హీరోయిన్లు కావలెను

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిక్కులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి దాకా ప్రత్యేక తెలంగాణ , సమైక్య ఆంధ్ర ఉద్యమాలతో తెలుగు సినీ పరిశ్రమ భారీగా నష్ట పోయింది. ఉద్యమకారులు షూటింగ్ లని అడ్డుకోవడం, సినిమాల విడుదలకి అడ్డంకులు కల్పించడంతో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందరూ నష్టాలు చవి చూశారు. ఆ ఉద్యమాల దెబ్బ నుంచి పరిశ్రమ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటుంది అని నిర్మాతలు ఊపిరి పీల్చుకునే సమయానికి మరో ఇబ్బంది ఏర్పడుతోంది. అదే హీరోయిన్ ల కొరత. ప్రస్తుతం మన తెలుగు సినిమాకి హీరోయిన్ల కొరత చాలా ఎక్కువ గా ఉంది. ఇండస్ట్రీలో ఆరడగుల అందగాళ్ళకు కొదవ లేదు. మహేష్, ప్రభాస్, పవన్ ఇంకా ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్, విష్ణు, మనోజ్, నాగ చైతన్య, గోపిచంద్, రామ్, నానీ వంటి ఎంతో మంది హీరోలు ఉన్నారు. సీనియర్ హీరో లు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతి బాబులు కూడా ఇంకా నటిస్తూనే ఉన్నారు. మరి వీరందరి పక్కన నటించడానికి హీరోయిన్లు మాత్రం లేరు.

తెలుగు సినిమా పరిశ్రమకి చాలా రోజుల నుంచి నటీమణుల కొరత ఉంది. తెలుగు పరిశ్రమ లో నెంబర్ వన్ స్థానానికి చేరిన హీరోయిన్లు అందరూ బాలీవుడ్ కో, కోలీవుడ్ కో వెళ్ళడం జరుగుతోంది.

నాగార్జున సినిమా సూపర్ తో టాలీవుడ్ కి పరిచయమైన నాజూకు భామ అనుష్క. బెంగుళూరు కి చెందిన ఈ యోగా మాస్టర్ సినీ పరిశ్రమలో అందలాన్ని ఎక్కింది. గ్లామర్ హీరోయిన్ గా కేరియర్ ను ప్రారంభించిన అనుష్క ఇప్పుడు భారీ సినిమాల హీరోయిన్. అనుష్క సినిమా లో ఉంటే వంద కోట్లు అయినా పెట్టుబడి పెట్టవచ్చని నిర్మాతల నమ్మకం. ఎం.ఎస్. రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమాతో అనుష్క కి ఈ అవకాశం లభించింది. జేజమ్మ గా అనుష్క నటనకి ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించడం తో పాటు విమర్శకులు సైతం నూరు మార్కులు ఇచ్చారు. దాంతో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న రుద్రమదేవి సినిమాలోనూ, రాజమౌళి దర్సకత్వంలో ప్రభాస్ మొదటి సారి ద్విపాత్రాభినయం చేస్తున్న బాహుబలి సినిమాలోనూ అనుష్క హీరోయిన్. రెండు భారీ ప్రాజెక్టుల్లో పని చేస్తుండటంతో మిగిలిన సినిమాలు ఏవీ అంగీకరించడం లేదు.

మరో హీరోయిన్ కాజోల్. చందమామ తో తెలుగు పరిశ్రమకి దగ్గరైన కాజోల్, మగధీర తో అగ్ర హీరోయిన్ గా మారింది. తెలుగులో వరుస విజయాలు దక్కించుకొని అగ్ర హీరోయిన్ గా వెలుగుతున్నప్పుడే కాజోల్ తన అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకోడానికి వెళ్ళింది. అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తున్నా పూర్తీ స్థాయి లో తెలుగు నిర్మాత దర్శకులకి అందుబాటులో లేదు.

మరో హీరోయిన్ తమన్నా కూడా రామ్ చరణ్ తో రచ్చ రచ్చ చేసి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి పోయింది. నాగ చైతన్యతో తెలుగులో అడుగుపెట్టి అగ్ర హీరోలు మహేష్, పవన్, జూనియర్ ఎన్.టి.ఆర్ లతో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకొన్న తార సమంతా. అయితే ఇక నుంచి నా మొదటి ప్రాధాన్యం మలయాళం, ఆ తర్వాత తమిళ్. తెలుగు సినిమాలకు కొద్ది కాలం దూరంగా ఉండాలని భావిస్తున్న అని చల్లగా చెప్పింది సమంతా. ఇక మరో భామ రిచా. గ్రీకువీరుడు నాగార్జున పక్కన అందాలు ఆరబోసిన ఈ భామ చదువు కోడానికి సినిమాలకి గుడ్ బై చెప్పేసింది.

త్రిష, నయనతార వంటి నటీమణులు కూడా కొలీవుడ్ లో బిజీగా ఉండటంతో తెలుగు హీరోల పక్కన నటించడానికి హీరోయిన్ లు కరువు అయ్యారు. మరి ఈ సమయం లో రంగుల ప్రపంచం లోకి కొత్త గా అడుగు పెట్టాలనుకునే అందమైన అమ్మాయిలకి తప్పకుండా అవకాశం ఉంటుంది. మరి మీకు ఆసక్తి ఉంటే ఆలస్యం ఎందుకు. వెంటనే బయోడేటా తో ఫిలిం నగర్ లో వాలిపొండి.

Send a Comment

Your email address will not be published.