పంద్రా ఆగస్ట్!

పంద్రా ఆగస్ట్!

ఆగస్ట్ 15 వచ్చిందంటే జనం ఆ రోజున ఇతర పండగలన్నిటికంటే అధికంగా, సంస్కృతీ సంప్రదాయాలకు అతీతంగా ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకొనేవారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆ రోజున స్కూళ్ళల్లో జరిగే జెండా వందనానికి తప్పనిసరిగా వెళ్ళేలా చూసేవాళ్ళు. ఆ రోజున పిల్లల్లో కనిపించే ఆనందోత్సాహాలను చూసి తీరాలి. ఇప్పుడు అటువంటి ఉత్సాహం కలికానికి కూడా కనిపించడం లేదు. జనం తమంతట తాముగా ఈ వేడుకల్లో పాల్గొనడం అనేది ఒక్క ముప్పై అయిదేళ్ళ కాలంలో గత చరిత్ర అయిపొయింది. ఈసారి కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారత దేశమంతాటా ఎక్కడా పర్వదిన సందడే కనబడలేదు.

తల్లిదండ్రులు తమ పిల్లలని పంద్రాగస్ట్ రొజుఅన స్కూళ్ళల్లో జరిగే పతావిష్కరణ కార్యక్రమాలకు, వేడుకలకు పంపించడానికి భయపడే కాలం ఇది. ఏదో ఒక పార్టీ లేదా సంస్థ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించ వచ్చు. పేలుళ్లు జరుగవచ్చు. మరేదైనా గొడవలు పెట్రేగవచ్చు. ఇక అక్కడ భద్రతా చర్యల కారణంతో సోదా చేయడం మరో ఇబ్బందికర విషయం. మొత్తానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్ళు గడిచాయో లేదో దీనికి సంబంధించిన వేడుకల మీద జనానికి ఉత్సాహం నీరు కారిపోయింది. ఇప్పుడు ఇదొక మొక్కుబడి వ్యవహారం.

నిజానికి దేశం దాస్యం నుంచి విముక్తం అయ్యే పక్షంలో అణచివేతలు, అసమానతలు, వివక్షలు, నిరక్షరాస్యత వంటివి వైదొలగుతాయని గాంధీజీ నుంచి అంబేద్కర్ వరకు పలువురు మహానాయకులు కలలుగన్నారు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటినా ఇటువంటి సమస్యలు సర్వే సర్వత్రా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో 197 దేశాలలో అభివృద్ధిపై ఇటీవల ఓ అంతర్జాతీయ సర్వే జరిగినప్పుడు, ఇందులో 112 దేశాలు స్వాతంత్ర్యం సముపార్జించిన పదేల్లలోనూ, 85 దేశాలు 15 ఏళ్ల లోనూ అభివృద్ధి సాధించినట్టు కలలను సాకారం చేసుకున్నట్టు తేలింది. కానీ, భారత్ పరిస్థితి మాత్రం ఇప్పటికీ అగమ్య గోచరంగా ఉంది.

భారతదేశం వెలిగిపోతోందని, అమెరికా కంటే నాలుగు రెట్లు ఎక్కువగా భారత్ 7.89 శాతం వృద్ధి రేటు సాధించిందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఆకాశ హర్మ్యాలు, బ్రహ్మాండమైన మాల్ల్స్, బ్రాండెడ్ వస్తువులు, ఎటిఎం కార్డులు, సెవెన్ స్టార్ హోటల్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పిజ్జా సంస్కృతీ, పారిశ్రామికీకరణ వంటివి భారత్ వెలిగి పోతుందనడానికి ఉదాహరణలౌతాయా! మరైతే పెరిగిపోతున్న నిరుద్యోగం కొనసాగుతున్న అసమానతలు, వివక్షలు, మహిళలపై పెట్రేగుతున్న అత్యాచారాలు, బాల కార్మికులు, ఆరోగ్య సంరక్షణ సమస్యలు, ప్రాధమిక సదుపాయాల లేమి, పౌష్టికాహార లోపాలు, నిరక్షరాస్యత వగైరాల మాటేమిటి?

దేశంలో గత ఒకటిన్నర దశాబ్దాల కాలంలో పెరిగిపోయిన అవినీతిని, ముఖ్యంగా పాలకులు, ప్రజా ప్రతినిధుల్లో ప్రబలిన అవినీతిని (విలువ సుమారు నలుగు లక్షల కోట్ల రూపాయలు) చూసిన తరువాత మన పాలకుల కంటే బ్రిటిష్ పాలకులే నయమని ఎక్కువ మంది అనుకోవడం మొదలైంది. విచిత్రమేమిటంటే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ ఆఫ్రికా దేశాల్లో అనేక రంగాల్లో భారతీయులు అగ్రస్థానానికి చేరుకుంటున్నారు. భారత్ లో విజయాలు సాధించలేకపోయిన ప్రతిభావంతులు పలువురు విదేశాల్లో విజయ కేతనాలు ఎగురవేస్తున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇది భారత దెస వెనుకుబాటుదనానికి నిదర్శనం. శ్వేతజాతి పాలకుల కారణంగా భారతీయుల సత్తా నిద్రాణంగా ఉండిపోయిందని, కేవలం స్వయం పాలనలో మాత్రమే భారతీయులు అభివృద్ధి చెందగాలరని భావించిన స్వాతంత్ర్య సమరయోధులు తమ మాన ప్రాణాలను పణంగా పెట్టి శ్వేతజాతి పాలకులతో పోరాడారు. కానీ, 21వ శతాబ్దం వచ్చేసరికి అంతా వాళ్ళ అంచనాలకు విరుద్ధంగా జరుగుతోంది. భారతీయులు శ్వేతజాతి పాలకుల దేశాల్లోనే విజయాలు సాధిస్తున్నారు. “ఇక్కడి వ్యవస్థ ప్రతిభను గుర్తించదు. ప్రతిభావంతుల్ని, వ్యాపారాల్ని ఎదగనివ్వదు. అసలైన అధికారమంతా నాయకులూ, రాజకీయ నేతలు, అధికారులు, కుతంత్రాలకు పాల్పడేవారి చేతుల్లో కేంద్రీకృతమై ఉంది” అనేది ఇందులో పలువురి నిశ్చితాభిప్రాయం.

ఈ పరిస్థితిని చూసి ఉంటే మాన స్వాతంత్ర్య సమరయోధులు నిజంగా నిర్ఘాంతపోయి ఉండేవాళ్ళు. ఇదే భారతీయులు శ్వేతజాతి పాలిత దేశాలకు వెళ్ళినప్పుడు వారు ఆకాశమే హద్దుగా వెలిగిపోతున్నారు. శ్వేతజాతీయులు కూడా సాధించలేని విజయాలు సాధిస్తున్నారు. దీని బట్టి మనకింక అసలైన స్వాతంత్ర్యం రాలేదనీ, దీని కోసం అంతర్గత పోరాడాల్సి ఉందనీ అనిపిస్తోంది. భారత్ నిజంగానే వెలిగిపోవాలని మనమంతా కోరుకుందాం.

1 Comment

  1. నిక్కచ్చిగా, నిజాన్ని పలికిన మీ పదాలకు నమస్కరిస్తూ…అద్భుతమైన వ్యాఖ్యానాన్ని రచించిన సమ్పాదకీయానికి అభినందనలు

Send a Comment

Your email address will not be published.