మెగా టూర్ విభజన ఆపుతుందా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన పట్ల యు పి ఎ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల మరోసారి వై.ఎస్.ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విరుచుకు పడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచడానికి దేశ వ్యాప్త పర్యటనకి బయలు దేరు తున్నానని ప్రకటించారు. ఈ నెల 16 నుంచి 26 దాకా పది రోజుల పాటు దేశ వ్యాప్తంగా పర్యటించి సమైక్య రాష్ట్రానికి అన్ని పార్టీల మద్దతు కూడగడతానని ఆయన ప్రకటించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో అన్ని పార్టీల మద్దతు కోసం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలు పర్యటించి అక్కడ నాయకుల మద్దతు కూడగడతానని జగన్ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఇతర రాష్ట్రాలు, పార్టీలు ఊరుకుంటే భవిష్యత్ లో వారికీ ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. ఇక నునుంచి కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలంగా లేని వ్యతిరేకంగా ఉన్న బలమైన రాష్ట్రాలని తమ దారిలో తెచ్చుకోడానికి చిన్న చిన్న రాష్ట్రాలుగా చీల్చి పడేస్తాయని అందుకే ముందుగానే కేంద్రం పన్నుతున్న నీచమైన ఓట్లు, సీట్లు రాజకీయాన్ని అన్ని పార్టీలు ఏక తాటి పైన ఛీ కొట్టాలని జగన్ ఇతర పార్టీలకి పిలుపునిచ్చారు.

దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా వంటి పలు రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించు కోలేదు. ఉత్తర ప్రదేశ్ ని నాలుగు రాష్ట్రాలుగా విభాజించమని మాజీ ముఖ్యమంత్రి మాయావతి హయాంలో అసెంబ్లీ తీర్మానం కుడా జరిగింది. అయితే యు పి ఎ సర్కారుకు వాటి గురించి మాత్రం పట్టదు. కేవలం తమ పార్టీకి సీట్లు రావడం కోసం ముఖ్యంగా రాహుల్ గాంధిని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తున్నారు. తన కొడుకును ప్రధానిని చేయడం కోసం ఆరు కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న సోనియాగాంధీని అన్ని పార్టీలు కలిసి నిలదీయాలని అందుకోసం దేశం లోని ప్రధాన పార్టీల నాయకుల అందరినీ ఒప్పిస్తానని జగన్ ప్రకటించారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తో పాటు ఇంకా ఎన్.సి.పి. నేత శరద్ పవార్ ను కలుస్తానని, ఇంకా సమైక్య ఆంధ్రా కి మద్దతు ఇవ్వమని కమునిస్టుల్ని కోరతానని ఆయన ప్రకటించాడు . అయితే, జగన్ కి కేంద్ర నిర్ణయాన్ని ఆపగలిగే శక్తి ఉందా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. వై.ఎస్.ఆర్. విశ్వసనీయత, ఆయనపై ప్రజలకి ఉన్న అభిమానం తప్ప జగన్ నేరుగా ప్రజలకి చేసింది ఏమీ లేదు. ప్రజల్లో వై.ఎస్.పై ఉన్న అభిమానాన్ని పెట్టుబడిగా పెట్టుకుని ప్రత్యేక పార్టీ పెట్టుకున్న జగన్ ఇతర పార్టీల నాయకుల్ని రాష్ట్ర విభజన ఆపడానికి ఏమేరకు ఒప్పించ గలరని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.