“తెలుగు కళా తోరణం” - చారిత్రాత్మకం‏

అసాధారణ వ్యక్తి అయినా ఒక సాధారణ వ్యక్తిగా వచ్చారు. మీ మధ్య నేనొకడనని మూసలో పోసినట్లు మలుచుకుపోయారు. సాహితీ కుసుమాలని విరబూసారు. ప్రేమ గీతాలను వినిపించారు. ప్రేమాను రాగాలను పంచిపెట్టారు. మాటల మూటలతో మాయ జేసారు. మనలో మమేకం అయ్యారు. ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసారు. మానవతను వెదజల్లారు. ఒక జీవిత కాలానికి సరిపోయే అనుభూతిని మిగిల్చారు. ఇదంతా ఎవరికోసమో కాదు. కవి, నట, గాయకుడు, దర్శకుడు, దార్శనికుడు, తత్వవేత్త శ్రీ తనికెళ్ళ భరణి గారి గురించి.

ఎన్నో నెలలుగా ఎదురు చూసిన ఆ మహోన్నత వ్యక్తి వచ్చి మెల్బోర్న్ నగర తెలుగువారిని తన ఉనికితో స్పృశించి తరింపజేసారు. అందుకో మా వినమ్ర ప్రణామములు.

తెలుగుమల్లి మొదటి వార్షికోత్సవం మరియు భువన విజయం నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా గత నెల 31 వ తేదీన మెల్బోర్న్ నగరంలో జరిగిన “తెలుగు కళా తోరణం” కార్యక్రమం ముందుగా విక్టోరియా మల్టీకల్చరల్ కమీషనర్ శ్రీ చిదంబరం శ్రీనివాసన్ గారు దీప ప్రజ్వలన చేయడం, చిరంజీవి లలిత సరిపల్లె ప్రార్ధనా గీతం పాడడంతో మొదలైంది. 

ఆస్ట్రేలియా తెలుగు వారి చరిత్రలో కనీ వినీ ఎరుగని ఒక అరుదైన ఘట్టం “తెలుగు కళా తోరణం”.  ఈ సాహితీ సమారోహం తెలుగు దనంతో నిండిన మహోన్నత  విహంగ వీక్షణం.  ఇందులో పాలుపంచుకొని, భాగస్వాములై ఎందరో తెలుగువారు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చారిత్రాత్మక ఘట్టాలను రంగస్థలంపై ప్రదర్శించడం జరిగింది.

భువన విజయ కవన గీతం శ్రీ రఘు విస్సంరాజు, శ్రీ సూర్యనారాయణ సరిపల్లె మరియు శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం – చిరంజీవి కుల్జీత్ తబలా సహకారంతో పాడారు.

భువన విజయ సమన్వయ కర్త మరియు తెలుగుమల్లి వ్యవస్థాపకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు అందరికీ స్వాగతం పలుకుతూ తెలుగుమల్లి భువన విజయ కార్యక్రమాల గురించి వివరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషను “కమ్యునిటీ భాష” గా గుర్తించడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. దీనివల్ల ముఖ్యంగా రెండు లాభాలున్నాయి:
1. తెలుగు మాట్లాడే వారు “పెర్మనెంట్ రెసిడెన్సీ” కోసం దరఖాస్తు పెట్టుకుంటే వారికి 5 పాయింట్లు వస్తాయి.
2. ఆస్ట్రేలియా లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో తెలుగు భాషని ఒక పాఠ్యంశముగా చేర్చబడుతుంది.

“అక్షర” బడి పిల్లలు వారికి వారే హాస్యరంజకమైన కధా వస్తువుని ఎంచుకొని కావలసిన ప్రతిని వ్రాసుకొని “తెలుగు నేర్చుకుందాం” కార్యక్రమం ప్రదర్శించిన తీరు అమోఘం. చిన్న చిన్న పదాలతో చక్కని ఆంగ్ల తెలుగు పదజాలంతో నిండిన వాక్యప్రయోగాలతో నవ్వుల పువ్వులు రువ్వారు. శ్రీ భరణి గారు ఈ కార్యక్రమం చూసి అబ్బురపడిపోయారు. ఇదొక క్రొత్త ప్రయోగమని వ్యాఖ్యానించారు. ఇందులో శ్రీమతి రాణి కొప్పాక (ఉపాధ్యాయురాలు), హరి కొంచాడ, భాస్కర్ చెరుకూరి, భార్గవ్ చెరుకూరి, నిషిత విస్సంరాజు, నీహారిక వాల్తాటి, శ్రవణ్ రాజుపాలెం పాల్గొన్నారు. రచనా సహకారాన్ని అక్షర బడి ఉపాధ్యాయురాలు శ్రీమతి స్రవంతి అందించగా దర్సకత్వం శ్రీమతి ప్రత్యూష కొంచాడ చేపట్టారు.

“రుక్మిణీ వల్లభుడా? సత్యా విదేయుడా?” కార్యక్రమంలో ముఖ్య పాత్రధారులు మరియు సహాయ పాత్రధారులు జనరంజకమైన ఘట్టాన్ని మనోరంజకంగా ప్రదర్శించి అందరి మన్ననలను ఆకట్టుకున్నారు. ప్రతీ పాత్రకు ప్రాణం పోశారు. పాత్రల్లో జీవించారు. వచనాలు, పద్యాలు సమతుల్యంగా పొందుపరచిన ఈ పౌరాణిక ఘట్టం ప్రేక్షకులను ఎంతో పరవశిమ్పజేసింది. ఇందులో శ్రీమతి ఉమ పిల్లుట్ల (రుక్మిణి), అపర్ణ సనం(సత్య భామ), వంశి బుడిగె(శ్రీ కృష్ణుడు), రామారావు మునుగంటి(నారదుడు), శ్రీ కృష్ణ వేముల, శ్రీమతి నీరజ వేముల, శ్రీమతి రోజీ రత్నారెడ్డి, శ్రీమతి హేమ దోగుపర్తి, శ్రీమతి కవిత కట్నేని, శ్రీమతి లక్ష్మి పేరి,  శ్రీమతి లావణ్య కురుపాటి పాల్గొన్నారు. రచనా దర్సకత్వం: శ్రీ రఘు విస్సంరాజు

“పాటల పల్లకి” కార్యక్రమంలో మంచి సాహిత్యం వున్న పాటలు ఎంచుకొని “తెలుగు కళా తోరణం” పేరుకు తగ్గట్టుగా రాగ బద్ధమైన పాటల్ని పాడిన ఈ బృందంలో నీహారిక వాల్తాటి, నిషిత విస్సంరాజు మరియు భార్గవ్ బొప్ప పాల్గొన్నారు.

“అల్లరి పిల్ల – పోకిరీ మామ” లోని జానపదాలు జనపదాలే. ఎంతో హృద్యమైన ఈ పాటలు నిజంగానే ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసాయి. మన తెలుగువారి జానపదాలు అందరి నోట అలరారుతూ వుంటాయి. ఆ జానపదాలకు నృత్యం చేసిన తీరు – అందునా కొంతమంది పాత్రధారులకు కొన్ని పదాలకు అర్ధం తెలియదు అయినా అర్ధం తెలుసుకొని వీనులవిందైన పాటలకు సరియైన నృత్యం చేయడం ఎంతో ముదావహం. ఈ కార్యక్రమానికి చిరంజీవి “మేఘన సనం” నృత్య సంయోజనం చేసారు. ఇందులో హరి కొంచాడ, సన్నీ సనం, హరిణి వాల్తాటి, షర్మి మునుగంటి, మనీష్ భట్నాగర్ పాల్గొన్నారు.

వెయ్యేళ్ళ మన భాషా చరిత్ర ఒక గంటలో అత్యద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో అజరామరంగా నిలచిపోయిన “నాడు – నేడు” సాహితీ సింహావలోకనం ఎంతో శ్లాఘనీయమైనది. ఈ కార్యక్రమ సమాలోచన అనిర్వచనీయం. షుమారు 3 వారాలు నిద్రాహారాలను లెక్క చేయకుండా నిరంతరం ఎంతో శ్రమించి ప్రతిని తయారుచేసి పాత్రధారులను ఎంపికచేసి పూర్వాభినయానికి పట్టుమని 10 రోజులు కూడా లేని పరిస్థితిలో ఒక సాహితీ రూపకం సృష్టించడం ఆ నలుగురు (శ్రీ సూర్యనారాయణ సరిపల్లె, శ్రీ రఘు విస్సంరాజు, శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం, శ్రీ రాంప్రకాష్ ఎర్రమిల్లి) శిల్పులకే చెల్లుతుంది. బుర్రకధకులు (శ్రీ చైతన్య చావలి, శ్రీ విజయభాస్కర్ మారిసెట్టి, శ్రీ కృష్ణ ఏనుగుల) , రాజ రాజ నరేంద్రుడు (శ్రీ చంద్రశేఖర్ ఎల్లాప్రగడ), నన్నయ భట్టారకుడు (శ్రీ రాంప్రకాష్ ఎర్రమిల్లి), పోతన (శ్రీ యోగి వాల్తాటి) , శ్రీమతి పోతన (శ్రీమతి రమణి వాల్తాటి), శ్రీనాధుడు (శ్రీ ఉమామహేశ్ సెనగవరపు) , శ్రీకృష్ణ దేవరాయలు (శ్రీ చంద్రశేఖర్ ఎల్లాప్రగడ), పెద్దన (శ్రీ మురళి ధర్మపురి), సి.పి.బ్రౌన్ (చిరంజీవి శ్రవణ్ రాజుపాలెం), లుబ్ధావధానులు (శ్రీ గంగాధర్ జోస్యుల), సిద్ధాంతి (శ్రీ ప్రసాద్ పిల్లుట్ల), విశ్వనాధ సత్యనారాయణ (శ్రీ సుధాకర్ మద్దిపట్ల), శ్రీ శ్రీ (శ్రీ రామారావు మునుగంటి), అల్లూరి (శ్రీ వెంకటేశ్వర రావు తన్నీరు), “తెలుగు తల్లి” మరియు “జయ జయ ప్రియ భారత” (పిల్లలు – వర్ష పెరి, వైష్ణవి మాగంటి, అంజలి ఎల్లాప్రగడ, జాహ్నవి పున్న, చిన్మయి జొన్నలగడ్డ, అన్వయ తలకేర, కాశ్యప్ మద్దాల), “రావమ్మా మహాలక్ష్మి” (శ్రీమతి శ్రీవల్లి తలకేర, శ్రీమతి మమత దాసు, శ్రీమతి శ్రీదేవి మద్దాల) ఎంకి (చిరంజీవి భావన సిస్ట్ల), చెలికత్తె (చిరంజీవి హరిణి వాల్తాటి), నాయుడుబావ (శ్రీ కిరణ్ లింగంపల్లి), శివుడు (సునీల్ సిస్ట్ల) మరియు భక్తుడు (శ్రీ మురళి ధర్మపురి) – వెయ్యేళ్ళ చరిత్రలో ఎన్నెన్ని పాత్రలు, మరపురాని ఘట్టాలు, మధురమైన అనుభూతులు – కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రతీ ప్రేక్షకుడి నోట పదే పదే నెమరు వేయిమ్పజేసే పద్య పదాల వరస అద్భుతం. ప్రతీ పాత్రకు జీవంపోసి కళా హృదయాలను రంజింపజేసిన పాత్రధారులందరికీ అభినందనలు.

ముఖ్య అతిధి శ్రీ తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ “ఇదొక అత్యద్భుతమైన కళా రూపకం” అని అభివర్ణించారు. ఆస్ట్రేలియాలో ఇంతటి మహత్తర కార్యక్రమం ప్రదర్శిన్చినందుకు తెలుగువారందరికీ మరియు భువనవిజయ సాహితీ సంవేదికను అభినందించారు.

భువన విజయ క్రియాశీలక సభ్యులు శ్రీ సరిపల్లె భాస్కర రావు గారు శ్రీ తనికెళ్ళ భరణి గారికి తెలుగుమల్లి మరియు భువన విజయం తరఫున “నవ రస కవన నటనా-విద్వన్మణి” అన్న బిరుదుతో సత్కరించారు. తదుపరి ఆస్ట్రేలియా తెలుగు సంఘం, ఆస్ట్రేలియా తెలంగాణా తెలుగు సంఘం మరియు వి.ఐ.టి. అధినేత శ్రీ అర్జున్ సూరపనేని గారు కూడా శ్రీ భరణి గారికి సత్కరించారు.

కవితాస్త్రాలయ – 2014
ఆస్ట్రేలియా అన్ని రాష్ట్రాలలోని కవులు, రచయితలు కలిసి వ్రాసిన సాహితీ సంకలనం “కవితాస్త్రాలయ – 2014” పుస్తకాన్ని శ్రీ భరణి గారు ఆవిష్కరించారు.

“ప్యాసా”
శ్రీ భరణి గారు వ్రాసిన క్రొత్త పుస్తకం “ప్యాసా”  శ్రీ చిదంబరం శ్రీనివాసన్ ఆవిష్కరించారు.

“మైమ్ మధు”
“మైమ్ మధు” తన మూకాభినయంతో అద్భుతమైన ప్రదర్సననిచ్చి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. మూకాభినయం ప్రదర్శనలిచ్చి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులందుకున్న అరుసం మధుసూదన్ మెల్బోర్న్ నగరానికి రావడం మొదటిసారి. “పక్షుల వేట”, “గాలి పటాల ఎగురవేత” మున్నగు వాటిని ప్రదర్శించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.

శ్రీ కోగంటి వెంకటాచార్యులు
ప్రముఖ అవధాని శ్రీ కోగంటి వెంకటాచార్యులు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తన కవితా పటిమతో ప్రేక్షకులను ఎంతో అలరించారు.

ప్రశ్నోత్తరాలు
శ్రీ తనికెళ్ళ భరణి గారు తన సహజ శైలిలో ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని నిర్వహించి వారియొక్క జీవితంలోని ఎన్నో సంఘటనలను ఉదాహరణలతో వివరించి తన సాహితీ సమరోహణం గురించి వివరించారు. వారు వ్రాసిన “శభాష్ రా శంకరా” లోని కొన్ని ముఖ్యమైన పద్యాలనూ పది వినిపించారు. “గంగావతరణం” – వీరు వ్రాయబోయే క్రొత్త పుస్తకంలోని కొన్ని కవితలు చదివి వినిపించారు.

ఈ కార్యక్రమానికి ధ్వని పరికరాల సహకారం శ్రీ రాజా అందించగా శ్రీ మురళి బుడిగె గారు సమన్వయ కర్తగా వ్యవహరించారు. శ్రీ శ్రీనివాస్ వడ్డే రాజు గారు రికార్డింగ్ మరియు సాంకేతిక సహకారాన్నందించారు.

శ్రీమతి భానుశ్రీ ఎల్లాప్రగడ వాచస్పతిగా ఎంతో చక్కగా కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి కృష్ణ బేతనభట్ల మరియు శ్రీ యోగి వాల్తాటి స్టేజి మేనేజర్ గా వ్యవరించి కార్యక్రమ విజయానికి దోహదపడ్డారు.

శ్రీమతి అనురాధ మునుగంటి, శ్రీమతి రమశ్రీ ముడుంబ మరియు ముస్తఫా సయ్యద్ పాత్రధారుల మేకప్ కి సహాయాన్నందించారు.

ఈ కార్యక్రమానికి VIT, Integrated accountants, Planet Insurance మరియు Rumali Roti (Dosa Hut family) ఆర్ధిక సహాయాన్నందించారు. Rumali Roti (Dosa Hut family) వారు ఆహూతులందరికీ భోజన ఏర్పాట్లు చేసారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహాయ సహకారాలందించిన వారందరికీ మరియు విచ్చేసిన ప్రేక్షకులకు తెలుగుమల్లి మరియు భువన విజయం హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

3 Comments

  1. అద్భుతం ! ప్రదర్శిత ‘భువన విజయ’ కవి ప్రముఖుల ప్రతిభా పాటవాలు అత్యంత ప్రశంసనీయాలు ! ‘మెల్బో సాహితీ సంస్కృతీ సంవేదిక’ సృజియించిన ఈ కవన వేదిక ఒక చరితాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. అందరికీ నా మనస్ఫూ ర్తిక అభినందనలు.

  2. ప్రదర్శిత ‘భువన విజయ’ కవి ప్రముఖుల ప్రతిభా పాఠవాలు అత్యంత ప్రశంసనీయాలు ! నాలుగేళ్ళు ముగిసి ఐదవ ఏట అడుగిడిన ‘భువన విజయం’ మెల్బో సాహితీ సంస్కృతీ సంవేదిక’ పై మీరు సృజియించిన ఈ కవన వేదిక ఒక చరితాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. అందరికీ నా మనస్ఫూ ర్తిక అభినందనలు….. యస్పీచారి.

  3. నాలుగేళ్ళు ముగిసి ఐదవ ఏట అడుగిడిన ‘భువన విజయం’ మెల్బో సాహితీ సంస్కృతీ సంవేదిక’ పై మీరు సృజియించిన ఈ కవన వేదిక ఒక చరితాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. ‘భువన విజయ’ కవి ప్రముఖుల ప్రతిభా పాఠవాలు అత్యంత ప్రశంసనీయాలు ! అందరికీ నా మనస్ఫూ ర్తిక అభినందనలు….. యస్పీచారి.

Leave a Reply to యస్పీ చారి Cancel reply

Your email address will not be published.