మెగాస్టార్ కత్తిలాంటోడు

ఎప్పుడెప్పుడా అని అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఆ శుభఘడియలు 2016 ఏప్రిల్ 29వ తేదీన కార్యరూపం దాల్చాయి. అదే మెగాస్టార్ చిరంజీవి సినిమా తాలూకు పూజా కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం. ఈ చిత్రాన్ని కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ సురేఖలు నిర్మిస్తున్నారు.చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పవర్ ఆన్ చేయగా, తొలి షాట్ కు మెగా బ్రదర్ నాగబాబు దర్శకత్వం వహించారు. మెగాస్టార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తారు.

తమిళంలో విజయ్ కథానాయకుడిగా నటించి అన్ని విధాలా విజయవంతమైన “కత్తి” చిత్రం కథకు రిమేక్ గా మెగాస్టార్ 150వ సినిమా తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతోంది. తెలుగులో తనకు తగ్గ కథలేవీ లేకపోవడంతో చిరంజీవి తమిళ్ చిత్ర కథను ఎంచుకున్నారు.

మెగాస్టార్ చిత్రం పూజా కార్యక్రమాలు ఆయన తనయుడు రామ్ చరణ్ కార్యాలయంలో జరిగాయి.

మెగాస్టార్ దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రావడం విశేషం. అందుకే ఆయన ఈ 150వ చిత్రంపై అన్ని వర్గాల నుంచి బోలెడంత అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అభిమానులు తెగ ఆనందంలో ఉన్నారు. అయితే వెండితెరపై మెగా స్టార్ ను దర్శకుడు వివి వినాయక్ ఏ మేరకు అందంగా చూపిస్తాడు అన్నది వేచిచూడాలి.

మెగాస్టార్ 150వ చిత్రానికి ముందురోజు దర్శకుడు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యెక పూజలు చేయించారు. తనకు మెగాస్టార్ 150వ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడాన్ని వీ వీ వినాయక్ దేవుడిచ్చిన వరమని చెప్పుకున్నారు. ఇప్పటికైతే ఈ చిత్రానికి “కత్తిలాంటోడు” అనే టైటిల్ అనుకుంటున్నా చిత్రీకరణ మాత్రం వచ్చే జూన్ లో ప్రారంభం అవుతుంది.

అలాగే ఇప్పటికిప్పుడు అనుకున్న లెక్కల ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ అంచనా.

రామ్ చరణ్ ప్రారంభించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఈ రెండూ ఒకేసారి ప్రారంభం కావడం విశేషం.

ఇలాఉండగా, ఈ రెండు ప్రారంభ కార్యక్రమాలనూ ఓ కుటుంబ పండగలా చేశారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో అల్లు అర్జున్ , వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, నాగ బాబు, అల్లు అరవింద్, కొరటాల శివ, శరత్ మరార్ , జెమిని కిరణ్ , డీవీవీ దానయ్య, తిరుపతి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అయితే ఇంతమంది పాల్గొన్నా వారి మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించక పోవడం కొట్టొచ్చిన లోటే అయ్యింది.

ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలకు మెగాస్టార్ హాజరవడంతో పవన్ కళ్యాన్ కూడా మెగాస్టార్ 150వ చిత్ర ముహూర్త షాట్ కి వచ్చినట్లయితే ఎంతో బాగుండేదని మెగాస్టార్ అభిమానులు ఆశించడం తప్పేమీ కాదుగా.

Send a Comment

Your email address will not be published.