‘బిచ్చగాడు’...చూడొచ్చు

చదలవాడ పద్మావతి, ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మాతలుగా శశి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో వచ్చిన చిత్రం బిచ్చగాడు. విజయ్ ఆంటోనీ, సత్నా, దీపా రామానుజం, భగవతి, ముత్తురామన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చారు. భాషాశ్రీ మాటలు రాసారు.

తమిళంలో సూపర్ హిట్టయిన “పిచ్చైక్కారన్” అనే చిత్రానికి ఇది డబ్బింగ్ రూపం.

అరుణ్ పాత్రలో నటించిన విజయ్ ఆంటోనీ ధనవంతుడు. అతని తల్లి తమ సంస్థలను చూసుకుంటూ ఉంటే విజయ్ ఆంటోని విదేశంలో చదువుకుని స్వదేశానికి వస్తాడు. ఇక తానూ పక్కకు తప్పుకుని వ్యాపారాలను కొడుకు చేతిలో పెట్టాలనుకుంటుంది అతని తల్లి. అయితే సరిగ్గా ఈ సమయంలోనే అతని తల్లి ఫ్యాక్టరీలో జరిగిన ఓ ప్రమాదంతో కోమాలోకి వెళ్లి మంచం పడుతుంది. ఆమె విషయంలో తామేమీ చెయ్యలేమని డాక్టర్లు చెప్పేస్తారు. అయితే తల్లిని మళ్లీ మామూలు మనిషిలా చేయడం కోసం అతను ఓ సాధువు సూచనప్రకారం 48 రోజుల పాటు బిచ్చగాడిలా ఉండటానికి నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో అతను తమ ఫ్యాక్టరీల బరువు బాధ్యతలను తన సమీప బంధువుకి అప్పగిస్తాడు. అనంతరం విజయ్ ఆంటోని చేతిలో ఒక్క పైసా కూడా లేకుండా మరో ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ అతను బిచ్చగాడిలా ఎలా బతికాడు? ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? తన 48 రోజుల గడువు తర్వాత అతని తల్లి మామూలు మనిషైందా లేక ఎలా ఉంది అన్న కథనాన్ని వెండితెరపై చూడాలి.

ఈ చిత్రంలో దర్శకుడు శశి ప్రతిభ చూడదగ్గది. పైగా బిచ్చగాడి పాత్రలో విజయ్ అంటోని నటించడం హాట్సాఫ్. అతని నటన చిత్ర విజయానికి బోనస్సే అని చెప్పుకోవాలి. బిచ్చగాళ్ల జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపడంలో శశి ప్రజ్ఞ ప్రశంసనీయం. హీరోయిన్ సత్నా కూడా బాగానే నటించింది.

ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగిన బిచ్చగాడు చిత్రంలో ముఖ్యంగా హీరో – బిచ్చగాళ్ల మధ్య సన్నివేశాలను శశి అన్ని విధాల రక్తికట్టించారు. అయితే అదేసమయంలో, ఓ సాధువు చెప్పాడని చిత్ర కథానాయకుడు సర్వం విడిచిపెట్టి బిచ్చగాడిగా మారడం కాస్త అసహజంగా ఉందని పెదవి విరిచే ప్రేక్షకులు లేకపోలేదు. కథ మరీ “అతి”గా ఉందని అనుకునే వారున్నారు.

సంగీత దర్శకుడిగానూ విజయ్ ఆంటోనీ విజయవంతంయ్యాడు. పాటలు ఓ మోస్తరు ఉన్నాయి. డబ్బింగ్ చెప్పించడంలో ఇంకాస్త జాగర్తలు తీసుకునుంటే బాగుండేది. తెలుగు నేటివిటీ మిస్సయ్యాం అనిపిస్తుంది. తమిళ వాతావరణమే ఎక్కువగా కనిపించింది

Send a Comment

Your email address will not be published.