చెరకుగడ నమిలే అమ్మాయి...

బ్రహ్మ సృష్టిలో తానొక బ్రహ్మగా పుట్టి ఆ సృష్టికి ప్రతి సృష్టిగా తన యుగంలోని తారలను నూటికి 95 మందిని తానే సృష్టించి పిల్లలకోడి సి పుల్లయ్యగా పది మందీ చెప్పుకునే ఆయన వల్లే పుష్పవల్లి సినీ పరిశ్రమకు వచ్చారు. ఒకమారు రాజమండ్రిలో సంత జరుగుతోంది. సి పుల్లయ్య తన సహాయకులతో కలిసి సంత చూసేందుకు వెళ్ళారు. సంతలో ఒక అందమైన అమ్మాయి చెరకు గడ తింటూ కనిపించింది. వెంటనే సి పుల్లయ్యగారి “కెమెరా కళ్ళు” ఆమె మీద పడ్డాయి. ఆ అమ్మాయితో సినిమాలో నటింపజేస్తే బాగుంటుంది కదా అని ఆయన అనుకున్నారు.  ఆ అమ్మాయిని తీసుకురావలసిందిగా ఆయన తమ సహాయకులకు చెప్పారు. వాళ్ళు వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి పుల్లయ్య గారి వద్దకు తీసుకు వస్తుంటే ఆమె తాలూకు  వాళ్ళు తమ అమ్మాయిని ఎవరో ఎత్తుకుపోతున్నారని నానా గోల చేసారు. అక్కడితో ఆగలేదు. సి పుల్లయ్య బృందాన్ని పోలీసులకు అప్పగించారు. తాను సినిమా దర్శకుదినని పుల్లయ్య గారు ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. పుల్లయ్య బృందాన్ని పోలీసు స్టేషన్ కు తీసుకుపోయారు. అయితే అప్పట్లో రాజమండ్రిలో పుల్లయ్య గారి చుట్టం ఒకరు పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా ఉండేవారు. ఆయన సహకారంతో పుల్లయ్య బృందం బయటపడింది. ఇంతకూ పుల్లయ్య గారికి ఇన్ని పాట్లు కలిగించిన ఆ చెరకుగడ తింటున్న అమ్మాయి మరెవరో కాదు, ఆమె  పేరు పుష్పవల్లి. ఆమె ఆతర్వాత నాయకిగా ఎనలేని పేరుప్రఖ్యాతులు గడించింది.  పుష్పవల్లి గారు ప్రస్తుత ప్రముఖ హిందీ నటి రేఖకి అమ్మ కూడాను.

Send a Comment

Your email address will not be published.