వీరపాండ్య కట్టబొమ్మన్ స్మృతి

వీరపాండ్య కట్టబొమ్మన్ స్మృతి

తమిళనాడులో మదురై నుంచి తిరునల్వేలి వెళ్ళే హై వేలో ఉన్న ఒక పల్లె పేరు కయత్తారు. ఇది రహదారిని ఆనుకుని ఉన్న కుగ్రామం. ఇక్కడ ఓ విగ్రహం ఉంది. అది ఎవరిదో కాదు. వీరపాండ్య కట్టబొమ్మన్ విగ్రహం. ఆ విగ్రహం ఉన్న చోటనే అతనిని ఉరి తీశారు. అందుకే అతని స్మృత్యర్ధం విగ్రహంతో పాటు ఒక స్థూపం కూడా ఆవిష్కరించారు.

స్వాతంత్ర్య సమరంలో ఇంగ్లీష్ వారిపై తమిళనాడు నుంచి తిరుగుబాటు చేసిన మొదటి యుద్ధ వీరుడు వీరపాండ్య కట్టబొమ్మన్ పాంచాలంకురిచ్చి అనే ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో కట్టబొమ్మన్ గుర్తుగా ఒక కోట ఉంది.

బ్రిటీష్ వారిని వ్యతిరేకించి శిస్తు కట్టడం కుదరదని స్వతంత్రతకు తెర లేపిన కట్టబొమ్మన్ పై ఆంగ్లేయులు దాడి చేసి ఆయన పాలించిన ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. అయితే కట్టబొమ్మన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పుదుక్కొట అడవులలో తలదాచుకున్నాడు. తీరా అక్కడ దాగి ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఆంగ్లేయులు అతనిని పట్టుకుని కయత్తారులో ఒక చింత చెట్టుకి కట్టి ఉరి తీశారు. ఆ చింత చెట్టు ఉన్న చోటే ఇప్పుడు అతని విగ్రహం ఉంది. తిరునల్వేలి వెళ్ళే దారిపొడవునా అనేక చెట్లు రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. వాటిలో ఒక చింత చెట్టుకే కట్టబొమ్మన్ ని వేలాడ దీసి అందరి సమక్షంలో ఉరి తీశారు. అయితే ఆ చింత చెట్టుని ప్రజలు ఒక పవిత్రమైన చెట్టుగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు. అది ఆంగ్లేయులకు నచ్చలేదు. సహించలేకపోయిన ఆంగ్లేయులు ఆ చెట్టుని తగలబెట్టారు. కొంతకాలానికి ఆ చోటు మరుగున పడిపోయింది.

అయితే తమిళనాడులో విజయవంతమైన వీరపాండ్య కట్టబొమ్మన్ సినిమా సమయంలో మళ్ళీ ఈ ప్ర్రాంతం వెలుగులోకి వచ్చింది. అనేకమంది ఈ ప్రాంతం మీద పరిశోధనలు చేశారు. ఆ సినిమాలో కట్టబొమ్మన్ గా నటించిన శివాజీ గణేశన్ ఆ ప్రదేశాన్ని కొనుగోలు చేసి సొంత ఖర్చుతో కట్టబొమ్మన్ విగ్రహాన్ని తయారు చేయించి చింత చెట్టు ఉన్న ప్రదేశంగా గుర్తించిన చోట ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలాగే ఒక స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేశారు.

ఇలా ఉండగా, ఇక్కడికి దగ్గరలో కుమారపట్టి అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో వందల సంవత్సరాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లనుంచి ఒక్క ఆకు కోయడం గానీ కొమ్మలు విరగ్గొట్టడం గానీ అనుమతించరు. ఆ అడవిని ఒక దేవాలయంలా ఎంతో పవిత్రంగా చూసుకుంటున్నారు స్థానికులు. ఆ అడవిలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో కట్టబోమ్మన్ పూజలు చేసినట్టు స్థానికుల నమ్మకం.

ఏదేమైనా ఆ ప్రాంతం ఒక పవిత్ర స్థలంగా దక్షిణ భారతీయలు భావిస్తుంటారు…

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.