సుమధుర స్వరఝరి

సుమధుర స్వరఝరి ఎస్. జానకి
ఏప్రిల్ 23 ఎస్ జానకి పుట్త్టినరోజు

Singer_Janaki

గోవుల్లు తెల్లన…గోధూళి ఎర్రన… అంటూ అమాయక చిన్నారి ప్రశ్నలను పలికించింది ఆ గాత్రం. వెన్నల్లో గోదారి అందం అంటూ నిర్బంధంలో ఉన్న స్త్రీ వేదనను రాగయుక్తంగా ఆలపించింది. సిరిమల్లె పువ్వా… సిరిమల్లె పువ్వా అంటూ పదహారేళ్ల అమ్మాయి ఊసులను చెప్పింది ఆ కంఠం. ఆమె గాత్రం ఏడిచే పిల్లాడికి జోలపాట, శ్రామికుడికి పనిలో అలసటను మరిపించే పాట, పోరాట మహిళలకు ఉత్సాహాన్నిచ్చే పాట ఇలా ఆమె గాత్రం దక్షిణ భారతాన సుపరిచితం. దాదాపు 55 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆమె తన సేవలను అందించారు. ఆమె ఎవరో కాదు.. 50,000లకు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గాయని జానకి.

ఎస్.జానకిగా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి తన 55 సంవత్సరాల పైన సినీ జీవితంలో వేలాది పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు. 1957 లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.
Janaki Ilayaraja SP
బాల్యం
జానకి గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో ఏప్రిల్ 23,1938న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేవారు. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టారామె. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేవారు. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారారు.

గాయనిగా
తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయింది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది. తెలుగులో విజయవంతము అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారామె. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడారు. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని, సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలో గడుపుతుంటారు. అంతేకాక మీరా పై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేశారు. ఉషా కిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు పొందారు.

Ghantasala
పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని మెప్పించారు. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం… చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నారు జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. తొలిసారి మిమ్మల్ని చూసింది అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆమె గాత్రం ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.

ఒక గాయని 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం… ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్‌.జానకి కే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడింది జానకి. వాటిలో మంచిపాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్‌… కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్‌.. రెండు రకాలూ పాడగలిగింది జానకి గళం.

హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో ఆమె పనిచేశారు.

స్వరసుధామయి
పగలే వెన్నెల జగమే ఊయల… అంటూ ప్రేక్షుల మనసుల్లో పాతుకుపోయిన జానకి స్వరానికి ఎందరో అభిమానులు. అ మధుర స్వరాన్ని ఇప్పటికి మరచిపోలేని వారు ఉన్నారు. తియ్యటి స్వరాలను అందించిన జానకి గురించి ఎంత చెప్పిన తక్కువే. మన రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల్లో తన స్వరాన్ని వినిపించి స్రోతల మనసులో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అనేక భాషల్లో తెలుగు వారి గళ మాధుర్య రుచిని చూపి మన కీర్తి పతాకను ఎగుర వేసిన స్వరసుధామయి.

జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఫన్‌డాక్టర్‌ చంద్రశేఖర్‌ కుమారుడు వి. రాంపస్రాద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో తిరుపతిలో జరుగుతున్న అన్నమయ్య సంకీర్తనా యజ్ఞంలో పాల్గొనేందుకు జానంకి తిరుపతి వెళ్లారు. తిరుపతిలోని భీమాస్‌ హోటల్‌లో బస చేసిన జానకి బాత్‌ రూమ్‌లో కాలు జారీ పడ్డారు. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయం తగలడంతో, కాలు కూడా బెణికింది. స్విమ్స్‌ ఆసుపత్రికి చికిత్స అనంతరం కోలుకున్నారు.

పద్మభూషణ్‌ తిరష్కరణ
ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2013 సంవత్సరానికి పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే సుమారుగా 55 సంవత్సరాలకు పైగా సినీ రంగంలోనే కాక అనేక ప్రతిష్టాత్మకమైన వేదికల మీద కూడా పాడుతూ ఎందరో ప్రముఖులతో అనేక సన్మాన పురస్కారాలు అందుకుని అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న జానకి పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకోవడానికి ఇష్టపడలేదు. పురస్కారాలకు ఎంపిక చేసేవారు ఆంధ్ర రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని, ఉత్తర భారత దేశ వారు భారత రత్న, పద్మశ్రీలకు ఎంపివుతుంటే దక్షిణ భారత దేశం వారికి మాత్రం ఏదో చిన్న చిన్న పురస్కారాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఈ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు. భారతరత్న పురస్కారం ఇస్తేనే అంగీకరిస్తానని, లేనిపక్షంలో ఇటువంటి పురస్కారాలు తనకు అవసరం లేదని చెప్పడం ఈమె ధీరత్వానికి నిదర్శనం. అభిమానుల గుండెల్లో నేను ఎక్కడో ఎత్తున ఉన్నాను. ఈ అవార్డు ఇవ్వడం పట్ల ప్రభుత్వాన్ని తప్పుబట్టను గానీ, ఇన్నాళ్లకు గుర్తించడం బాధగా ఉందని ఆమె ఒక సందర్భంగా అన్నారు.

పురస్కారాలు
Janaki felicitations

జానకి ఉత్తమ నేపథ్య గాయనిగా 1977, 1981, 1984, 1992 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1986లో కలైమామణి, 1997లో ఫిలింఫేర్‌ దక్షిణ భారత సాహిత్య అవార్డు 2002లో ఎచీవర్‌ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం 2009లో గౌరవ డాక్టరేట్‌, 2011లో కర్నాటక బసవభూషణ్‌ అవార్డు, 2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు, 2013లో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకున్నారు. వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ ప్లేబాక్‌ సింగర్‌గా, కేరళా రాష్ర్ట ఉత్తమ గాయిని 11 అవార్డులు సాధించింది.

జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తెనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు. జానకి వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్‌ప్రసాద్‌ 1990 లలో మరణించారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.

Send a Comment

Your email address will not be published.