ఉండేది రాముడొక్కడే..

హనుమంతుడిని ఆరాధిస్తే రాముడిని కొలిచినట్టే అని అంటూ ఉంటారు. కానీ నా  దృష్టిలో త్యాగరాజు కీర్తనలను మనసా వాచా కర్మణా పాడుకుంటే రాముడిని నిలువెల్లా కొలిచినట్టే అని అనుకుంటాను.

సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగయ్య రామకృష్ణ యతీంద్రుని వద్ద రామ మంత్రాన్ని ఉపదేశంగాపొంది 96 కోట్ల సార్లు జపించి ధన్యుడయ్యాడు. ఆయన రెండు వందల పైచిలుకు రాగాలు వాడినట్టు, 47 మేళ కర్త రాగాలను ఉపయోగించినట్టు చెప్తుంటారు.

ఎందరో మహానుభావులందరికీ వందనాలు అని పాడిన త్యాగయ్య రాముడి అందచందాలను, గుణగణాలను, ఔన్నత్యాన్ని కొనియాడిన తీరు అమోఘం.

జో జో రామ….జో జో ఆనంద ఘన …జోజో దశరధ బాల రామ….జో జో భూజాలోల రామ …అని జోలపాట పాడి రాముడిని పడుకోపెట్టిన త్యాగయ్య మేలుకోల్పుగా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్య రామా …మేలైన సీతాసమేత నా భాగ్యమా అని కూడా పాడి నిద్ర లేపాడు.

విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే అంటూ రాముడిని నిద్ర లేపితే అటు వంటి అదృష్టాన్ని తానూ అనుభవిస్తూ త్యాగయ్య పై పాటను పాడి ఆనందించారు.

కాటుక కంటి నీరు …అనే పద్యంలో పోతన తన కావ్యాన్ని నరులకు ఎవరికీ అంకితం ఇవ్వనని చెప్పి సరస్వతీ దేవిని ఓదార్చడం మన అందరికీ తెలిసిందే కదా? అలాగే త్యాగయ్య కూడా దానం, ధాన్యం, వంటివన్నీ ఇచ్చే దైవం నువ్వే అయినప్పుడు నిన్ను కాకుండా మరెవరినీ ఇంద్రుడు, చంద్రుడు అని అతిశయోక్తులతో పొగడగలనా అని ప్రశ్నించాడు.

రాముడికున్న కళ్యాణ లక్షణాలను చెప్తూ అతనికి ప్రదక్షిణం చేసి తరిద్దాం రండి అంటూ త్యాగయ్య “భవనుత నా హృదయమున రామిమ్పుము” అనే మోహన రాగంలో పాడిన కీర్తనలో రామా నువ్వు శివుడితో కీర్తింపబడ్డవాడివి….నీ అలసట తీరేవరకు నా హృదయాన విశ్రమించు” అని అన్నాడు.

“రామా, నీ శాశ్వతాన్ని, నీ తత్వరహస్యాన్ని తెలిసిన వారిని సైతం నువ్వు శ్రమ పెడుతూ ఉంటావు…ఏడిపిస్తూ ఉంటావు …” అని చెప్పిన త్యాగయ్య ఈ సంసారం అనే సాగరాన్ని దాటడం తెలియని ఈ త్యాగరాజుకు చేయూతనిచ్చి రక్షించేవాళ్ళు వేరే ఎవరున్నారు రామా నువ్వు కాకుండా? నువ్వు మాత్రమే నన్ను ఈ సంసార సాగరాన్ని దాటించ గలవు అంటూ బ్రోచే వారెవరే రఘుపతీ ….అని పాడిన పాట అజరామరం. రాముడు ప్రేమతో రక్షిస్తాడని, కనుక అతనిని ఎప్పుడూ మరచిపోకు మనసా అని త్యాగయ్య పేర్కొనడంలో ఎంత సత్యముందో కదూ…?

నిధి చాల సుఖమా?  రాముని సన్నిధి సేవ సుఖమా ?
నిజముగా పల్కు మనసా
దాశరథి ధ్యాన భజన సుధారసము  రుచో…

అని కళ్యాణీ రాగంలో త్యాగయ్య ఆలపించిన కీర్తన ఆయన జీవన విధానానికి పల్లవి.

శరభోజి రాజు అపారమైన కానుకలిస్తాను, బంగారం ఇస్తాను నన్ను పొగుడుతూ కొన్ని కీర్తనలు రాయాలని అడిగినప్పుడు త్యాగయ్య ఆ నిదులేవీ అక్కరలేదని రాముని సన్నిధి సేవ సుఖమని తెగేసి చెప్పాడు.

పోతనలా త్యాగయ్య కూడా కేవలం డబ్బును మాత్రమే పూజించటాన్నిఎవగించాడు.

సీతాపతీ, అన్ని వేదాలతోనూ ఆశ్రయించిన సంగీత జ్ఞానం అనే బ్రహ్మానంద సముద్రాన్ని ఈద లేని శరీరం ఈ భూమికి భారమే అని పాడిన త్యాగయ్య సంగీతజ్ఞానం, భక్తి కలిగి ఉండటం మంచి మార్గమని మనసుతో చెప్పుకున్నాడు. భక్తి లేని సంగీతజ్ఞానం పరిమళం లేని పువ్వు అని చెప్పిన త్యాగయ్య

“ఒక మాట …ఒక బాణం…ఒక పట్నీవ్రతుడే మనసా…ఒక చిత్తము గలవాడే ….ఒకనాడునూ మారవ వద్దని” తాను నమ్ముకున్నరాముడిని ఎప్పుడూ దూరం చేసుకోలేదు. రాముడిని నమ్ముకున్న గొప్ప భక్తులు చిరంజీవులని, శాశ్వత మోక్షం ప్రసాదిస్తాడని, మన కోసం ఈ భూమిపై ఉన్న దేవుడు ఆయనే రాముదన్న మాటలతో ఏకీభవించడం తప్ప చేసేదేమీ లేదు మనమందరం. కనుక సదా రాముడి ఆరాధనలో మునిగి తేలుదాం…సంసార సాగరాన్ని అధిగమిద్దాం…

జై జై రామా జై జై….

– కళ్యాణీ రెడ్డి

Send a Comment

Your email address will not be published.