సాహితీ సువనం మెల్బోర్న్ మహా నగరం

6వ ప్రపంచ సాహితీ సదస్సుLamp lighting

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగు వారి చరిత్రలో ఒక సాహితీ శిఖరం. అనుపమేయమైన సారస్వతము. నిరుపమానమైన వాఙ్మయము. అద్వితీయమైన భాషా సౌరభము. అజరామరమైన వాక్పరిమళము.

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల సాహితీ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం శ్రీ వంగూరి ఫౌండేషన్ వారు, లోక్ నాయక్ ఫౌండేషన్ మరియు ఆస్ట్రేలియా తెలుగు సంఘం సౌజన్యంతో నిర్వహించిన 6వ ప్రపంచ సాహితీ సదస్సు. ఇక్కడి ప్రతీ నగరంలో ఒక తెలుగు సంఘం ఏర్పడి ప్రతీ ఏటా మన పండుగ సంబరాలను జరుపుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆనవాయితీ. ఈ పండగలకు భారతదేశం నుండి ఒకళ్ళిద్దరు నిష్ణాతులైన వ్యక్తులు రావడం వారి వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం మరియు సందేశాత్మక ఉపన్యాసాలతో ముగియడం జరుగుతుంది.

అయితే ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో నివసించే తెలుగువారి ప్రస్థానం ఇతివృత్తంగా నవంబరు 3, 4 తేదీల్లో జరిగిన రెండు రోజుల కార్యక్రమాల్లో ఈ రెండు దేశాలలోని సుమారు 25మంది వక్తలు మన పురోగతిని అందరితో పంచుకున్నారు. మన సాహిత్యాన్ని మననం చేసారు. మన కధనాలను వినిపించారు. మన కవితల మకరందాన్ని మేదోమదనం చేసారు. అవధానాన్ని ఔపోసన పట్టారు. మన పండుగులకు రక్తి కట్టించారు. భావితరాలకు బాట చూపించారు.

ప్రారంభ కార్యక్రమం
Teachers

“పద్మభూషణ్” శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారితో పాటు భారతదేశం నుండి వచ్చిన ఇతర ప్రత్యేక అతిధుల జ్యోతి ప్రజ్వలనతో మొదలైన ప్రారంభ కార్యక్రమంలో శ్రీ యార్లగడ్డ గారు ప్రారంభోపన్యాసంలో విదేశాలలో, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మన భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణల పట్ల చూపుతున్న ఆసక్తికి అభినందనలు తెలిపారు. సంప్రదాయం ప్రకారం ముందుగా మెల్ బోర్న్ మరియు మలేషియా ప్రాంతాలలో బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న 17 మంది తెలుగు ఉపాద్యాయుల సత్కారంతో ప్రారంభ సభ మొదలు అయింది.

భారతదేశం నుండి…
6World Telugu -APఉద్దండులైన తెలుగు భాషా పరిజ్ఞానులు “పద్మభూషణ్” శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము ఉపకులాధిపతి ఆచార్య శ్రీ ఎస్వీ సత్యనారాయణ గారు సతీ  (శ్రీమతి కందిమళ్ళ భారతి గారు) సమేతంగా, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు, అవధాన భారతి డా. “పాలపర్తి శ్యామలానంద ప్రసాద్” గారు, ఆంధ్ర జ్యోతి సంపాదకులు శ్రీ అప్పరసు కృష్ణారావు గారు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయిత శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఇంకా ఎందరో వక్తలు విచ్చేసి తమ ప్రసంగాలతో సాహితీ సదస్సును హోరెత్తించి స్పూర్తిప్రదాతలుగా నిలిచారు. ఈ సందర్భంగా భారతదేశ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు వారి సందేశాన్ని వీడియో ద్వారా పంపించారు.

మలేషియా నుండి…
IMG-Malaysiateam

తమ తాతలు, ముత్తాతలు ఐదు తరాల క్రితం పొట్టచేత పట్టుకొని వలస వెళ్లి అక్కడి రబ్బరుతోటల్లో పనిచేసుకుంటూ మన భాషా సంస్కృతులు మూల సంపదగా తమ ఉనికిని కాపాడుకుంటూ ఈ సాహితీ సభలకు వచ్చి వారు ప్రదర్శించిన తీరు చాలామందికి కంట తడి పెట్టించాయంటే అతిశయోక్తి కాదు. ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’, ‘ఐదు తరాల తమ స్వీయ కధ’ బుర్రకధ రూపంలో పదిహేనేళ్ళ లోపు వయసుగల పిల్లలు అచ్చ తెలుగులో పాడి మన భాషా సంస్కృతులకు జీవం పోసారు. వారి భాషా ఉచ్చారణ ఎంత అద్భుతం. చాలామంది శ్రోతలు వారి నటనాపాటవాలకు మంత్రముగ్డులై భావోద్రేకానికి గురై వారికి వేదికపైనే బహుమతులనిచ్చారు.
మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ అచ్చయ్య కుమార్ గారు అక్కడ తెలుగు సంఘం పిల్లలకు మన భాషా సంస్కృతులు నేర్పిస్తున్న విధానం మరియు అక్కడి కొంతమంది ఉపాధ్యాయులు వారాంతంలో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి విద్యార్ధులకు బోధనా చేసే విధానం వివరించారు. ముఖ్యంగా మలేషియాలో వారు స్థానికంగా 5 మిల్లియన్ డాలర్ల ఖర్చుతో కట్టించుకున్న తెలుగు పీఠం అందరినీ ఆకర్షించింది.

ఫ్రాన్స్ నుండి…
IMG_6378పశ్చిమ దేశాల నుండి తెలుగు భాషకు సేవ చేసిన వారిలో సి.పి.బ్రౌన్ ఆద్యుడు. ఆ తరువాత చాలామంది మన భాషను వివిధ రీతుల్లో పోషించారు, శ్లాఘించారు. అయితే ఆధునిక కాలంలో ఐరోపా ఖండంలో తెలుగువారు కూడా అభిమానించలేని విధంగా మన భాషను మరే ఇతర భాషా పదాలను వాడకుండా, వాడినా వాటిని తెలుగుపదాలు వెనువెంటనే చేర్చి అనర్గళంగా మాట్లాడగల ఒకే ఒక వ్యక్తీ డేనిఎల్ నెజేర్స్. పరభాషా సంస్కృతిలో పుట్టి పెరిగి ఫ్రాన్స్ ప్రభుత్వ జాతీయ సంస్థ INALCO లో దక్షిణాసియా దేశ భాషల శాఖాధిపతిగా కొన్నేళ్ళుగా పనిచేస్తున్న డేనిఎల్ కి మన భాషంటే ఎంతో మక్కువ. 2020 లో ఈ ప్రపంచ సాహితీ సదస్సు పారిస్ నగరంలో నిర్వహించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మన జనపదాలు, జానపదాలు, పౌరాణిక నాటకాలతో కూడిన ఒక బృహత్తర కార్యక్రమం ఈ సదస్సులో ప్రదర్శించి అక్కడి స్థానికులకు మన సంస్కృతీ చరిత్ర తెలియజేయాలన్న గట్టి తలంపుతో ఉన్నారు.

మారిషస్ నుండి…
Mauritius

సంజీవ నరసింహప్పడు అంటే ఎవరికి తెలీదు? ఏ విషయాన్నైనా ఒక్క తెలుగేతర భాషా పదం లేకుండా ఏకధాటిగా మాట్లాడగల ధీరుడు. ఒకే చేతిలో వివిధ రంగుల 5 కాలాలు పట్టి పేర్లు కానీ ముగ్గులు (రంగవల్లులు) వేయడంలో కానీ అందె వేసిన చేయి. 200 ఏళ్ల క్రితం వారి తాత, ముత్తాతలు వలస వెళ్లి మారిషస్ దేశంలో స్థిరపడి మన భాషా సంస్కృతులను దివ్య సంపదలుగా అందిస్తే వాటిని కాపాడుకోవడానికి ఒక మహోజ్వలమైన యజ్ఞం చేస్తున్నారీయన. మారిషస్ ప్రభుత్వం కూడా వీరికి తగిన నైతిక, ఆర్ధిక సహాయం అందిస్తూ చేయూతనిస్తుంది. శ్రీ సంజీవ గారు మొదటిసారిగా ఆస్ట్రేలియా వచ్చి వారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

న్యూ జిలాండ్ నుండి…
చిన్న దేశమైనా వన్నెగల దేశం. ఈ సుందరమైన దేశంనుండి సువిశాల హృదయులు నలుగురు వచ్చి మన సాహితీ సదస్సుకే వన్నె తెచ్చారు. ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి పద్మా గోవర్ధన్ గారు ‘త్యాగరాజ సంగీత వాజ్మయం’ పై, శ్రీమతి జ్యోతి మల్లికార్జున్ రెడ్డి గారు ‘వీకెండ్ పండగలు’ పై మరియు శ్రీ మగతల జగదీశ్వర రెడ్డి గారు ‘న్యూ జిలాండ్ లో తెలుగువారి ప్రస్తానం’ పై ప్రసంగించి ఆహూతులను ఆకట్టుకున్నారు.

అమెరికా నుండి…
వంగూరి ఫౌండేషన్ తరఫున శ్రీ చిట్టెన్ రాజు మరియు శ్రీ సాయి రాచకొండ (దంపతులు) వచ్చి సభా నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించారు. పాత్రధారులు, సూత్రధారులు, హాస్య శిరోమణి శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు ఈ సదస్సుకు హారానికి దారంలా, పాటకు పల్లవిలా, పద్యానికి పాదంలా, కధకు శీర్షికలా అన్నీ తానై, తనతో అందరినీ కలుపుకొని రెండు రోజుల కార్యక్రమం సజీవంగా ఎవరికీ విసుగు అనిపించకుండా నడిపించారు. వారికీ సభాసదులందరూ ధన్యవాదములు తెలుపుకుంటున్నారు.

ఆస్ట్రేలియాలో…
మెల్బోర్న్ నగరంలోని సాహితీ పిపాసకులతో పాటు ఆస్ట్రేలియాలోని అన్ని ముఖ్య నగరాలనుండి షుమారు 30 మంది ఈ సదస్సుకు హాజరై క్రొత్త పరిచయాలకు నాంది పలికి తమ సాహితీ సమలోచనలను అందరితో పంచుకున్నారు. సందడిగా సదస్సును సాహితీ కుసుమాలతో స్వాగతించారు. సుకవులెందరో తమ సాహితీ పరిమళాలను వెదజల్లారు. అక్షరం ఎప్పుడూ మన పక్షమేనన్న మనోబలాన్ని ఒత్తి పలికారు. సరస సాహితీ సంభాషణల చతురోక్తులు ఉల్లేఖించారు.

కవితాస్త్రాలయ 2018
Kavitastraliya 3

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో నివసించే తెలుగువారి ప్రస్థానం ఇతివృత్తంగా ఆ చరిత్ర కారకుల సమక్షంలో మన చరిత్రను మనమే వ్రాసుకొని ఆవిష్కరించుకోవడం అత్యంత గొప్ప విషయం. సుమారు 30 మంది భాషాభిమానులు తమ ఆలోచనలకు అక్షర రూపమిచ్చి కవితాస్త్రాలయ 2018 ముచ్చటగా మూడవ సంకలనాన్ని తీర్చి దిద్దారు. ఈ సంకలనాన్ని సాహితీ సదస్సులో శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.
కవితాస్త్రాలయతో పాటు భారతదేశానికి చెందిన అనేకమంది రచయితల పుస్తకాలూ, వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన పుస్తకాలూ కూడా ఈ సందర్భంగా అవిష్కరించబడ్డాయి.

జీవిత సాఫల్య పురస్కారం
Presentation
sydney Telugu1

ప్రతీ సాహితీ సదస్సులో ‘జీవిత సాఫల్య పురస్కారం’ ఒకరికి ఇవ్వడం ఆనవాయితీ. దీనికి ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఒక రచయితగా కవిత్వం, కథ, నాటకం, మొదలైన ఏ సాహిత్య ప్రక్రియలో అయినా చెప్పుకోదగ్గ కృషి చేసి ఉండాలి. తాము స్వయంగా రచయితగా తమ రచనలు ప్రచురించినప్పటికీ, పత్రికా సంస్థాపన, సాహితీ సమావేశాల నిర్వహణ, రేడియో ప్రసారాలు మొదలైన ప్రక్రియలలో ఇతర రచయితలనీ, సాహితీవేత్తలనీ ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టి సాహిత్య సేవ అదనపు అర్హత. ఈ సంవత్సరం సిడ్నీ వాస్తవ్యులు శ్రీ దూర్వాసుల మూర్తి గారి దంపతులకు ఇవ్వడం జరిగింది. కిరీట ధారణ, పుష్పాభిషేకంతో పాటు వారికి పారితోషికం కూడా అందజేయడం జరిగింది.

ముగింపు…
రెండు రోజులు ఆసాంతం వక్తల వివిధ అంశాలపై జరిగిన ఉపన్యాసాలు కొన్ని హస్యరసాలతో రక్తి కట్టించగా కొన్ని సందేశాత్మక సమన్వయ పూరితమైన సమలోచనలుగా పరిఢవిల్లాయి.
తన ముగింపు ఉపన్యాసం లో “పద్మభూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కేసీఆర్ నాయకత్వంలో తెలుగు భాష పట్ల తెలంగాణా ప్రభుత్వ విధాలని ప్రశంసిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ నిరాదరణ పట్ల విచారం వ్యక్తం చేశారు. తన ముగింపు సమీక్షలో ఈ సదస్సు ప్రసంగాల స్థాయి అనుకున్న స్థాయి కన్నా తక్కువగా ఉన్నా, సదస్సు ప్రధాన ఆశయం అయిన అంశం – ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు రచయితలని ఒకే వేదిక మీదకి తెచ్చిన ఈ సదస్సు విజయవంతం అయినట్టు వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయ పడ్డారు.

ఈ విశ్వ భాషా యజ్ఞంలో గత ఆరు నెలలుగా అహోరాత్రులు జీవించి కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ సదస్సు ముఖ్య సమన్వయకర్త, తెలుగుమల్లి అధినేత శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు ఎంతో కృషి చేసారు.  వారితోపాటు తెలుగు సంఘం కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గుళ్ళపల్లి గారు కూడా చాలా కృషి చేసారు.  ఈ రెండు రోజుల కార్యక్రమంలో పలువురు స్వచ్చంద కార్యకర్తలు శ్రీమతి ప్రత్యూష కొంచాడ, శ్రీమతి లక్ష్మి పేరి, శ్రీమతి లత కట్ట, శ్రీమతి కవిత గుళ్ళపల్లి, శ్రీమతి నీలిమ వీరమాచినేని మరియు చిరంజీవి ప్రియాంక మార్గాని తమవంతు సేవలందించారు.  ఈ కార్యక్రమానికి అల్పాహరంతో పాటు విందు భోజన ఏర్పాట్లు బిర్యానీ మహల్ (వంశీ బుడిగె) మరియు సౌండ్ సిస్టంకి కావలసిన ఏర్పాట్లు శ్రీ మురళి బుడిగె గారు అందించారు.

_DSR868-0_DSR8663M

IMG_6383u IMG_6316g

_DSR8169_A_DSR8880

Send a Comment

Your email address will not be published.