ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలి

అయితే ఈ సామెత ఎంత అందంగా చెప్పబడిందో అంత పొందికగా కూడా వుంది. అందంగా చెప్పబడి మనలో వున్న గొప్పదనాన్ని చెప్పకనే చెబుతుంది. ఎదగడం తన స్వంతమైనా ఒదిగుండడం సమ లక్షణం.

ఒకప్పుడు లక్ష్యం లేని గమ్యం. తన లక్షణమే దారి చూపిస్తుందన్న నమ్మకం. జేబులో డాలరు లేకపోయినా ఎంతో మనో స్థైర్యం. కష్టాలకెదురొడ్డి సుదూర పయనం. ఈ దారే గోదారని నా దారే రహదారని అలుపెరుగని ప్రయాణం. ఒక తెలుగువానిగా తనకూ ఒక బాధ్యతుందని గుర్తెరిగిన వ్యక్తిత్వం. తన చుట్టూ వున్న నలుగురి జీవితాలకు ఒక ప్రామాణికం. లక్ష్య సాధనలో మమేకం. నలుగురికీ స్పూర్తిదాయకమైన జీవనం.

ఆస్ట్రేలియాలో ప్రతీ తెలుగువారికి సుపరిచతమైన “ఇంటిగ్రేటెడ్ అకౌంటెంట్స్” షుమారు 6 ఏళ్ల క్రితం మెల్బోర్న్ నగరంలో స్థాపించబడింది. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు మెల్బోర్న్ నగరంలోని ఇతర ప్రాంతాలే (Lt. Collins Street, Caroline Springs, Point Cook) కాకుండా అడిలైడ్, పెర్త్, బ్రిస్బేన్ వంటి ఇతర రాష్ట్ర రాజధానులలో తనదైన స్థానాన్ని సుస్థిర పరచుకుంది. అతి తక్కువ సమయంలో ఇంత ప్రాచుర్యం పొంది ఆస్ట్రేలియాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో కార్యాలయాలను స్థాపించడానికి శ్రమ పడిన కృషీవలుడు ఈ సంస్థ అధినేత శ్రీ హరీష్ రెడ్డి బిసం.

కుటుంబమంతా డాక్టర్లు, క్రికెట్ ఫాన్స్. దారి తప్పి కంగారు పడుతూ కంగారూ దేశం రావడం జరిగింది.
చిన్నప్పటినుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలన్న ఒక కల. ఆ కల సాకారం అవ్వడానికి పుట్టుదల. రెండూ కలిసొచ్చి ఇంత దూరం వస్తే ఇదొక చేప పిల్ల పడిన వల.

స్వంత ఊరు మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట దగ్గర ఒక మారుమూల గ్రామం. తలిదండ్రులు రమాదేవి మరియు గోపాల్ రెడ్డి గార్లు. ముగ్గురు అన్నదమ్ములు. ఒకాయన అమెరికాలోనూ మిగిలిన ఇద్దరూ అస్త్రేలియలోనూ. అమ్మమ్మ సత్యమ్మ గారంటే ప్రాణం. చిన్నప్పటినుండి వారి చేతిలోనే పెరగడంతో వారి పెరుతోనే ఇక్కడ ప్రధాన సంస్థ నడుస్తోంది. తల్లిదండ్రులు పెట్టిన బిక్షే వారి క్రమశిక్షణకు మూలమని సగర్వంగా చెప్పుకుంటారు శ్రీ హరీష్ గారు.

వచ్చిన క్రొత్తలో ఏ వుద్యోగం చూసినా ఏమున్నది – అంత మాక్దోనల్డ్స్, KFC లేకపోతే సెవెన్ లెవెన్. కొంతమంది టాక్సీ నడుపుకుంటే పైకొస్తావని ఉచిత సలహాలివ్వడం. వ్రుత్తి సంబంధమైన వుద్యోగం చూద్దాం అంటే కనబడదే! ఖర్మ కాలి ఈ దేశం వచ్చాననుకుంటూ – ఎలాగూ వచ్చాను గదాని కోల్స్ లో ఒక వుద్యోగం చూసుకొని చదువుని కొనసాగించిన వైనం. అలాగే జీవితం కొనసాగిపోతే అందులో సవాలేముంటుంది? ఎన్నెన్నో మలుపులు అందులో కొన్ని గెలుపులు. మరికొన్ని ఒడిదుడుకులు.

చదువు పూర్తవ్వగానే సాఫీగా పెర్మనెంట్ రెసిడెన్స్ వస్తుందనుకుంటే కోర్టు వ్యవహారాలు లేకుండా ససేమిరా కాలేదు. మైగ్రేషన్ రివ్యూ ట్రిబ్యునల్ లో తన వాదనను వినిపించుకోని పెర్మనెంట్ రెసిడెన్స్ సంపాదించుకోవడం జరిగింది. అంతటితో ఆగిపోతే బాగానే వుండేది. మొదట ఉద్యోగంలో చేరిన తరువాత పనిచేయిన్చుకున్నవారు డబ్బులివ్వక కొంత కాలం తిప్పలు. పోరాటం లేనిదే జీవించడం కష్టం. భారతదేశంలో మనకెటూ ఈ ఇబ్బందులు తప్పవు. ఇక్కడికొచ్చి కూడా ఇంతేనా? ఏరికోరి ప్రశాంతంగా జీవితం గడపాలని ఈ దేశం వస్తే అదే పరిస్థితి.

మళ్ళీ మొదటికొచ్చిన పరిస్థితి. ఏదో కొరియర్ వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. అంతలోనే ఇంతకుముందు పనిచేసిన సంస్థ ఖాతాదారులు నుండి వాకబులు. ఎన్నెన్నో ఆలోచనలు. అమలు పరచాగలమా? నెగ్గుకురాగలమా? అన్నీ ప్రశ్నలే! సరే అంతా మన మంచికేనని ముందడుగు వెయ్యందే లోతెంతో తెలీదని తన స్నేహితునితో కలిసి ఇంటిగ్రేటెడ్ అకౌంటెంట్స్ సంస్థ 2010 – 11 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తెలుగువారితో పాటుగా భారత సంతతికి చెందిన పంజాబీలు, కన్నడ వారలు, మలయాళీలు ఇలా ఎంతోమంది వారితో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొని ఈ సంస్థ పలువిధాలుగా విస్తరిస్తుంది.

ప్రస్తుతం టాక్స్ ఒక్కటే కాకుండా ప్రాపర్టీ మేనేజ్మెంట్, లో కాస్ట్ హౌసింగ్ మొదలైన ఇతర వ్యాపార రంగాలలో దృష్టిని సారిస్తున్నారు. భారత – ఆస్ట్రేలియా దేశాల మధ్య సత్సంబంధాలు, వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఆస్ట్రేలియా ట్రేడ్ మినిస్టర్ శ్రీ ఆండ్రూ రాబ్ కి ఒక ముసాయిదా పత్రాన్ని సమర్పించి గత జనవరి నెలలో శ్రీ ఆండ్రూ రాబ్ తో పాటు భారతదేశం వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశంలో కొన్ని రకాల వైద్య చికిత్సలు జరగడానికి ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి భారతదేశంలోని వైద్య రంగ సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలన్న ముసాయిదా క్రింద ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నట్లు శ్రీ హరీష్ చెప్పారు.

శ్రీ హరీష్ గారి వంశంలో ఒక కళాకారుడు అంతర్లీనంగా దాగున్నాడనడానికి వారు వ్రాసిన కవితలే మచ్చుతునకలు.
జీవితం, ప్రేమ, స్నేహం, ప్రకృతి – తీరిక సమయంలో కలం కాగితం చేతికందితే సిరా ఇలా పొంగి పొర్లుతుంది…
…………….
స్నేహం…
మన స్నేహం స్వచ్చతకై పులకరించి పరవశించి
గగనమే మురిసింది స్నేహమై కురిసింది
నేల తల్లి పులకరించి పరవశించి పోయింది
మన స్నేహం పూవులోని పరిమళం వలె స్వచ్చం
మన స్నేహం నింగిలోని తారల వలె స్పష్టం
మన స్నేహం కమనీయం మన స్నేహం రమణీయం
మన స్నేహం మన స్నేహం సరిహద్దులు లేవు లేవు
ఎల్లలే లేవు
మన స్నేహపు పునాదులు బీటలు బారవు
కష్టాలలో ఆదరించి అందించావు హస్తం
నష్టాలలో నా తోడుగ నిలిచావు నేస్తం
మన స్నేహం నిలవాలి మన స్నేహం గెలవాలి
కలకాలం నిలవాలి కలకాలం గెలవాలి
మన స్నేహం మన స్నేహం

బ్రతుకు తెరువు …
బ్రతుకు తెరువు బాటలో గమ్య మనే వేటలో
నడుస్తున్న బాటసారి ఏదీ నీ గమ్యం
బంధుత్వం వదిలిపెట్టి బంధనాల చరను పట్టి
సాగుతున్న బాటసారి ఏదీ నీ గమ్యం
వేళ కాని వేళలో సమయం కాని సమయంలో
వృధా ఖర్చులారటం ఎందుకు మనకీ పోరాటం
జీవితమే ఒక సూన్యం లేదు దానికి గమ్యం
నీతిలేని రీతిలేని ఈ జీవన సరళితో
శ్రుతిలేని కృతిలేని ఈ జీవన రాగంతో
ఆగలేని సాగలేని ఈ జీవన పోరాటం
వృధా ఖర్చులారటం ఎందుకు మనకీ పోరాటం

ప్రేమ…
ప్రేమనేది శ్రుతి అయితే ఆకలి అనేది కృతి అయితే
ఈ రెండిటి సంగమమే జీవన రాగమైతే

………………

కవితలు వ్రాయడమే కాకుండా వారు సర్ఫింగ్ కూడా చేస్తుంటారు.

శ్రీ హరీష్ గారికి ఇద్దరు పిల్లలు. శ్రీమతి సువర్చల – టేలస్ట్ర లో టెస్టింగ్ మేనేజర్ గా పని చేస్తూ వారికి ప్రతీ పనిలోనూ చేదోడువాదోడుగా ఉంటూ ఎంతో సహకరిస్తూ ఉంటారని శ్రీ హరీష్ గారు చెప్పారు. తనతో సమానంగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ పిల్లలను చూసుకుంటూ అష్టావధానం చేస్తుంటుందని కష్టకాలంలో ఎంతో ధైర్యాన్నిచ్చి ప్రోత్సహించిందని శ్రీ హరీష్ గారు ఎంతగానో కొనియాడారు.

Send a Comment

Your email address will not be published.