పుట్టిన రోజునాడు "లింగా"?

టాలీవుడ్ లో సంక్రాంతికి కొత్త సినిమాలు విడుదల చేయడం సర్వసహజం. అలాగే తమిళ నాట దీపావళి రోజు అమావాస్య ఎంతో మంచిదనే నమ్మకంతో ఆరోజు సినిమాలు విడుదల చెయ్యడం ఆనవాయితి. ఈకోవలోనే వచ్చే దీపావళికి రజనీకాంత్ కొత్త సినిమా లింగా విడుదల కావచ్చని అనుకున్నారు. అయితే ఇటీవల దీపావళి పండగకి కాకుండా డిసెంబర్ నెలలో తన పుట్టినరోజు నాడు విడుదల చేసే ఆలోచన ఉన్నట్టు చూచాయగా రజనీకాంత్ వెల్లడించారు. ఒకవిధంగా ఇది మిగిలిన హీరోల చిత్రాలకు పరోక్షంగా శుభవార్తే అవుతుంది. కమల్ హాసన్, విజయ్, అజిత్ సినిమాలు వచ్చే దీపావళికి విడుదలకానున్నాయి. ఆరోజునే రజనీకాంత్ సినిమా విడుదలకు కూడా సన్నాహాలు చేసుకుంటే కనీసం రెండు వేల థియేటర్ లలో ఆ సినిమా రిలీజ్ అవాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిన సినిమాలకు థియేటర్ లు దొరకడం కష్టమే. కనుక రజనీకాంత్ సినిమా డిసెంబర్ నెలలో వస్తే మిగిలిన చ్జిత్రాల విడుదలకు థియేటర్ ల కొరత ఉండదనే అభిప్రాయం తమిళ చిత్రపరిశ్రమలో లేకపోలేదు.

ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న లింగా సినిమా తెలుగులో కూడా తయారవుతోంది. ఈ చిత్రంలో నాయికలుగా సోనాక్షి సిన్హా, అనుష్కా నటిస్తున్నారు.

మరోవైపు 64 ఏళ్ళ వయస్సులో ఉన్న రజనీకాంత్ పై లింగా కోసం చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలకు అనుకున్నదానికన్నా ఎక్కువ సమయమే పడుతున్నట్టు అభిజ్ఞ వర్గాల భోగట్టా.

ఈ చిత్రానికి కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.