ప్రేమబంధం దైవికం

ప్రేమబంధం దైవికం

ప్రేమకు గొప్ప మాట, పర్యాయపదం రాధాకృష్ణులు….
రాదాక్రిష్ణులది ప్రేమబంధమే వీరు పెళ్లి చేసుకోలేదు. రాధ గురించి భాగవతంలోను వివరణ లేదు. జయదేవుడి గీత గోవిందంలో, శ్రీకృష్ణ చరిత్రలో ప్రస్తావన ఉంది. కానీ అది అసంపూర్ణమే.
జయదేవుడి గీతగోవిందం ప్రేమికులకు ఓ గొప్ప వరప్రసాదం. ప్రణయక్రీడకు సంబంధించిన చక్కని కథ. బృందావనంలో రాధాకృష్ణుల ప్రణయలీలను హృద్యంగా చెప్పిన తీరు ముదావహం. రసరమ్యం. గీతగీవిందంలో 12 సర్గలు, 24 అష్టపదులు, 94 వర్ణనాత్మకమైన శ్లోకాలు ఉన్నాయి.

కృష్ణుడి కంటే రాధ మూడేళ్ళు పెద్దది. ఆమె మేని ఛాయ పాలమీగడలా తెల్లనిది. దేహాకృతి సన్ననిది. కళ్ళు పెద్దవి. జడ పొడవైనది. చూపులో మన్మధత్వం మిళితమై ఉంటుంది. కనుబొమ్మలు చూస్తుంటే వంగిన విల్లు గుర్తుకు వస్తుంది. పంటి వరుస మల్లెమొగ్గలలా అనిపిస్తుంది. ముక్కు చక్కగా తీర్చి దిద్దినట్టు ఉంటుంది. విశాలమైన వక్షస్థలం. నడుము సన్నపాటిది. కాళ్ళు అరటిబోదెలా ఉంటాయి. ఆమె అందానికి పర్యాయపదం.

ఇక కృష్ణుడి విషయానికి వస్తే బాల్యం నుంచే అల్లరి వాడు. కొంటెతనం కలిసిన అల్లరి కావడంతో చూడటానికి అందంగా ఉండేది. అడవికి వెళ్ళినప్పుడు వేణువు తయారు చేయడానికి ఓ వెదురు ముక్క తెమ్మని అడుగుతుండే వాడు. ఆ విషయం గుర్తు పెట్టుకుని రాధ ఓ రోజు మధురానగరం నుంచి కృష్ణుడికి ఓ వెండి వేణువు తెచ్చిపెడుతుంది. ఆ వేణువు అందుకున్న కృష్ణుడు అది అచ్చం నీ లాగా ఉందని రాధతో చెప్పాడు. అంతేకాదు ఆ వేణువు రాధకు తిరిగివ్వనని అంటాడు.

అప్పుడు రాధ “అది నీకోసమే తీసుకొచ్చాను. నాకక్కరలేదు. నువ్వు వాయించి వినిపించే నాదంలో నన్ను నేను మమేకం చేసుకుంటాను” అంటుంది.

“అది సరేగానీ నువ్వు నాకిచ్చిన ఈ కానుకకు నీకు ప్రతిఫలంగా నేను ఏమివ్వాలి ” అని అడుగుతాడు కృష్ణుడు.

రాధ “సరే, నీ ఇష్టం ఏది ఇచ్చినా స్వీకరిస్తాను” అని ఆనందంగా చెప్తుంది.

అంతట కృష్ణుడు రాధను కళ్ళు మూసుకోమని చెప్పి రాధను గాడంగా కౌగిలించుకుంటాడు. ఆమె చెక్కిలిమీద ముద్దులిస్తాడు.

ముద్దుల వర్షంలో తడిసిన ఆనందంతో కళ్ళు తెరచి కృష్ణుడిని చూస్తుంది రాధ .
కృష్ణుడి కళ్ళల్లో తదేకంగా చూస్తుంది. ఆమె ఆనందానికి హద్దులు లేవు.

అప్పుడు రాధ “కృష్ణా….నేను నీకు ఇచ్చిన ఈ వేణువు నా జ్ఞాపకంగా నీ దగ్గర ఉంచేసుకో. అంతేకాదు, నీ హృదయంలో నన్ను శాశ్వతంగా ఉండనివ్వు….నా తుది శ్వాస వరకు నీతోనే ఉండేలా చూసుకోవాలి. నాకు ఈ హామీ ఇవ్వు చాలు…. ఇంతకన్నా ఇంకేమీ వద్దు” అంటుంది.

కృష్ణుడు ఓ అందమైన నవ్వుతో రాధతో “అలాగే కానివ్వు” అంటాడు.

“నువ్వు ఇచ్చిన ఈ వేణువుని నా పెదవులు స్పర్శిస్తూ నీకోసం ప్రేమ రాగాలు ఆలపిస్తాయి..సరేనా” అని కృష్ణుడు చెప్పినప్పుడు రాధ తాదాత్మ్యం చెందుతుంది.

రాధా కృష్ణుల ప్రేమ శరీరాల కలయికకు అతీతం. వారి ప్రేమలో కాముకత్వం లేదు. వీరి ప్రేమ బంధం దైవీకమైన బంధం.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.