ర‌క్తదానమే ప్రాణదాన‌ం

WorldBloodDonorDay:Layout 1జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ప్రాణాన్ని దానం చేయడం ఎవరికైనా కష్టమైన పనే…అదే రక్తాన్ని దానం చేసి ప్రాణం పోకుండా కాపాడడం ఎవరికైనా సాధ్యమయ్యే పనే. శరీరంలో ఎర్రని ద్రవ రూపంలో ఉన్న నిర్మాణ కణజాలమే రక్తం. జీవి మనుగడకి రక్తం అత్యవసరమైనది. మానవ శరీరంలోని ధమనులు, సిరలలో ఇది ప్రవహిస్తుంది. శరీరంలో ప్రతి అవయవంలోని ప్రతి కణజాలానికి రక్తం ద్వారా ఆక్సిజన్‌ని అందిస్తుంది. కణజాలం నుండి కార్బన్‌ డయాక్సైడును స్వీకరిస్తుంది. ఇన్ఫెక్షన్లపై యుద్ధం చేస్తుంది. రక్తానికి మరో ప్రత్యమ్నాయం లేదు. దీనిని ఉత్పత్తి చేయలేము. కానీ దాతలెవరైనా ఉంటే వారినుంచి తీసుకొని అవసరమైన వారికి ఎక్కించి ప్రాణాన్ని కాపాడొచ్చు. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం. ఈనెల 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

రక్తం శరీరంలో అత్యత కీలకమైనది. మొత్తం శరీర బరువులో 8శాతం బరువు రక్తానిదే. రక్తాన్ని పరీక్ష నాళికలో వేసిన కొంతసమయానికే మూడు పొరలుగా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కవ మందం ఉన్న పొర, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని ప్లాస్మా అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో ఉండే తెల్లటి పొర తెల్ల రక్త కణాలు. అట్టడుగున దరిదాపు ప్లాస్మా లేయర్‌ ఉన్నంత మందం గానూ ఎర్రటి పొర ఎర్ర రక్త కణాలు. రక్తంలో మొత్తం 4000 వివిధ భాగాలుంటాయి. అయితే ముఖ్యమైనవి నాలుగు మాత్రమే. అవి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌ లెట్లు, ప్లాస్మాపరిమాణం బట్టి చూస్తే, మొత్తం రక్తంలో ఎర్రరక్తకణాలు 45శాతం, తెల్లరక్తకణాలు 0.7శాతం, ప్లాస్మా 54.3శాతం ఉంటాయి. ఇవి ఎముక మజ్జ(మూలుగ)లో ఎప్పటికప్పుడు తయారవుతుంటాయి.

రక్తం విధులు
– ఎర్ర రక్తకణాలలో ఉండే హీమోగ్లోబిన్‌తో కణజాలాలకు ఆక్సిజన్‌ని సరఫరా చేస్తుంది.
– గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆసిడ్‌ల వంటి పోషకాలను సరఫరా చేస్తుంది.
– దెబ్బతిన్న కణజాలాల సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది.
– శరీరంలో ఆమ్ల-క్షార తుల్యతని (పి.హెచ్‌ విలువని) నియంత్రిస్తుంది.
– శరీర ఉష్ణోగ్రతను పరిరక్షిస్తుంది.
– హైడ్రాలిక్‌ (పంపింగ్‌) విధులు నిర్వర్తిస్తుంది..
– కార్బన్‌ డై ఆక్సైడ్‌, యూరియా, లాక్టిక్‌ ఆమ్లం వంటి వ్యర్థ పదార్థాలను నిర్మూలిస్తుంది.
– వ్యాధి నిరోధక విధులను, తెల్ల కణాల సరఫరాను క్రమబద్దం చేస్తుంది.
– యాంటీబాడీలతో సూక్ష్మ క్రిములను, రోగకారకాలను నిరోధిస్తుంది.
– హార్మోన్ల సరఫరాకి పని చేస్తుంది.

రక్తంలో గ్రూపులు
1900 సంవత్సరంలో ‘కారల్‌ ల్యాండ్‌ స్టీనర్‌’ అనే వైద్య శాస్త్రవేత్త నాలుగు రక్త వర్గాలను కనుగొన్నారు. అవి – ఎ, బి, ఎబి, ఓ అనే వర్గాలున్నాయి. వీటిని మళ్లీ ప్రతి గ్రూపులోనూ నెగిటివ్‌, పాజిటివ్‌గా వర్గీకరణ చేసారు.

రక్తదానం అంటే?
రోగ నివారణ కోసం, ప్రమాదాల సమ యంలో, విపత్కర ఆరోగ్య పరిస్థితులో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కించాల్సిందే. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ గ్రూప్‌ వారిని విశ్వదాత అని, ఎ.బి. గ్రూపుల రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటారు.

ఎవరి నుంచి ఎవరికి?
రక్తం అంతా ఒకేలా ఎర్రగా కన్పించినా కొంతమంది రక్తం కొన్ని గ్రూపుల వారికే ఉపయోగపడుతుంది. ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చంటే-ఎబి గ్రూప్‌ వారు ఎబి గ్రూప్‌ కి , ఎ గ్రూప్‌ వారు ఎ, ఎబి గ్రూపుల వారికి కి, బి గ్రూప్‌ వారు బి, ఎబి గ్రూపుల వారికి కి, ఓ గ్రూప్‌ వారు ఎ, బి, ఎబి, ఓ గ్రూప్‌ల వారందరికి దానం చేయొచ్చు.
అదే విధంగా ఎవరు ఎవరి నుండి రక్తం తీసుకోవచ్చంటే ఎబి గ్రూప్‌ వారు అన్ని గ్రూపుల వారి నుంచి. బి గ్రూప్‌ వారు బి, ఓ గ్రూపుల వారి నుంచి, ఎ గ్రూప్‌ వారు ఎ, ఓ గ్రూపుల వారి నుంచి, ఓ గ్రూప్‌ వారు ఓ గ్రూప్‌ నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి.

ఎవరు రక్త దాతలు?
ఆరోగ్యంగా ఉండి 16 నుంచి 60 సంవత్సరాలు వయసులోపల ఉన్నవారెవరైనా రక్తదాతలే. 45కేజీల కంటే అధిక శరీర బరువు కలిగిన వారు, రక్తపోటు, నాడీ రేటు, గుండె కొట్టుకునే స్థితి.. సాధారణంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3-4 నెలలకు ఒక్కసారి రక్తాన్ని దానం చేయవచ్చు. 18 ఏళ్లు నిండినవారు జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు. ఈ లెక్కన ప్రతిఒక్కరూ 672 మంది ప్రాణాలు కాపాడొచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35-45 రోజులు నిల్వ చేస్తారు. ఈ రక్తాన్ని మూడు రూపాల్లో విభజిస్తారు. రెడ్‌ సెల్స్‌, ప్లాస్మా, ప్లేట్లెట్స్‌ అనే ఈ మూడు రకాలని ముగ్గురికి వారి వారి అవసరాలను బట్టి అందిస్తారు.

రక్తదానంతో దాతలకూ మేలే
– రక్తం అవసరమైనవారికే కాదు దానిని దానం చేసే దాతలకు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి.
– రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం దొరుకుతుంది. ఇది సాటిలేని సంతృప్తిని ఇస్తుంది.
– రక్తదానం చేసేవారిలో గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇనుము శాతం పూర్తి నియంత్రణలో ఉండడమే దీనికి కారణం
– రక్తదానం కేన్సర్‌ బారిన పడే అవకాశాల్ని దాదాపుగా తగ్గిస్తుంది.
– రక్తదానం చేసేవారికి తమ శరీరానికి సంబందించిన అనేక రకాలైన రక్త పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల రక్తదానం చేసేవారు తమకు తాము ఆరోగ్యవంతులుగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
– రక్తదానం చేయడం వల్ల శరీరంలోని కేలరీలు ఖర్చు అవుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
– కొవ్వు తగ్గుతుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
– శరీరం ఫిట్‌గా వుంటుంది.
– శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం చేస్తుంది. రక్తంలో ఎక్కువగా ఐరన్‌ ఉంటే గుండెకు హాని చేస్తుంది. కార్డియో వాస్కులర్‌ వ్యాధులను నివారించేందుకు రక్తదానం ఉపకరిస్తుంది.
– మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత రుతుస్రావం పూర్తిగా నిలిచిపోయి నప్పుడు (మెనోపాజ్‌ సమయంలో) వారి శరీరంలో నిల్వఉండే ఐరన్‌ స్థాయిని సమతుల్యం చేసుకోవడానికి రక్తదానం చేయడం చాలా మేలు కలిగిస్తుంది.
– ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.

అపోహలు- వాస్తవాలు
రక్తదానం అనేది ఒక ఉద్యమంలా కొనసాగుతున్నా కొంతమందికి ఇంకా దీనిపై సరైన అవగాహన లేక అపోహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోగ్యవంతులైన ఎవరైనా సరే రక్తదానం చేయడానికి అర్హులే. 21రోజుల్లోనే తగినంత రక్తం మళ్లీ తయారవుతుంది. ప్రతి ఆరోగ్యవంతుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చెయ్యొచ్చు. రక్త సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు లేని వారు, రక్తహీనత లేని వారు ఎవరైనా సరే రక్తదానం చెయ్యడానికి అర్హులే. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రక్తం ఇవ్వకూడదేమో అని చాలా మంది అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటి అపోహలెన్నో ఉన్నాయి. వయోజనులైన ఎవరైనా సరే రక్తదానం చెయ్యవచ్చు. స్తీలలో కుటుంబ నియంత్రణ కోసం గర్భ రోధక మాత్రలు వాడుతున్న వారు కూడా రక్తదానం చెయ్యవచ్చు. అయితే గర్భవతులు మాత్రం రక్తదానం చెయ్యకూడదు. బీపీ సమస్య ఉన్నవారు మందులు వాడుతూ అది అదుపులో ఉన్నంత వరకు రక్తదానం చెయ్యవచ్చు. ఏ కారణంతోనైనా రక్తాన్ని స్వీకరించిన వారు 12 నెలల వరకు రక్తదానం చెయ్యకపోవడమే మంచిది. 12 నెలల తర్వాత వారు కూడా రక్తదానం చెయ్యవచ్చు. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు కూడా క్రమంతప్పకుండా మందులు వాడుతూ సమస్య అదుపులో ఉన్నంతవరకు రక్తదానం చెయ్యొచ్చు. రక్త దానం పట్ల తగినంత అవగాహన లేకపోవడం అనే చిన్న నిర్లక్ష్యానికి ఎన్నో ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వస్తోందన్న వాస్తవాన్ని అందరూ గ్రహించా లి. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరూ రక్తదానం చెయ్యడానికి ముందుకు రావాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా రక్తదానం చెయ్యాలి. తప్పనిసరిగా అందరికీ తమ బ్లడ్‌ గ్రూప్‌ ఏమిటో తెలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది.

Send a Comment

Your email address will not be published.