చిరు సినిమాకి కోటి..

మెగా స్టార్ చిరంజీవి తన 150వ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు వదంతులు ఊపందుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పటినుంచి ఈ వార్తలు మరింత వేగంగా పాకుతున్నాయి. అంతేకాదు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెల 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు నాటికల్లా ఆయన 150వ చిత్రం ఎలాగైనా ప్రారంభించాలని టాలీవుడ్ భోగట్టా. ఇందుకు సంబంధించి అవసరమైన పనులన్నీ చకచకా జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మించబోతున్నారు.

చిరంజీవి సినీ జీవితంలో ఈ 150వ చిత్రం ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోవాలని రామ్ చరణ్ ఆశాభావం. అది తన సొంత బ్యానర్ కిందే నిర్మించాలని కూడా అనుకుంటున్నారు. కలకాలం గుర్తుండిపోయేలా రూపొందించబోతున్న ఈ చిత్రానికి ఎవరైతే మంచి స్క్రిప్ట్ అందిస్తారో వారికి కోటి రూపాయలు కానుకగా ఇవ్వాలని కూడా రామ్ చరణ్ అనుకుంటున్నారు. తన తండ్రి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేసే వారికే ఈ మొత్తం ఇవ్వాలన్నది రామ్ చరణ్ నిర్ణయం. అంతే కాదు ఈ చిత్రంలో తాను కూడా ఒక ప్రధాన పాత్ర పోషించాలని అనుకుంటున్నారు. ఇంతకూ ఈ చితంలో ఎవరు హీరోయిన్ అనేది ఇంకా వెల్లడించలేదు. దర్శకులు ఎవరన్నది కూడా తెలియవలసి ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రతీ విభాగంలోనూ తన ముద్ర ఉండాలని రామ్ చరణ్ అనుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.