తెలంగాణా స్వాగతం

తెలంగాణా స్వాగతం

తెలంగాణా రాష్ట్ర అవతరణ సంబరాలు సరిక్రొత్త పుంతలు త్రొక్కి ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం రూపంలో మెల్బోర్న్ నగరంలో భాజా భజంత్రీలు మ్రోగాయి. ఈ నెల 7వ తేదీన హతార్న్ ఆర్ట్స్ కేంద్రంలో తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకొని ఆనందోత్సాహాలతో కార్యక్రమాలు నిర్వహించారు.

జానపదాలు పాడారు. కూచిపూడి నృత్యాభినయాలు చేసారు. తెలంగాణా యాసలో కధలు, కవితలు చెప్పారు. 60 ఏళ్ల ఎదురుచూపులు తమ కళ్ళ ముందు నిజమైందని, ఎంతోమంది యోధుల కల సాకారమైనదని సమరయోధులకు నివాళులర్పించారు. తమ కళ్ళలోని ఆనందాన్ని కనుల పండువుగా జరుపుకున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, భారత దేశాల్లోని ప్రముఖల సందేశాలను వినిపించారు. తాము ఆంధ్రులకు వ్యతిరేకం కాదని సమ ఉజ్జీగా ముందుకెళ్ళి నవ తెలంగాణా నిర్మాణంలో భాగ స్వామ్యులమై మాతృ భూమికి ఋణం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసారు. ఇప్పటికే వారు చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను విశదీకరించారు.

ముందుగా మన తెలుగువారి సంప్రదాయం ప్రకారం సభకు హాజరైన పలువురి పెద్దలతో దీప ప్రజ్వలనతో కార్యక్రమం మొదలైంది. దీనికి ముఖ్యంగా ఇండియన్ వైస్ కన్సులేట్ జనరల్ శ్రీ భగత్ గారు హాజరయ్యారు. తదుపరి గౌతమి గారు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. మృణాల్ రామ్ చేసిన బాలివుడ్ నృత్యం ఎంతో హృద్యంగా వుంది. “అమ్మ బడి” లో చదువుతున్న పిల్లలు ఫాషన్ షో శ్రోతలన్దరినీ ఆకట్టుకుంది. శ్రీమతి శోభ గారు నిర్వహించిన తెలంగాణా లోని ప్రముఖ స్త్రీల గురించిన వాక్య రూపకం ఎంతో చక్కగా వివరించారు. కొన్ని సినీ గీతాలు జానపదాలతో కూడిన ఈ కార్యక్రమం తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం సభ్యులు మరియు కార్యకర్తలు ఎంతో అభినందనీయులు.

అధ్యక్షులు శ్రీ రాజవర్ధన రెడ్డి వుల్పాల మాట్లాడుతూ ఈ సంఘం నవ తెలంగాణా నిర్మాణంలో ప్రముఖ భాగస్వామ్య పాత్ర నిర్వహిస్తుందనీ, ఈ ప్రక్రియలో అందరి సహాయసహకారాలు అవసరమనీ చెప్పారు. ఇండియన్ వైస్ కన్సులేట్ జనరల్ శ్రీ భగత్ గారు తెలంగాణా రాష్ట్రావతరణను స్వాగతిస్తూ ఈ సంఘానికి శుభాభినందనలు తెలిపారు.

వీనులవిందైన పాటలతో శ్రీ వడ్డే రాజు గారు, చందు భోగ గారు, శ్రీ రమణా రెడ్డి గారు ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. ధ్వని బ్రహ్మ శ్రీ మురళి బుడిగె గారు శబ్ద సాంకేతిక సహాయాన్నందించారు. శ్రీ మహేష్ గూడూరు గారు వాచస్పతిగా వ్యవహరించి సభా కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహించారు.

Send a Comment

Your email address will not be published.