మనసులను దోచుకున్న గళం

పులకించిన మది పులకించు …(పెళ్లి కానుక)
చాంగురే బంగారు రాజా …(శ్రీకృష్ణ పాండవీయం)
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా …(అనార్కలి)
చెట్టులెక్కగలవా..; ఓ నరహరి పుట్టలెక్క గలవా… (చెంచులక్ష్మి)
ఇలా ఈ పాటలు చెప్పుకుంటూ పోతే వెంటనే గుర్తుకొచ్చే గాయని జిక్కి అని తెలుగు పాటలతో ఏమాత్రం సంబంధం ఉన్నవారెవరైనా ఇట్టే చెప్పగలరు. ఈ పాటలన్నీ ఇప్పటివి కాకపోయినా అప్పుడే విన్నట్టు అనిపించకమానదు.

ఒక్కసారి ఆమె గురించి కొన్ని మాటలైనా చెప్పుకుందాం….

1935 నవంబర్ మూడో తేదీన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పుట్టిన జిక్కి అసలు పేరు పిల్లవాలు గజపతి. ఆమె తల్లిదండ్రులు గజపతి నాయుడు, రాజకాంతమ్మ.

ఆమె తన ఏడవ ఏట పంతులమ్మ చిత్రంలో బాలనటిగా అప్పటి కథానాయిక లక్ష్మీరాజ్యంతో కలిసి నటించడంతో పాటు ఒక పాట కూడా పాడారు. ఈ చిత్రానికి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కూడా త్యాగయ్య , మంగళసూత్రం, గొల్లభామ తదితర చిత్రాలలో నటించిన జిక్కి మరోవైపు పాటలు కూడా పాడుతూ వచ్చారు.

పదహారో ఏట నుంచి ఆమె పూర్తి గాయనిగా మారారు. అంటే నటనకు పులు స్టాప్ పెట్టిన జిక్కి గళం అంజలీదేవికి అచ్చంగా సరిపోయేది.

ఎప్పుడైనాసరే ఎవరికి పాడుతున్నాం అనేది దృష్టిలో పెట్టుకుని గొంతు సవరించి పాడటం ఏ గాయకుడికైనా గాయనికైనా ముఖ్యమని భావించి ఆ కోణంలోనే పాటలు పాడుతూ వచ్చిన జిక్కి వహీదా రెహమాన్ పై రోజులు మారాయి చిత్రంలో షూట్ చేసిన పాట పాడటం ఆమెకు, ఆ సినిమాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ పాట ఇదే….”ఏరువాకా సాగారో రన్నా చిన్నన్నా…”

తన కెరీర్ లో దాదాపు పది వేల పాటలు పాడిన జిక్కి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సింహళీస్ భాషలలో తన గళం అందించారు. తెలుగు మాతృ భాష అయినా ఆమె తమిళం ఎంతో సరళంగా సుకుమారంగా మాట్లాడేది.

ఆమె సమీప బంధువు దేవరాజు నాయుడు స్వరకర్తగా జీ వీరన్న (కన్నడం)తో కలిసి పని చేసారు. దేవరాజు నాయుడు స్వరకర్తగా పనిచేయడం జిక్కీకి బాగా కలిసొచ్చింది. ఆమెను వెండితెరకు చేరువ చేసింది.

1948 లో ఆమెకు తమిళ చిత్రం జ్ఞానసౌందరి చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి ఎస్ వీ వెంకట్రామన్ సంగీతం సమకూర్చారు. ఆ చిత్రంలో కుమారి రాజామణికి పాడిన పాట సూపర్ హిట్టైంది.
వెంటవెంటనే తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం భాషా చిత్రాల్లో పాటలు పాడి అనతికాలంలోనే ఆమె దక్షిణాదిలో నంబర్ వన్ గాయనిగా నిలిచారు.

1950 లో జెమినీ ఫిల్మ్స్ కు చెందిన ఎస్ ఎస్ వాసన్ తమిళ చిత్రం సంసారంలో ఏ ఎం రాజాను గాయకుడిగా పరిచయం చేసినప్పుడు జిక్కి రాజాను మొదటిసారిగా కలిసారు. ఆ తర్వాతే ఆమె వాసన్ పుణ్యామాని హిందీ సినిమాలో పాడే అవకాశం పొందారు.

1950 దశకంలో జిక్కి, పీ లీల పోటీపడి పాటలు పాడుతూ వచ్చారు. ఇద్దరి మధ్య గట్టి పొట్టీ ఉన్నా వారు మంచి మిత్రులుగా మెలిగే వారు. చూసే వారందరూ వారిద్దరూ అక్కచెల్లెల్లేమో అని అనిపించేది. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అభిమానం. ప్రేమ. ఇద్దరు కలిసి ఎన్నో పాటలు పాడారు.

ఎస్ వీ వెంకట్రామన్, జీ రామనాధన్, సి ఆర్ సుబ్బరామన్, ఎస్ ఎం సుబ్బయ్య నాయుడు, ఎస్ రాజేశ్వర రావు, జీ గోవిందరాజులు నాయడు, ఆర్ సుదర్శనం, ఎస్ దక్షిణామూర్తి, సి ఎన్ పాండురంగన్, అద్దేపల్లి రామా రావు, ఈమని శంకర శాస్త్రి, మాస్టర్ వేణు, కె వరప్రసాద్ రావు, టీ ఏ కల్యాణం, ఎం ఎస్ జ్ఞానమని, కె వీ మహదేవన్, పెండ్యాల నాగేశ్వర రావు, జీ అశ్వత్థామ, వీ దక్షిణామూర్తి, టీ జీ లింగప్ప, పీ ఆదినారాయణ రావు, పీ ఎస్ దివాకర్, టీ ఆర్ పాపా, టీ వీ రాజు, సి ఎస్ జయరామన్, ఘంటసాల, ఇళయరాజా, ఇలా ఎందరో సంగీత దర్శకుల సమక్షంలో పాటలు పాడిన జిక్కీ

అలాగే ఏ ఎం రాజా, టీ ఎం సౌందర రాజన్, శీర్కాలి గోవింద రాజన్, ఘంటసాల, ఎస్ పీ బాలసుబ్రమణ్యం, కె జె ఏసుదాస్, మలేసియా వాసుదేవన్, మనో తదితరులతో కలిసి ఎన్నో గొప్ప గొప్ప హిట్ పాటలు పాడిన జిక్కి ఏ ఎం రాజానే పెళ్ళాడారు. వీరిద్దరూ కలిసి పాడిన యుగాల గీతాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. రాజా సంగీత దర్శకత్వంలో ఆమె అనేక పాటలు పాడారు. వీరికి ఆరుగురు పిల్లలు. ఆమె భర్త రాజా ఓ రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక రైలు ఎక్కే క్రమంలో జారి రైలుకి, పట్టాలకు మధ్య పడి చనిపోయారు. భర్త మరణ సంఘటన తర్వాత ఆమె కొంత కాలం సినిమా పాటలు పాడలేదు. రెండో సారి మళ్ళీ పాటలు పాడటానికి వచ్చినప్పుడు ఆమె ఇళయరాజా సంగీతదర్శకత్వంలో పాటలు పాడారు. అంతే కాదు ఆమె ఇద్దరు కొడుకులతో కలిసి ఒక సంగీత బృందాన్ని కూడా ప్రారంభించారు. ఈ బృందం తరఫున ఆమె దేశవిదేశాల్లో అనేక కార్యక్రమాలు ఇచ్చారు.

ఆమె ఎప్పుడు డబ్బులే ప్రధానమని పాడలేదు. డబ్బులు కోసం పరుగులు పెట్టలేదు. ఇదుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఓ తమిళ సినిమా నిర్మాత వలంపురి సొమనాథన్ తాను తీసిన ఒక సినిమాలో అయిదు పాటలు పాడే అవకాశం ఇచ్చినప్పుడు తనకిచ్చే డబ్బును తగ్గించమని చెప్పింది జిక్కి. కారణం, ఒక్క సినిమాలోనే ఆని పాటలు పాడే అవకాశం ఇవ్వడం వల్ల.

పాటకే తన జీవితాన్ని అంకితం చేసుకున్న జిక్కి బ్రెస్ట్ క్యాన్సర్ తో ఆరోగ్యం బాగా దెబ్బతిని 2004 ఆగస్ట్ 16వ తేదీన చనిపోయారు. ఆమె ప్రాణాలు కాపాడటానికిసన్నిహిత మిత్రురాలు గాయని జమునారాణి ఆర్ధికంగా ఎంతో సహాయం చేసారు. తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమవంతు సహాయం చేసాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లక్ష రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయలు ఆమె చికిత్స కోసం మంజూరు చేసారు. కానీ ఫలితం లేకపోయింది.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.