సంగీత శిఖరం - రజనీ

rajinikanta_rao

లలిత సంగీతానికీ, సాహిత్యానికీ జీవితాన్ని అంకితం చేసిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరైన బాలాంత్రపు రజనీకాంతారావు 99 యేళ్ళ వయసులో ఆదివారం నాడు( ఏప్రిల్ 22న) కాలధర్మం చెందారు. తెలుగు సంగీతంలో ఆయన సమున్నత మేరునగం. చాలా యేళ్ళు ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించారు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యులు. ఆయనతో ఇంకెవరినీ ఎప్పుడూ పోల్చలేము.

జీవనరేఖలు
‘రజని’ గా గుర్తింపు పొందిన బాలాంత్రపు రజనీకాంతారావు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించారు. జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన “కవిరాజహంస” బాలాంత్రపు వెంకటరావుగారి కుమారులు. బాలాంత్రపు నళినీ కాంతారావు వీరి అగ్రజులు. వీరి తండ్రి ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల సంస్థాపక, నిర్వాహకులు. తల్లి వెంకటరమణమ్మ కూడా గొప్ప సాహితీ సంస్కారం కల వ్యక్తి. ఇంటిలోని సాహితీ వాతావరణానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ పోతూ వుండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగి సోమయాజి వంటి పండితులతో కళకళలాడుతుండేది.
పిఠాపురంలో పెరిగారు. బంధువైన పులగుర్త లక్ష్మీనరసమాంబ దగ్గర భక్తిసంగీతం, మేనమామ దుగ్గిరాల పల్లంరాజు దగ్గర శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. కాకినాడలో పి.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. రజని 1937-1940 వరకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) లో ఎం.ఏ. తెలుగు చదివారు. పింగళి లక్ష్మీకాంతం గారు వీరి గురువులు. దేవులపల్లివారు ఆత్మీయ మిత్రులు.

ఉద్యోగ ప్రస్థానం
1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జెక్యుటివ్ గా చేరారు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాల్ RajanikantaRao1లోని కర్సియాంగ్ స్టేషను కెళ్ళారు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషను డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళారు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో గౌరవాచార్యులుగా పనిచేశారు. 1979 నుండి 82 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశారు.
1940-41 ప్రాంతంలో ఇరవయ్యేళ్లప్పుడు ఆల్ ఇండియా రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి రిటైరయ్యే వరకూ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కేంద్రాల్లో పనిచేసి 1978లో రేడియో స్టేషన్ డైరెక్టరుగా రిటైరయ్యారు.
రేడియోలో ఆయన ప్రవేశ పెట్టిన ప్రక్రియలు, చేసిన ప్రయోగాలూ తలుచుకుంటే, అవన్నీ ఒక్క మనిషి చేశాడనుకుంటే కళ్లు తిరిగి పోతాయి.
భక్తిరంజని’లో వినపడే “సూర్యస్తుతి” ఒక్కదాని గురించి రాయడానికే బోలెడంత సమయం పడుతుంది. అందులో వినపడే కంఠాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో! ఆదిత్య హృదయం, సంప్రదాయ కీర్తన, సూర్య స్తుతి… అన్నిటినీ కలిపి అల్లిన కదంబ మాల అది. ఎంత అద్భుతంగా ఉంటుందో వింటుంటే!
అలాంటివెన్నో ప్రయోగాలు – సంగీత రూపకాలు, యక్షగానాలు, నాటికలు, సంగీత శిక్షణ, ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు, ఈ మాసపు పాట, బావగారి కబుర్లు, ఇంకా ఎన్నో కార్యక్రమాల రూపకర్త ఆయన. వీటికి సంబంధించిన రచనలు చేయడం, ట్యూన్లు కట్టడం ఒక ఎత్తు, వాటిని గాయనీ గాయకులతో, వాద్యబృందంతో నిర్వహించడం ఒక ఎత్తు. ఆయన రేడియో తరపున రచయిత చలం గారిని చేసిన ఇంటర్వ్యూ ఈ నాటికి కూడా అపురూపమైనదిగా పరిగణిస్తారు. ఆయన వివాద రహితుడు. అన్నేళ్లు రేడియోలో పనిచేసినా తోటిఉద్యోగులు కానీ పరిచయస్థులు కానీ ఆయనను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ విమర్శించిన సందర్భాలు లేనేలేవు.

నెహ్రూ ప్రసంగం తర్వాత రజనీ గీతం
1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి నెహ్రూ “”Our tryst with destiny” ప్రసంగం తర్వాత రజని రచించి స్వరపరిచిన “మాదీ స్వతంత్రదేశం అనే గీతం ప్రసారమయింది. 1972లో రజనీ రచించి స్వరపరిచిన “కొండ నుండి కడలి దాకా” రూపకం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. దీనికి జపాన్ నుంచి “నిప్పాన్ హోసో క్యొకాయ్” బహుమతి లభించింది. కృష్ణశాస్త్రిగారి ‘అతిథిశాల’ సంగీతరూపకానికి పర్షియన్ సంగీతం ఆధారంగా కూర్చిన సంగీతానికి చాల పేరు వచ్చింది. 1981లో మేఘసందేశ రూపకానికి బెంగుళూరులో ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది
ఉషశ్రీతో ధర్మసందేహాలు కార్యక్రమం ప్రారంభించారు. భక్తిరంజని కార్యక్రమం ప్రారంభించారు

లలిత సంగీత వికాసానికి మార్గదర్శి
రజని తెలుగు లలిత సంగీత వికాసానికి ఎనలేని దోహదం చేశారు. ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు రజని రసమధురంగా రచించారు. రేడియో కోసం రజని వందలాది గీతాలను రచించారు. ఇతర రచయితల గీతాలకి కూడా స్వరరచన చేశారు. బాలలకోసం జేజిమామయ్య పాటలు రచించారు.

స్వరకర్తగా, గేయకవిగా, సినీ గాయకుడుగా రజని ప్రసిద్ధుడు. భానుమతి, రజని కలిసి పాడిన పాటలు చిత్రసీమలో గణన కెక్కాయి. స్వర్గసీమ, గృహప్రవేశం ఇత్యాది చిత్రాలకు పాడారు.
బాలమురళి, బాలసరస్వతి, శ్రీరంగం గోపాలరత్నం, ఎస్ రాజేశ్వరరావు, టంగుటూరి సూర్య కుమారి… వీరందరి చేత లలిత సంగీతం పాడించారు. తాను సినిమా రంగంలో పూర్తిగా నిలదొక్కుకోక ముందు “రజనీ” గారు రేడియోలో ఇచ్చిన అవకాశాలు చాలా ఆదుకున్నాయని ఘంటసాల చెబుతారు. లలిత సంగీతానికి చాలా ప్రాచుర్యం కల్పించిన వారు “రజనీ”. రాజేశ్వరరావు, బాలసరస్వతి జంటగాను, విడివిడిగానూ “రజనీ”గేయాలు చాలా పాడారు. అవి మంచి పాపులర్ అయ్యాయి కూడా. “చల్లగాలిలో, ఓ విభావరీ, కోపమేల రాధా, పోయిరావే కోయిలా” మొదలయినవి వాటిలో కొన్ని.

ఇంక ఆయన పని చేసిన సినిమాలు రాశిలో తక్కువయినా వాసిలో ఎక్కువే. మొదటగా చేసిన సినిమాలు జగన్నాథ్ గారి “తారుమారు, భలే పెళ్లి”. ఆయన భార్య సుభద్రగారి చేత “జో అచ్యుతానంద “పాడించారు.
తర్వాత “గృహప్రవేశం” సినిమాకు మాటలు, పాటలు కూడా రాశారు. “లక్ష్మమ్మ”కు పాటలు రాశారు. “స్వర్గ సీమ”లో “ఓ పావురమా” పాట, ట్యూనూ ఈయనవే. “మానవతి”, “పేరంటాలు”లో పాటలు రాశారు. “బంగారు పాప”లో “తాథిమి తకథిమి తోల్ బొమ్మా” అంటూ మాధవపెద్ది పాడింది అద్భుతమైన పాట.

Balantrapu R Rao“రాజమకుటం”లో పాటలు కొన్ని… “ఊరేది పేరేది ఓ చందమామా” అనే రాగమాలిక ఎంత బాగుంటుందో ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదు.
సినిమాల్లో రాసేటపుడు చాలావరకూ “నాగరాజు”,”తారానాథ్”,”నళినీ”… వంటి మారుపేర్లతో రాసేవారు, రేడియో ఉద్యోగానికి భంగం రాకుండా.
కొన్ని సినిమాలకు సంగీత దర్శకులుగా వేరే వాళ్ల పేర్లుండేవి కానీ బాణీలు ఈయనవే. అంటే వాళ్లు ఆర్కెస్ట్రయిజేషన్ చేసి రికార్డ్ చేసేవారన్న మాట.

ఆయన సంగీత దర్శకత్వంలోని విశేషమేమంటే ఆయనకు శాస్త్రీయ సంగీతం తెలుసు, సంప్రదాయ సంగీతం తెలుసు, జానపద ధోరణులు ఎరిగి ఉన్నారు, సూఫీ సంగీతం, అరేబియన్ పోకడలు, బెంగాలీ వరసలు, రవీంద్ర సంగీతం, మరాఠీ మట్లు, హిందూస్థానీ పట్లు, గజల్ సంగీతం… ఇవన్నీ అలవోకగా ఎలా సాధించారో తలుచుకుంటే పిచ్చెక్కి పోతుంది. అందుకే ఆయన బాణీలు ప్రత్యేకంగా, అనుకరణకు సాధ్యం కాకుండా, నిత్యనూతనంగా ఉంటాయి.

రచనల్లో రజనీ
రజనీకాంతారావు ఎన్నో ప్రామాణికమైన రచనలు చేశారు.. అందులో కొన్ని ఇవీ…
శతపత్ర సుందరి గీత సంపుటి. 200పైగా గీతాలున్నాయి. (దీనికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది)
విశ్వవీణ రేడియో నాటకాల సంకలనం. 1964లో ప్రచురణ
ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథం. (దీనికి 1958లో తెలుగు భాషా సమితి పోటీ బహుమతి లభించింది)
తండ్రిగారి ఏకాంత సేవకు ఆంగ్లంలో ‘Alone with spouse divine’ అనువాదం
క్షేత్రయ్య పదాలకు ఆంగ్లానువాదం ‘Amourse of the Divine Cowherd’ (కేంద్ర సాహిత్య అకాడమీవారికి)
క్షేత్రయ్య, రామదాసు జీవిత చరిత్రలు (కేంద్ర సాహిత్య అకాడమీవారికి)
‘రజనీ భావతరంగాలు’ – ఆంధ్రప్రభలో శీర్షిక
క్షేత్రయ్య పదాలు, గాంధారగ్రామ రాగాలు, గీతగోవిందం, భారతీయ సంగీతంలో ప్రాచీన రాగాలు మొదలైనవాటి మీద పరిశోధనావ్యాసాలు. (మద్రాసు మ్యూజిక్ అకాడమీలో)
జేజిమామయ్య పాటలు
మువ్వగోపాల పదావళి
త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవితచరిత్రలు
ఏటికి ఎదురీత (కవితలు)
చతుర్భాణీ (4 సంస్కృత నాటకాలకి తెలుగు అనువాదం)
ఆన్నమాచార్య కీర్తనలకి ఆంగ్లానువాదం
శతపత్రసుందరి
ఇది రజనీకాంతరావు రచించిన గేయసంపుటి. దీనిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు 1954 ప్రచురించారు

నృత్య/సంగీత రూపకాలు
రజనీ రూపొందించిన సంగీత నృత్య రూపకాలు కోకొల్లలు….వాటిలో కొన్ని….
చండీదాసు, మేఘసందేశం, సంధ్యాదీపకళిక, మధురానగరిగాథ, సుభద్రార్జునీయం, గ్రీష్మఋతువు, శ్రీకృష్ణశ్శరణం మమ, మేనకావిశ్వామిత్ర, క్షీరసాగర, మథనం (స్వరరచన), విప్రనారాయణ (స్వరరచన), కృష్ణశాస్త్రిగారి అతిథిశాల (ఉమర్ ఖయ్యూం) (స్వరరచన) – పర్షియన్ బాణీలో కూర్చిన సంగీతం. దీనికి చాలా పేరు వచ్చింది., దివ్యజ్యోతి (బుద్ధుడు), విశ్వవీణ (ఓర్ఫియస్), కళ్యాణశ్రీనివాసం, నమోస్తుతే హరి, వాద్యబృంద, ఆంధ్రి (కళ్యాణి, దేశవరాళి, దేవసాళగం రాగాలతో), విశ్వయానం (శబ్దచిత్రం) – విశ్వం యొక్క పుట్టుక, పరిణామం గురించి, సంగీత గంగోత్రి – భారతీయ సంగీతం యొక్క పుట్టుక, పరిణామం గురించి, కామదహనం

అందుకున్న పురస్కారాలు/బిరుదులు
పుంభావ సరస్వతి, నవీన వాగ్గేయకార…వంటి బిరుదులు పొందిన బాలాంత్రపు రజనీకాంతారావు ఎన్నో ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు.
ఠాగూర్ అకాడమీ రత్న – రవీంద్రనాథ్ ఠాగూర్ 150 జయంతి సందర్భంగా సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసింది.
కళాప్రపూర్ణ – ఆంధ్ర విశ్వవిద్యాలయం 1981 లో బహుకరించిన గౌరవ డాక్టరేట్.
కళారత్న అవార్డు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 లో ఇచ్చిన పురస్కారం.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం – 1961. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథానికి.
ప్రతిభా మూర్తి జీవితకాల సాఫల్య బహుమతి – అమెరికాలోని అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి పురస్కారం.
నాథ సుధార్ణవ అనే బిరుదును మదరాసు మురళీరవళి ఆర్ట్ అకాడమీ నుంచి పొందారు.

Send a Comment

Your email address will not be published.