తెలుగు వారికి నోముల పంట - గిడుగు

జాతి పునరుజ్జీవనం కోసం తెలుగు ప్రాంతంలో కూడా మేధావులు అనేక విధాలుగా కృషిచేశారు. వారిలో ఒకరైన గిడుగు రామమూర్తి పంతులు మాతృభాషలో విద్యాబోధనావకాశాన్ని పెంపొందించుకోవాలని మరీ పోరుపెట్టి చెప్పారు. గ్రాంధిక భాషలో ఉంటే సామాన్యులకు అర్ధం కాదని, అందరికీ అర్ధమయ్యే మాటల్లో సులభశైలిలో రాయాలని ఉద్యమించి అనుకున్నది సాధించిన గిడుగు వెంకట రామమూర్తిని వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా చరిత్రపుటలకెక్కారు. అందుకే ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29ను “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకోవడం మొదలైంది.

Gidugu Venkata Ramamurty1863 ఆగస్టు 29 న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించిన గిడుగువారి తల్లిదండ్రులు వీర్రాజు, వెంకమ్మ.

గిడుగువారి తండ్రి వీర్రాజు పర్వతాలపేట ఠాణాలోనే రెవెన్యూ అధికారి. కనుక ఆయన ఉండిన ఈ పర్వతాలపేటలోనే 1877 వరకు గిడుగువారి ప్రాథమిక విద్య సాగింది. ఆయన తండ్రిగారు విషజ్వరంతో 1875 లోనే మరణించారు.

మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి ఆ తర్వాత విజయనగరం మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ప్యాసయినా గిడుగువారు సమకాలీకులే గురజాడ అప్పారావు. అదే సంవత్సరంలో ఆయనకు పెళ్లయ్యింది. దానితో సంసారబాధ్యత పడేసరికి ఆయన తప్పనిసరై 1880 లో ఉద్యోగంలోకి చేరాల్సి వచ్చింది. పర్లాకిమిడి రాజావారి స్కూల్లో చరిత్ర పాఠాలు చెప్పే టీచర్ గా చేరారు. అప్పుడు ఆయన జీతం ముప్పై రూపాయలు.

కానీ చదువు మీద ఆసక్తితో ఆయన ప్రైవేటుగా చదువు కొనసాగించారు. 1886 లో ఎఫ్‌.ఏ ప్యాసయిన గిడుగువారు అనంతరం బీ.ఏ పట్టాపొందారు. ఇంగ్లీషు, సంస్కృతాలతోపాటు చరిత్రను ప్రధాన పాఠ్యాంశంగా తీసుకుని ఫస్ట్ క్లాసులో ప్యాస్ అవడమేకాకుండా రెండో ర్యాంకు కూడా సాధించారు. దీనితో ఆయన కళాశాలలో పైతరగతులకు కూడా పాఠాలు చెప్పే అర్హత కలిగింది.

ఇలా ఉండగా, అప్పటి సాంఘిక, రాజకీయ పరిస్థితులు సైతం ఆయన మనసుని భాషవైపు తీసుకుపోయాయి. ఇంతలో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి జె ఏ యేట్స్ అనే ఉద్యోగం కోసం మన భారత దేశానికి వచ్చారు. ఆయన విద్యా శాఖలో చేరారు. ఆయనకు తెలుగు భాష నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగింది. పుస్తకాలలో ఉన్న తెలుగుకీ, మాట్లాడుకునే తెలుగుకీ మధ్య ఉన్న తేడాను చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఇందులోని తేడాను తెలుసుకోవడం కోసం ఏ వీ ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ పీ టీ శ్రీనివాస అయ్యంగారుని కలిశారు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గురుజాడ అప్పారావు, గిడుగు వెంకట రామ మూర్తిలను కలిస్తే వాళ్ళు వివరంగా చెప్తారన్నారు. అప్పుడు యేట్స్ తో తెలుగు భాషా విషయమై చర్చించుకోవలసి రావటంతో గిడుగువారిని వ్యావహారిక భాషోద్యమం వైపు అడుగులు వేయించింది.

అప్పటి నుంచి ఆయన గ్రాంధిక భాషను వ్యతిరేకిస్తూ వచ్చారు. విద్యార్థులు వ్యాసాలు రాసేటప్పుడు వాడుక మాటలు రాయాలని చెప్పారు. గురజాడ అప్పారావు తదితరులతో తానా వాడుక భాషా ఉద్యమంపై చర్చలు జరుపుతూ వచ్చారు. అప్పుడు చాలామంది ఆయనను నిరసించారు. వ్యాకరణ జ్ఞానం లేదని ఆయనపై ధ్వజమెత్తారు. అయినా గిడుగు వారు ఆగలేదు. ఆయన అందరికీ అర్ధమయ్యే రీతిలో భాష ఉండాలని పట్టు పట్టి ముందుకు సాగారు.

1911 లో ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వ్యావహారిక భాషా ఉద్యమం వైపు పూర్తి దృష్టి పెట్టారు. బరంపురం, రాజమండ్రి, అనంతపురం, కాకినాడ తదితర ప్రాంతాలలో వ్యావహారిక భాషకు సంబంధించి జరిగిన సభలతో రచయితలు అందరూ ఓ అభిప్రాయానికి వచ్చారు.

మరోవైపు గిడుగువారు వ్యావహారిక భాష ప్రచారం కోసం కంకణం కట్టుకుని “తెలుగు” అనే పత్రికను చేపట్టారు. ఈ పత్రిక ద్వారా ఆయన వాడుక మాటలు రాస్తూ వచ్చారు. ఇంతలో కొందరు ఒక్కటై ఆయనకు గ్రాంధిక భాషపై పట్టు లేకపోవడం వల్లే వ్యావహారిక భాషంటూ వైద్యమం నడుపుతున్నారని విమర్శించడం మొదలుపెట్టారు. అయినా ఆయన వాటిని పట్టించుకోలేదు.

ఆయన తానెందుకు వాడుక భాష ఉద్యమం చేపట్టానో అని చెప్పడానికి తెలుగు వారు కాని వారికి చెప్పడం కోసం ఓ పుస్తకం రాశారు. ఆయన ఉద్యమానికి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, తదితరులు ఆమోదం తెలిపారు. శ్రీపాద, గుడిపాటి వెంకట చలం వంటివారు ఆయన బాటలో నడిచారు. వాడుక భాషే ఉత్తమం అని చాటారు. అనేక రచనలు చేశారు.

తన ఉద్యమంతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గిడుగువారికి ఊల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు కూడా చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒకరి తోడ్పాటుతో గిడుగువారు సవర భాష నేర్చుకున్నారు. ఈ సవరభాషలోనే పుస్తకాలు రాసి సొంత ఖర్చుతో స్కూళ్ళు ఏర్పాటు చేసి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే కృషి చేశారు. ఆయన చేసిన ఈ కృషికి మెచ్చి మద్రాసు ప్రభుత్వం 1913లో “రావు బహదూర్‌” అనే బిరుదుతో గిడుగువారిని సత్కరించింది. ఇంగ్లీషులో సవర భాషా వ్యాకరణాన్ని, సవర-ఇంగ్లీషు పద కోశాన్ని రాశారు.

విద్యాశక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం అనే మూడు ప్రధాన లక్షణాలను చిన్నప్పటి నుంచే కలిగి ఉన్న గిడుగువారు దాదాపు ముప్పై నాలుగేళ్లు తెలుగు భాషా సేవకు అంకితమయ్యారు.

1940 జనవరి 15వ తేదీన పత్రికాసంపాదకులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను చేపట్టిన వ్యావహారికభాషా వ్యాప్తి కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదన్నారు. గ్రాంథికభాషలో ఎంత తిట్టుకొన్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అని వివరించారు. కనుక వాడుక భాషే ఉత్తమోత్తమం అని ఎలుగెత్తి అనుకున్నది సాధించిన గిడుగువారు 1940 లో జనవరి 22 వ తేదీన తుదిశ్వస విడిచారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదు పొందిన గిడుగువారిని తెలుగు సరస్వతికి ఆయన ఓ నోముల పంట అని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించడం అతిశయోక్తి కాదు.

Send a Comment

Your email address will not be published.