కదిలిన తేనె తుట్టె

హైదరాబాద్: ఒక్క నాలుగు గంటల వ్యవధిలో యు. పి. ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణా సమస్యను పరిష్కరిస్తారని తెలంగాణ ఉద్యమ నాయకులు సైతం ఉహించలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమాత్రం ఉహించలేదు. ప్రత్యెక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలుపుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ ఇన్ ఛార్జ్ అయిన దిగ్విజయ్ సింగ్ ప్రకటించే వరకూ ఆయన దీన్ని నమ్మలేదు. ఆ తరువాత ఆయన హడావిడిగా తన సన్నిహితులతో సమావేశమై భవిష్య కార్యాచరణ మీద చర్చించడం మొదలు పెట్టారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాలన్న కాంగ్రెస్ అధిష్టానం ఆత్రుతను అర్ధం చేసుకోవచ్చు.  కానీ, ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన తరువాత ఎదురయ్యే సమస్యలపై హొమ్ మంత్రిత్వ శాఖ ముందుగా అందజేసిన నివేదికను అధిష్టానం పట్టించుకోక పోవడం మరో జటిల సమస్యకు కారణమయ్యింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే పక్షంలో ముందుగా సీమాంధ్ర ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఏక పక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సీమంధ్రలో ఆందోళనలు చెలరేగే ప్రమాదం వుందని హొమ్ శాఖ తన నివేదికలో చాలా ముందుగా హెచ్చరించింది. అంతకు ముందు పలువురు సీమాంధ్ర నాయకులతో సంప్రదించి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉండవచ్చు. కానీ తెలంగాణ గురించి కీలక ప్రకటన చేసే ముందు వారితో మరో పర్యాయం చర్చించాల్సింది. కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహలతో మాత్రమే చర్చించడంవల్ల ఉపయోగం లేదు. హొమ్ శాఖ నివేదికలో చేసిన మరో హెచ్చరిక ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది మావోయిస్టుల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని.  దీన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. మొత్తానికి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన తరువాత సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండంగా మారుతోంది. ఒక సమస్యను పరిష్కరించబోయి కేంద్రం మరొక జటిల సమస్యలో చిక్కుకుంది. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులను పిలిపించి వారికి హైదరాబాదు విషయంలో అభయమివ్వడం, రాజధాని నగరంలోని సీమాంధ్ర ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు తక్షణ రక్షణ కల్పించడం అనివార్యంగా కనిపిస్తోంది.

1 Comment

  1. హోం నివేదిక అక్షర సత్యం అని అంగీకరించక తప్పదు. ఉదాహరణకి తెలంగాణా జిల్లాలలో నెక్సలిజము నా బాల్యమునుంచి చూస్తున్నాను. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వం కాని పట్టించు కోలేదు. కొన్ని తెలంగాణా జిల్లాలు గత దశాబ్దాల నుంచి కరువు తో నిండి, భూములు బీటు వాడి, ప్రజలు నీటి వనరులు లేక కృశించి పోతున్నారు. నేను మహబూబునగరు, ఆదిలాబాదు జిల్లాలలో పత్రిక విలేకరునిగా పనిచేసి నప్పుడు, నా కనులతో చూసాను. ఇదే నక్సలిసము ఇప్పుడు వట వృక్షమై మావోయస్ట్ విప్లవ ప్రభంజనమైంది.

    ఇదే విధంగా ఆంధ్ర జిల్లాలలో కూడా కొన్ని విప్లవాత్మక సంఘాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకి గుండాయిస్మ్, దొంగ తనాలు తీవ్రమై ప్రజలను ఊహించని పరిణామాలకు గురి చేసినప్పుడు ప్రభుత్వాలు చూసి, చూడ నట్టు ప్రవర్తిస్తూ వచ్చాయి.

    ఇన్నాళ్ళకి హోం శాఖ ఈ సాంఘిక రుగ్మతలను గుర్తించి – చక్కటి నివేదిక కేంద్రానికి సమర్పించి, చక్కటి సలహాను యిచ్చింది. కేంద్రము – దక్షిణ భారత ప్రజల పై, దశాబ్దాలుగా తన మామూలు తేలికపాటి ద్రుష్టి సారించడం పరిపాటై పోయింది.

    కన్యాశుల్కం లో గురజాడ వారు అన్నట్టు “తాంబూలాలు ఇచ్చేసాం ఇక తన్నుకు చావండి” అన్నట్టు వుంది కేంద్ర ప్రభుత్వం వైఖరి.

    రఘు

Send a Comment

Your email address will not be published.