దాదా ఫాల్కే గుల్జార్

హిందీ గీత రచయిత గుల్జార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2013 సంవత్సరానికి గాను ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురష్కారం దక్కింది. భారతీయ చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తుంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నవారిలో ఈయన 45వ ప్రముఖులు. కవిగా, రచయితగా, సినీ గీత రచయితగా, మాటల రచయితగా గుల్జార్ సుప్రసిద్ధులు.
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న జీలం జిల్లాలోని దినాలో 1934 ఆగస్ట్ 18న జన్మించిన గుల్జార్ తండ్రి మఖాన్ సింగ్ కాల్రా తల్లి సుజాన్ కౌర్.
గుల్జార్ అసలు పేరు సంపూరన్ సింగ్ కాల్రా . కానీ ఆయన గుల్జార్ గానే సుపరిచితులు.
ఆయనకు మొదటి నుంచి రచనా రంగంపై ఎనలేని మక్కువ. దీనిని గ్రహించిన తండ్రి ఆయానను మందలించి రచయితగా జీవించడం కష్టం అని చెప్పినా గుల్జార్ తన పట్టు వీడ లేదు. గుల్జార్ దీన్వీ అనే కలం పేరుతో రచయితగా తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఎలాగైనా రచయితగా ఎదగాలనుకున్న గుల్జార్ ముంబై చేరుకొని మొదట్లో ఒక గ్యారేజీలో కారు మెకానిక్ గా చేరారు.
అలా పని చేస్తున్న రోజుల్లో ఒకసారి ప్రముఖ నిర్మాత బిమల్ రాయ్, హృషీకేష్ ముఖర్జీలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే గుల్జార్ ను గీత రచయితగా మార్చింది. ఎస్ డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో బాందిని చిత్రానికి తొలి పాట రాసారు. ఆ పాట మొదటి పంక్తి మోరా గోరా అంగ్ లాయిలే …ఈ చిత్రం నిర్మాత బిమల్ రాయ్. ఇలా ప్రారంభమైన గుల్జార్ గీత రచయిత కెరీర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు. సునీల్ చౌదరి, ఆర్ డీ బర్మన్, మదన్మోహన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పని చేసిన గుల్జార్ ఆశీర్వాద్, ఆనంద్, కామోషీ తదితర చిత్రాలకు మాటలు కూడా రాసారు. అక్కడితి ఆగిపోలేదు ఆయన. మీనాకుమారి కథానాయికగా నటించిన మేరె అప్ నే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. పరిచై, కోషిష్, ఖుష్బూ, అంగూర్, వంటి మేటి చిత్రాలకు దర్శకుడిగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
మానవతా విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి విజయవంతమైన చిత్ర ప్రముఖుడిగా ఓ ప్రత్యెక స్థానం పొందిన గుల్జార్  ప్రముఖ నటి రాఖీని పెళ్ళాడారు. వీరి వైవాహిక బంధం ఓ పాప పుట్టే వరకు సాగి ఆ తర్వాత విడిపోయింది.
రవి పార్, ధూల్ తదితర పుస్తకాలు రాసిన గుల్జార్ తనకు లభించిన ఈ అవార్డు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, తన శ్రమకు తగిన గుర్తింపు దక్కినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ అవార్డు తనకు ఒక ఆశీర్వాదంగా స్వీకరిస్తానని అన్నారు. తన జీవితంలో ఇప్పటి వరకు తనపట్ల ప్రేమ చూపించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్తున్నానని అంటూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీ జ్యూరీ సభ్యులందరికీ థాంక్స్ అని తెలిపారు.
బుల్లి తెరకు కూడా తన రచనలు అందించిన గుల్జార్ అనేక కవితలను కూడా రాసారు.
2002 లో సాహిత్య అకాడమీ అవార్డు, 2004 లో పద్మభూషణ్ అందుకున్న గుల్జార్ కు ఇరవైదాకా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. స్లం డాగ్ మిలియనీర్ లో “జయహో…” పాటకు అకాడమీ అవార్డు, గ్రామీ అవార్డు లభించాయి.

Send a Comment

Your email address will not be published.