నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పల్లె

కొన్ని దశాబ్దాల పాటు కథానాయికగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంతరించుకున్న సహజనటి జయసుధ దిల్ రాజు నిర్మిస్తున్న శతమానం భవతి చిత్రంలో ఒ కీలక పాత్ర పోషిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని పల్లెల్లో ఈ చిత్రం తాలూకు చిత్రీకరణ జరుగుతోంది. అయితే సిద్ధాంతం అనే పల్లెల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జయసుధ ఆ పల్లెతో ఉన్న తీపి గుర్తులను మరొక్కసారి మననం చేసుకున్నారు. 1976 లో ఇక్కడే ఈ గ్రామంలోనే ముత్యాల పల్లకి సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ చిత్రీకరణలో పాల్గొన్న జయసుధ మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఆ పల్లెలో మళ్ళీ షూటింగులో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ పల్లెలోని వారిలో చాలా మనది నను గుర్తుపెట్టుకుని పలకరించడం ఆనందంగా ఉంది. కొందరైతే ఆనాడు ఎక్కడ షూటింగ్ జరిగిందో చెప్తూ ఆ ప్రాంతం గురించి చెప్పడం ఆశ్చర్యం వేసింది. వారి అభిమానానికి ధన్యవాదాలు చెప్తున్నా” అన్నారు.

తాను ఎక్కువగా హైదరాబాదు, చెన్నై తదితర ప్రాంతాలలో షూటింగులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ మారుమూల పల్లెలకు వెళ్ళడం మానేసానని జయసుధ చెప్పారు. రాజమండ్రిలో ఉంటూ షూటింగ్ స్పాట్ కి ప్రతిరోజు దాదాపు అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించడం అనేది పెద్ద పనే అని, అయినా ఎలాగోలా అక్కడ షూటింగ్ పూర్తి చేసానని ఆమె చెప్పారు. ఈ మధ్యలో ఆమె బెంగళూరు వెళ్లి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పెళ్ళికి హాజరై రావడం గమనార్హం. గాలి జనార్ధన రెడ్డి తన ఇంటికి వచ్చి పెళ్ళికి ఆహ్వానించారని, పైగా ఆయన తన వీరాభిమాని అని చెప్పారు. ఆయన పెళ్ళికి రావలసిందిగా మరీ మరీ చెప్పడంతో ఆయన కుమార్తె పెళ్ళికి వెళ్లినట్టు జయసుధ తెలిపారు. ఈ పెళ్ళికి హాజరవడంలో ఎలాంటి తప్పూ లేదనే తాను భావిస్తున్నాను అని ఆమె ఒ ప్రశ్నకు జవాబిచ్చారు.

Send a Comment

Your email address will not be published.