తెలంగాణాకు వెయ్యి మెగావాట్లు

తెలంగాణా , చత్తీస్ గడ్ మధ్య విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు చత్తీస్ గడ్ నుంచి తెలంగాణా రాష్ట్రం వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి వీలుగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలో హైదరాబాద్ లోని సి ఎం క్యాంపు ఆఫీసులో రెండు రాష్ట్రాల అధికారులు ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసారు. ఈ ఒప్పందం పన్నెండేళ్ళ పాటు అమలులో ఉంటుంది. నిరుడు నవంబర్ నెలలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి చత్తీస్ గడ్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈ ఒప్పందం ఖరారు అయినట్టు ఒక ప్రకటన వెలువడింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యదర్శులు అవగాహన పత్రాలపై సంతకాలు చేసారు. ఇదిలా ఉండగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి కూడా చత్తీస్ గడ్ సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ పొందడానికి వార్ధా నుంచి నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి వరకు విద్యుత్ లైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పనులు ముగియడానికి మరో ఏడాది పట్టవచ్చు.
రైతు కుటుంబానికి ఆర్ధిక సాయం
ఇలా ఉండగా, తెలంగాణలో పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే సహాయాన్ని ఆరు లక్షల రూపాయలకు పెంచుతూ కె సి ఆర్ ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచే పరిహారం పెంపుదల అమలులోకి వస్తుందని జీ వో నెంబర్ 173 పేర్కొంది. ఆరు లక్షల్లో అయిదు లక్షలు రైతు కుటుంబాలకు పరిహారంగా చెల్లించాలని, మరో ఒక లక్ష రూపాయలు అప్పు తీర్చేందుకు ఏక కాల పరిష్కారం కింద బ్యాంకులో జమ చేయనున్నట్టు రాత్ర ప్రభుత్వం పేర్కొంది.

Send a Comment

Your email address will not be published.