వికసించిన పద్మాలు

Padmasree18
భారత కేంద్ర ప్రభుత్వం 2018 “పద్మ” అవార్డుల జాబితాను జనవరి 25వ తేదీన విడుదల చేసింది. ఈమారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి మాత్రమే పద్మ అవార్డు దక్కింది. అతను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌. అతనికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.

సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, వ్యాపారం, కళలు తదితర రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నవారికి ప్రభుత్వం ప్రతి ఏటా ఈ పద్మ అవార్డులను అందిస్తుండడం తెలిసిన విషయమే.

బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తోపాటు టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి (క్రీడారంగం) పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది.

ముగ్గురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్ పురస్కారాలతో పాటు మొత్తం డెబ్బయి మూడు మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం 14మంది మహిళలు పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరణానంతరం ముగ్గురికి పద్మ పురస్కారాలు లభించాయి.

2018 సంవత్సరానికిగాను ‘పద్మ’ అవార్డులకోసం దేశ వ్యాప్తంగా 15, 700 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సినీ సంగీత ప్రియులకు సుపరిచితులైన దక్షిణాది సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఇళయరాజాతో పాటు మహారాష్ట్రకు చెందిన సంగీత కళాకారుడు గులామ్ ముస్తఫా ఖాన్‌, కేరళకు చెందిన పరమేశ్వరన్ కూడా పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఇలా ఉండగా, సినిమా సంగీతానికి ఒక కొత్త ఒరవడి సృష్టించి కొన్ని దశాబ్దాల పాటు వెయ్యి సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్’ లభించడం దక్షిణాది సినిమా రంగాన్ని గౌరవంగా భావిస్తున్నారు. పుట్టుకతో తమిళుడైనప్పటికీ ఇళయరాజాకు మన తెలుగు ప్రేక్షకులలో కూడ కోట్లాదిమంది సంఖ్యలో అభిమానులు ఉన్నారనడం అకిశయోక్తి కాదు. క్లాస్ ప్రేక్షకులకు మాస్ ప్రేక్షకులకు నచ్చే పాటలను ఇవ్వగల శక్తి ఇళయరాజాకే సొంతం. ఇప్పటికీ తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాల విషయంలో రోజుకు ఈ సంగీత చక్రవర్తి పదిహేను గంటలు కష్టపడతాడు అంటే సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఇష్టం అర్థం చేసుకోవచ్చు.

ధోనీ సహా తొమ్మిది మందిని పద్మ భూషణ్ అవార్డు వరించింది.

శ్రీకాంత్‌తో పాటు సోమ్‌దేవ్‌ దేవ్‌ వర్మన్‌ (టెన్నిస్‌, మణిపూర్‌), మురళీకాంత్‌ పేట్కర్‌ (స్విమ్మింగ్‌, మహారాష్ట్ర), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్‌, మణిపూర్‌)లకు కూడా పద్మశ్రీ లభించింది. పారా ఒలింపిక్స్‌ (50మీ. ఫ్రీస్టయిల్‌ స్విమ్మింగ్‌, 1972) లో భారత్‌ నుంచి తొలి స్వర్ణం సాధించిన అథ్లెట్‌గా పేట్కర్‌ చరిత్ర సృష్టించాడు. గతేడాది ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో మీరాబాయి చాను స్వర్ణంతో చరిత్ర సృష్టించింది.

Send a Comment

Your email address will not be published.