సరిలేరు నీకెవ్వరు

విశ్వ విఖ్యాత నట యశస్వి యస్వీఅర్
జూలై 3 నుంచి ఎస్వీ రంగారావు శత జయంతి ప్రారంభం
——————————

svr4

చాలా మందికి ఎస్వీ రంగారావు అంటే పాతకాలం నటుడని మాత్రమే తెలుసు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఒక ద్రువతార. ప్రసిద్ధ తెలుగు సినిమా నటునిగా గుర్తింపు పొందిన ఎస్వీ రంగారావు అభిమానులకు కూడా అయన అసలుపేరు తెలియదు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 – జులై 18, 1974). నట యశస్విగా పేరు పొందిన ఈయన మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించారు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పోయారంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపోయారు.

జీవితం తొలిదశ
svr1కృష్ణా జిల్లా లోని నూజివీడులో 1918 జూలై 3 వ తేదీన  లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు ఎస్వీ రంగారావు జన్మించారు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవారు. కలిగిన కుటుంబం. తాత సర్జన్‌. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మద్రాసులో నానమ్మ దగ్గర ఉంటూ అక్కడే హైస్కూలు చదువు చదివారు. ఆంధ్రా తిరిగి వచ్చి డిగ్రీ పూర్తి చేశారు. ఫైర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. మూడు నెలలకు మించి చేయలేకపోయారు. దగ్గర బంధువు తీసిన ‘వరూధిని’ (1947)లో మొదటిసారి హీరోగా నటించారు. అది ఫ్లాప్‌ అయింది. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుని మూడేళ్లు జంషడ్‌పూర్‌ వెళ్లిపోయారు. తిరిగి ‘పల్లెటూరి పిల్ల’తో రంగప్రవేశం చేశారు. ఈలోపే మేనమామ కుమార్తె లీలావతితో వివాహమయ్యింది. దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ గట్టి పట్టు పట్టడంతో ‘షావుకారు’లో రౌడీ పాత్ర లభించింది. ఆ తర్వాత ‘పాతాళభైరవి’లోని నేపాళ మాంత్రికుడు పాత్రతో స్టార్‌డమ్‌ వచ్చింది. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు కోటేశ్వరరావు కూడా చిన్న వయసులోనే హార్ట్‌ ఎటాక్‌తో మరణించారు. కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ఎస్‌.వి. రంగారావు మనవడు జూనియర్‌ ఎస్వీఆర్‌ సినిమా హీరోగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

నటన వైపు అడుగులు
యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివారు. డిగ్రీ వరకూ చదివి, SVR3అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించారు.
బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవలో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.

వ్యక్తిగతం
చాలా సినిమాల్లో కర్కశ హృదయుడైన ప్రతినాయక పాత్రలు పోషించినా వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు. యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు.

విశిష్టత
SVR5తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు రెండు కళ్ళయితే ఎస్వీ రంగారావు హృదయం లాంటివారు. అది మాయాబజార్ లో ఒక దృశ్యం…..‘నీవేనా నను పిలిచినది… నీవేనా నను కొలిచినది’…. ప్రియదర్శినిలో కనిపిస్తున్న సావిత్రిని చూస్తూ కళ్లు ఎగరేస్తూ అక్కినేని పాడుతున్నాడు. ప్రేక్షకులు మైమరిచి చూస్తున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’…. వెన్నెల సరోవరంలో సంధ్యను తోడు తీసుకుని రెల్లు పొదల మీదుగా ఎన్‌.టి.ఆర్‌ నౌకా విహారానికి బయలుదేరాడు. ప్రేక్షకులు ముచ్చటపడి చూస్తున్నారు. ఈ ముచ్చట… ఈ మైమరుపు… సరే. సినిమాకు ఇవి కావాల్సిందే. కాని చాలవు. ఏం కావాలి? అదిగో అటు చూడండి. మహాఘటం మోగుతోంది. ఘణఘణఘణ మూర్ఛనలు పోతోంది. అసుర గణాలు మెడలోని ఎముకలు పైవస్త్రాలు సర్దుకుంటూ అదుపాజ్ఞలలోకి వచ్చి వినయంగా వరుసదీరి నిలుచుంటున్నాయి. ‘షావుకారు’లో సున్నపు రంగడు, ‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడు, ‘బంగారుపాప’లో కోటయ్య, ‘సంతానం’లో గుడ్డి రంగయ్య, ‘పెళ్లి చేసి చూడు’లో ‘వియ్యన్న’… ఈ పాత్రలన్నీ ఎస్‌.వి.రంగారావును తిరుగులేని కేరెక్టర్‌ ఆర్టిస్టుగా నిలబెట్టాయి. అప్పటికి ‘బాడీ లాంగ్వేజ్‌’ అనే మాట తెలియదు. కాని ఆ బాడీ లాంగ్వేజ్‌తోనే తాను కావలసిన పాత్రలా మారిపోతున్నాని ఎస్‌.వి.ఆర్‌కు తెలుసు. అందుకే ఆయన మంచివాడు, క్రూరుడు, ఇంటి పెద్ద, సంఘంలో మర్యాదస్తుడు. అందుకే ఆయన తెలుగుతో పాటు తమిళంలలో కూడా ఖ్యాతి గడించాడు. శివాజీ గణేశన్‌ ఆయనకు ఆప్తమిత్రడు. ఈ రెండు పులులు కలిసి తపాకీ పట్టుకుని అడవిలో మరో పులిని వేటాడిన ఉదంతం ఆ కాలానికి మిగిలిన ఒక అపురూపమైన ముచ్చట. ఎస్‌.వి.ఆర్‌ సీను ఎంతగా కబళించేవారంటే ఆయనతో కలిసి శివాజీ నటించాల్సి వస్తే ‘ఈ సీను నాకు వదిలిపెట్రా’ అని ఎస్‌.వి.ఆర్‌ని బతిమిలాడేవారట. ప్రతి ఆర్టిస్టుకు స్క్రీన్‌ మీద తానేమిటో చూపించాలని అహం ఉంటుంది. అందుకే ఎస్‌.వి.ఆర్‌ రిహార్సల్‌లో ఒకలాగా టేక్‌లో మరోలాగా చేసేవారట. రిహార్సల్స్‌లో ఆయన చేసిన పద్ధతికి ఫిక్స్‌ అయిన సహ నటీనటులు టేక్‌లో ఆయన చప్పున ధోరణి మార్చేసరికి ఖంగు తిని తెల్లబోవడం ఆనవాయితీగా ఉండేది. సావిత్రి కూడా ‘కన్‌ఫ్యూజ్‌ చేయకు బావా’ అని ముద్దుగా విసుక్కునేదని చెప్పుకుంటుంటారు.

హాస్యంలోనూ రారాజే
కేవలం విలన్ గా మాత్రమే కాదు. హాస్యాన్ని పండించడం లోనూ ఎస్వీ రంగారావు రారాజుగా నిలిచారు. ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్‌’, svr8‘గుండమ్మ కథ’, ‘మంచి మనసులు’, ‘తోడి కోడళ్లు’… ఈ సినిమాలన్నింటా ఎస్‌.వి.ఆర్‌ సున్నితమైన హాస్యాన్ని చూపించారు. నేపాళ మాంత్రికుడిగా భయపెట్టిన వ్యక్తి సూర్యకాంతం మొగుడిగా చేతులు నలుముకుంటూ నిలబడి మెప్పించడం వింతే కదా. ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘వెలుగునీడలు’, ‘దసరాబుల్లోడు’…. ‘మాట్లాడరేమండీ’ అని సూర్యకాంతం అంటే ‘నిన్ను కట్టుకున్నాక ఎప్పుడు మాట్లాడాను కనుక’ అని ఎస్‌.వి.ఆర్‌ టైమింగ్‌తో అనడం తెలుగువారికి మాత్రమే సొంతమైన నటనా వినోదం.

విషాదాన్నీ ఆవిష్కరిస్తూ..
విషాద సన్ని వేశాల్లోనూ ఆయనకు తిరుగుండేది కాదు. ‘హరిశ్చంద్ర’, ‘ఆత్మబంధువు’, ‘లక్ష్మీ నివాసం’, ‘సుఖదుఃఖాలు’, ‘సంబరాల రాంబాబు’, ‘దసరాబుల్లోడు’… ఇవన్నీ ఆయన ప్రదర్శించిన కరుణ రసంతో కన్నీరు పెట్టించాయి. ‘పండండి కాపురం’లో ఆయన వంటి పెదనాన్నను పోల్చుకుని ప్రేక్షకులు ఉండరు. ‘తాత–మనవడు’లో అటువంటి తాతను చూసి శోకించని మనుమలూ ఉండరు. ‘బాబూ… వినరా… అన్నాదమ్ములా కథ ఒకటి’… ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం’…. రేడియోల్లో నేటికీ మోగే ఈ గీతాలు ఎస్‌.వి.ఆర్‌. వేసిన భిక్ష.

అవార్డులు, ప్రశంసలు
svr21964లో ‘జకార్తా’లో ‘ఆఫ్రో–ఆసియా ఫిలిమ్‌ ఫెస్టివల్‌’ జరిగి అందులో 24 దేశాలు పోటీ పడితే అందులో ‘నర్తనశాల’ కూడా పాల్గొంటే అవార్డు కమిటీ ఆ సినిమాతో పాటు అన్ని సినిమాలను జల్లెడ పట్టింది. ఈ 24 దేశాల నుంచి ఉత్తమ నటుడుగా ఎవరిని ప్రకటించాలి? వేదిక మీద పేరు పిలిచారు. సామర్లకోట వెంకట రంగారావు అని. ఒక తెలుగువాడికి అంతర్జాతీయంగా మొదటిసారి చప్పట్లు వినిపించిన సందర్భం అది. అలా నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు చిరస్మరణీయులు
ఎస్వీ రంగారావుపై గౌరవ సూచకంగా, తెలుగు సినీ పరిశ్రమకి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా 2013లో కేంద్రప్రభుత్వం తపాలాబిళ్లని విడుదల చేసింది. విశ్వనటచక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ అనేవి ఆయన బిరుదులు

బహుమతులు:
రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం ‘చదరంగం’ ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం ‘బాంధవ్యాలు’ తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి.
నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.

చరమాంకంలో
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసులో అందరికీ భౌతికంగా దూరమయ్యారు. 1973లో ఆయనకు హైదరాబాదులో బైపాస్‌ సర్జరీ జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా షూటింగ్‌లో పాల్గొన్నారు. 1974 జూలై 18 మధ్యాహ్నం మూడు గంటల వేళ తిరిగి హార్ట్‌ ఎటాక్‌ రావడంతో మరణించారు.

బాపు రమణల ప్రశంసలు
ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపు వేసిన చిత్రానికి ముళ్ళపూడి వెంకట రమణ…. ఇలా చాలా చమత్కారంగా ఆవిష్కరించారు
క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి ‘ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు

Send a Comment

Your email address will not be published.