టాలీవుడ్ కి మాజీ మిస్ ఇండియా

రాకుల్ ప్రీత్ సింగ్, వన్య మిశ్రా, సిమ్రాన్ కౌర్ మండి బాటలోనే ఇప్పుడు మరో మాజీ మిస్ ఇండియా టాలీవుడ్ లోకి ప్రవేశిస్తోంది. ఆమె మరెవరో కాదు మాజీ మిస్ ఇండియా నేహా హింగే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నేహా హీరోయిన్ గా నటిస్తోంది. నేహా 2012 లో మిస్ ఇండియా ఇంటర్ నేషనల్ కిరీటం ధరించిన సంగతి తెలిసిందే కదా…

ఎందరో తారల తర్వాత నేహాను ఎన్నుకున్నారు విజయేంద్ర ప్రసాద్.
ఆయన దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న చిత్రం తొలి షెడ్యూల్ లో ఆమె ఇప్పటికే తన పాత్రను పూర్తి చేసింది కూడా.

ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తన ఎంపిక ప్రక్రియ అంతా రెప్పపాటులో జరిగిపోయినట్టు చెప్పుకుంది. గత నెలలో దర్శకుల నుంచి తనకు ఒక ఫోన్ కాల్ వచ్చినట్టు, స్క్రిప్ట్ చెప్తామని రమ్మన్నారని పిలిపించారని చెప్పింది. విజయేంద్ర ప్రసాద్ తన వీడియో చూసి తన సినిమాలోని పాత్రకు తను అచ్చంగా సరిపోతాననుకుని ఎంపిక చేసారని నేహా చెప్పింది.

తాను హైదరాబాద్ వెళ్లి తిన్నగా దర్శకుల ఆఫీస్ కి వెళ్లానని, ఓ గంట చర్చలు సాగిన తర్వాత తనకిచ్చే పాత్ర గురించి వివరించారని ఆమె తెలిపింది. తనకిచ్చిన పాత్ర ఎంతో నచ్చిందని, తాను ఒక ఎన్ ఆర్ ఐ పాత్రలో కనిపిస్తానని నేహా చెప్పింది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొదవ లేదని. తాను ఒక షూటర్ గాను, ఫైటర్ గాను నటిస్తున్నానని ఆమె తెలిపింది,

ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో లవ్ యు సోనియో అనే సినిమాలో తనుజ్ వీర్వాని సరసన నటించింది. ఈ చిత్రం గత ఏడాది వచ్చింది. అలాగే ఆమె ఇప్పుడు ఒక తమిళ సినిమాలోను నటిస్తోంది. అ చిత్రం పేరు శగాప్దమ్.

Send a Comment

Your email address will not be published.