హిట్టుమీదే దృష్టి

బ్రూస్లీ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో రామ్ చరణ్ ఇప్పుడు అలా చేదుఅనుభవాన్ని మళ్ళీ చవిచూడకూడదు అనుకున్నారు. త్వరలో రాబోతున్న ధ్రువ చిత్రం కోసం రామ్ చరణ్ వంద శాతం శ్రమిస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలన్న పట్టుదలతో రామ్ చరణ్ కృషి చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం ఆయన డైటింగ్ మొదలుకుని అన్నింటా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓ ఐ పీ ఎస్ ఆఫీసర్ ఎలా కనిపించాలో అచ్చంగా అలా కనబడటం కోసం రామ్ చరణ్ కచ్చితమైన డైట్ పాటిస్తున్నారు. నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారు. పళ్ళ రసాలు స్వీకరిస్తున్నారు. పూర్తిగా శాకాహారం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ పది కిలోల వరకు బరువు తగ్గినట్టు అభిజ్ఞ వర్గాల భోగట్టా.

రామ్ చరణ్ ఈ మధ్యే తన పేస్ బుక్ లో “హలో గైస్ నేను నా తదుపరి చిత్రం కోసం వర్క్ చేస్తున్నాను….డైట్ విషయంలో అవసరమైన రీతిలో జాగర్తలు తీసుకుంటున్నాను. ఆరోగ్యంగా కనిపించడానికి అవసరమైన టిప్స్, ఆహార ప్రణాళిక, వీడియోలు త్వరలో పోస్ట్ చేస్తాను. చూడండి” అని రాసుకున్నారు.

ఆహార డైట్ విషయంలో రామ్ చరణ్ ఏ వ్యక్తిగత ట్రైనర్ నుంచో లేదా డైటీషియన్ నుంచో ఎలాంటి సహాయం తీసుకోలేదని, ఆయన భార్య ఉపాసనే ఈ విషయంలో జాగర్తలు చెప్తున్నారని సన్నిహిత వర్గాల మాట.

రామ్ చరణ్ ఒక క్యారక్టర్ కోసం ఎన్ని జాగర్తలు తీసుకుంటారో అన్నది జగమెరిగిన సత్యం. గత ఏడాది రామ్ చరణ్ బ్యాంకాక్ వెళ్లి శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్లీ చిత్రం కోసం స్టంట్ లు నేర్చుకున్నారు. అలాగే ఇప్పుడు ధ్రువ చిత్రం కోసం అణువణువూ జాగర్తలు తీసుకుంటున్నారు.

ధ్రువ క్యారక్టర్ కోసం శాకాహారం అన్నివిధాల తగినదిగా అనిపించి ఆహారానికి సంబంధించి అన్ని జాగర్తలు తీసుకున్నానని రామ్ చరణ్ చెప్పారు.

ధ్రువ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ ఆరంభమైంది.

అయితే రామ్ చరణ్ పై సన్నివేశాలు మాత్రం ఇంకా మొదలుకాలేదు. పాత్రకు తగినట్టు కనిపించాలన్న ఏకైక కారణంగా రామ్ చరణ్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం రామ్ చరణ్ సెలవు మీద థాయిలాండ్ లోని కొహ్ సముయ్ ప్రాంతంలో ఉన్నారు. జూన్ నెలలో రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత తమ యూనిట్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటారని అభిజ్ఞ వర్గాల మాట.

Send a Comment

Your email address will not be published.