్నడిగితే ఎలా?
సరిగ్గా అప్పుడే … అదిగో!
నా అంతరాత్మ( ఆకాశవాణి)
చెప్పింది… ఇలా !

“నీలో మనిషిని గుర్తించి
మానవత్వంతో మెసలి
జ్ఞానమనే దివ్వెను వెలిగిస్తే
మెదడున మైనంకరిగి
కొవ్వొత్తిలా.. దారి చూపి
కొందరికైనా సహాయపడి
నీ జన్మను  సార్ధకం చేసుకో … వృద్ధాప్యంలో…!”

–రుద్ర ప్రసాద్ కొట్టు, కాన్బెర్రా

Send a Comment

Your email address will not be published.