మరో హారర్ కామెడీ

హారర్ కామెడీ సినిమా- రాజుగారి గ‌ది 3

rajugarigadhi3మరో హారర్ కామెడీ సినిమాగా రాజుగారి గది 3 ని చూడొచ్చు. ఒక ద‌శ‌లో అగ్ర క‌థానాయ‌కులు కూడా హారర్ కామెడీ క‌థ‌ల‌పై మ‌క్కువ ప్ర‌ద‌ర్శించారు. వాటి త‌ర‌హాలో క్రైమ్‌థ్రిల్ల‌ర్ చిత్రాల జోరు క‌నిపిస్తోంది. అయినా అడ‌పాద‌డ‌పా హార‌ర్ చిత్రాలు తెర‌కెక్కుతున్నా వాటిలో భ‌య‌పెడుతున్న‌వి మాత్రం త‌క్కువే. రాజుగారి గ‌దితో విజ‌య‌వంతంగా భ‌య‌పెట్టిన ఓంకార్‌… దాన్ని ఫ్రాంచైజీగా మలిచారు. అందులో భాగంగా మూడో చిత్రంగా రాజుగారి గ‌ది3ని తెర‌కెక్కించారు.

క‌థ‌లో
అశ్విన్ (అశ్విన్‌బాబు) ఒక ఆటోడ్రైవ‌ర్‌. మామ (అలీ)తో క‌లిసి కాల‌నీలో ఓ ఇంట్లో నివ‌సిస్తుంటాడు. అత‌ను వృత్తిరీత్యా వైద్యురాలైన మాయ (అవికాగోర్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అశ్విన్ అంటే ప‌డ‌ని కాల‌నీవాసులే ఆమె ప్రేమ‌లో ప‌డేలా చేస్తారు. అందుకు కార‌ణం కూడా ఉంది. మాయ‌ని తాకాల‌ని ఎవ‌రు ప్ర‌య‌త్నించినా వాళ్లు మ‌ర‌ణం అంచుల‌దాకా వెళుతుంటారు. ఎవ‌రికీ క‌నిపించ‌ని ఒక ఆత్మ ఆమెకి క‌వ‌చంలా ఉంటూ కాప‌లా కాస్తుంటుంది. అది తెలిసే అశ్విన్ ఆమె ప్రేమ‌లో ప‌డేలా చేస్తారు. మ‌రి మాయ ప్రేమ‌లో ప‌డ్డాక అశ్విన్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇంత‌కీ మాయ వెన‌కాల ఉన్న క‌వ‌చం క‌థేమిటి? కేర‌ళ‌లో పేరుమోసిన మాంత్రికుడైన మాయ తండ్రి గ‌రుడ పిళ్లై (అజ‌య్ ఘోష్‌)కీ, మాయ వెన‌కాల ఉన్న క‌వ‌చానికి మ‌ధ్య సంబంధమేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథా విశ్లేష‌ణ‌
రాజుగారి గ‌ది ఫ్రాంచైజీ అన‌గానే.. ప్రేక్ష‌కులు హార‌ర్ కామెడీని ఆశించే థియేట‌ర్‌కి వెళ‌తారు. ఓంకార్ కూడా ఆ మేళ‌వింపుతోనే క‌థ‌ని రాసుకొన్నప్ప‌టికీ… ఆ మోతాదు గురించి ఎక్కువ‌గా దృష్టిపెట్ట‌లేదు. రెండో సినిమా కంటే ఎక్కువ‌గా న‌వ్విస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌… దాన్ని ద్వితీయార్థం వ‌ర‌కే ప‌రిమితం చేశాడు. ఇక హార‌ర్ అంశాలైతే పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయాయి. దెయ్యాలు గుంపులు గుంపులుగా క‌నిపిస్తుంటాయి కానీ.. అవి ప్రేక్ష‌కుల్ని పెద్ద‌గా భ‌య‌పెట్ట‌లేదు. ప్ర‌థ‌మార్థంలో క‌థ చెప్ప‌డం కంటే కూడా… మాస్ అంశాల‌పైనే దృష్టిపెట్టారు. త‌న త‌మ్ముడు అశ్విన్‌ని మాస్ క‌థానాయ‌కుడిగా చూపెట్టాల‌నే ప్ర‌య‌త్న‌మేమో. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల్ని మ‌రింత బ‌లంగా తీర్చిదిద్దాల్సి ఉండ‌గా… అటువైపు కూడా దృష్టిపెట్ట‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. దాంతో వాళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డేంత బ‌ల‌మైన కార‌ణ‌మేమీ సినిమాలో క‌నిపించ‌దు. ఇక ద్వితీయార్థంలోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. నాయ‌కానాయిక‌లు కేర‌ళ వెళ్లాక… మాయ వెన‌కాల క‌వ‌చం ఎవ‌ర‌న్న‌ది తెలిశాక క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. క‌వ‌చంలా కాపాడుతున్న శ‌క్తి య‌క్షికి సంబంధించిన తాళ‌ప‌త్రాల్ని వెదికే క్ర‌మం, అక్క‌డ దెయ్యాలు భ‌య‌పెట్టే తీరు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. అశ్విన్, అలీ, అజ‌య్‌ఘోష్‌, ఊర్వ‌శి, ధ‌న్‌రాజ్ త‌దిత‌రులు క‌లిసి చేసే సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా అజ‌య్ ఘోష్‌, ఊర్వ‌శి పాత్ర‌లు ద్వితీయార్థానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇందులో కాన్సెప్టు ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ… క‌థ‌ని మ‌రింత విస్త‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డారు. దాంతో చిన్న‌పాటి కాన్సెప్ట్ ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయ‌లేక‌పోయింది. హార‌ర్ చిత్రాల్లో లాజిక్‌ల‌కి సంబంధించి ల‌భించే మిన‌హాయింపుల్ని ద‌ర్శ‌కుడు బాగానే వినియోగించుకొన్నాడు. చాలా స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతాయి.

న‌టీన‌టుల నటన
సినిమా కామెడీ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించిందంటే అందుకు కార‌ణం అలీ, అజ‌య్ ఘోష్‌, ఊర్వ‌శిల న‌ట‌నే. వాళ్లు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. త‌మ అనుభ‌వాన్నంతా ఉప‌యోగించి హావ‌భావాల‌తోనూ, సంభాష‌ణ‌ల‌తోనూ క‌డుపుబ్బా న‌వ్వించారు. అనుభ‌వ‌జ్ఞులైన వాళ్ల ప‌క్క‌న ఉంటూ కామెడీ పండించారు క‌థానాయ‌కుడు అశ్విన్‌. ఇదివ‌ర‌క‌టి సినిమాల‌తో పోలిస్తే అశ్విన్ న‌ట‌న, డ్యాన్సుల్లో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. అవికాగోర్‌కి న‌టించే అవ‌కాశం రాలేదు. ప‌క్కంటి అమ్మాయిగానే క‌నిపించిన ఆమె ప‌తాక స‌న్నివేశాల్లోనే కాస్తంత భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. ధ‌న్‌రాజ్‌, ప్ర‌భాస్ శ్రీను, బ్ర‌హ్మాజీ, హ‌రితేజ, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఛోటా కె.నాయుడు కెమెరా రాజుగారి గ‌దిని చాలా బాగా చూపించింది. భ‌య‌పెట్ట‌డంలో ఆయ‌న లైటింగ్ కీల‌క పాత్ర పోషించింది. సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. ష‌బ్బీర్ నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. పాట‌లు మాత్రం గుర్తు పెట్టుకుని పాడుకునేలా లేవు. సాహి సురేష్ క‌ళా ప్ర‌తిభ అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. ముఖ్యంగా రాజ్‌మ‌హ‌ల్‌ని ఆయ‌న తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు ఓంకార్ హార‌ర్ కామెడీ క‌థ‌ల‌పై మంచి ప‌ట్టు సంపాదించాడ‌ని కొన్ని స‌న్నివేశాలు రుజువు చేస్తాయి. క‌థ విష‌యంలోనే ఆయ‌న మ‌రికాస్త దృష్టిపెట్టాలని చెబుతుందీ సినిమా. ఫ్రాంచైజీ సినిమాలు అంత‌కుమించి అనేలా ఉండాలి. గ‌త సినిమాల ప్ర‌భావం వ‌ల్ల అంచ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకు తగ్గ‌ట్టుగా సినిమా ఉండాలి, లేదంటే మాత్రం ప్రేక్ష‌కులు నిరాశ‌చెందుతారు. ఒక స‌గ‌టు హార‌ర్ కామెడీ సినిమాగా చూస్తే ప‌ర్వాలేద‌నిపిస్తుంది

న‌టీన‌టులు: అవికా గోర్‌, అశ్విన్ బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్ ఘోష్‌, ఊర్వశి త‌దిత‌రులు
ద‌ర్శక‌త్వం: ఓంకార్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్రవ‌ర్తి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
ప్రొడక్షన్‌ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
పాటలు: శ్రీమ‌ణి
ఆడియోగ్రఫీ: రాధాకృషణ్‌
స్టంట్స్‌: వెంక‌ట్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

Send a Comment

Your email address will not be published.