వైతాళికుడు..శ్రీ శ్రీ

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం
విశ్వ దృష్టికి
అశ్రు నొక్కటి ధారపోశాను
నేను సైతం
భువన ఘోషను
వెర్రి గొంతుకనిచ్చి మ్రోశాను …..
– ఇలా  భావాడంబరాలు, పదాడంబరాలు, శబ్దాడంబరాలు ఎన్ని ఆడంబరాలు ఆయన సాహితీవనంలో పురుడు పోసుకుని ఇప్పటికీ  ఎప్పటికీ మన చుట్టూ అల్లుకుంటూ పోతున్నాయో చెప్పలేం….మాటలు ఆయనతో ఆదమరచి ఆట్లాడుకున్నాయా…లేక ఆయనే మాటలతో ఆట్లాడుకున్నారా …ఏమో తెలియడం లేదు కానీ ఇలాంటి  మహా కవిని నేను మా నాన్నగారి (యామిజాల పద్మనాభ స్వామి)   వల్ల ఆయన పక్కనే నిల్చుని చూసే భాగ్యవంతుడినయ్యాను. కానీ ఆరోజుల్లో నా దగ్గర కెమెరా ఉండి ఉంటే ఒక ఫోటో తీసుకునే వాడిని. అయితే ఆయనతో అప్పుడు మాట్లాద లేదు. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని. జస్ట్ ఆయనను చూడగలిగాను. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్న నాకు ఆయన రచన శక్తిని, మాటలపై ఆయనకున్న పట్టును   విశ్లేషించే శక్తీ ఆవగింజంత కూడా లేదు కనుకే ఆయన అప్పుడప్పుడు అక్కడక్కడా చెప్పిన విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేసాను. అంతకన్నా నేనిక్కడ చేసిందేమీ లేదు. చేయనూ లేను…
శ్రీ శ్రీ తన పుట్టుక తేదీ గురించి ప్రస్తావిస్తూ….”1910 ఏప్రిల్ నెలలో అనుకుంటాను ..మా నాన్నగారు చెబుతుండే దాన్ని బట్టి ఆయనే నా స్కూల్ ఫైనల్ చిట్టాలో 2-1-1910 (పుట్టిన తేదీ) అని వేయించారు. 1925 మార్చి నాటికి నేను 15 ఏళ్ళ వాణ్ని కావడం కోసం”  అని శ్రీ శ్రీ తన అనంతం అనే జీవిత సంఘటనల సమాహారంలో రాసుకున్నారు. కానీ ఆయన పుట్టిన తేదీ 1910 ఏప్రిల్ 30గా ఆ తర్వాత నిర్దారించిన దానినే నేను అనేక చోట్ల చదివాను.
ఆయనకు ఏడాదిన్నర వయసప్పుడే తల్లి చనిపోయారు. అప్పటినుంచి శ్రీశ్రీకి తల్లీ తండ్రీ అంతా తానే అయి పెంచారు శ్రీరంగం వెంకటరమణయ్య. తనకు అటు అక్కలూ, అన్నలూ, ఇటు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ లేరని, ఒక విధమైన ఒంటరితనంలోనే బాల్యమంతా గడిపినట్టు చెప్పుకున్న శ్రీ శ్రీ తల్లి ప్రేమకూ, సోదర ప్రేమకీ, సోదరీ ప్రేమకీ దూరంగానే బతికారు. అందువల్లనే ప్రేమంటే ఒక అపనమ్మకం ఆయనలో చిన్నప్పటినుంచే వర్ధిల్లుతూ వచ్చింది.
ఐదో ఏట ఉపనయనమూ, అక్షరాభ్యాసమూ చేసిన శ్రీ శ్రీ తన “అనంతం” రచనను “నా అత్మచరిత్ర ఆనడంకన్నా ఆత్మపరీక్ష అంటేనే నిజానికి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. జీవితం అనే పరిశోధనశాలలో దీనినొక ప్రయోగంగా భావిస్తాను” అని చెప్పుకున్నారు.
శిల్పికి ఉలి కావాలి
కవికి కలం కావాలి
మగాడికి ఆడదీ
ఆడడానికి మగాడూ కావాలి
ఇందులో ఏ ఒకటీ రెండో దాన్ని
ప్రేమించనక్కరలేదు
అవసరాన్ని గుర్తించవలసిన మాత్రం ఉంది
అదే స్వాతంత్ర్యం ….
అని చెప్పిన శ్రీ శ్రీ మొదటి కవితా సంపుటి 1928 లో ప్రభవ పేరుతో అచ్చయ్యింది. ఆ సంపుటిని తన తండ్రి ఇచ్చిన డబ్బుతో ముద్రించారు.
తండ్రి శ్రీరంగం వెంకటరమణయ్య, అబ్బూరి రామకృష్ణా రావులను తన జీవిత గురువులుగా చెప్పుకున్న శ్రీ శ్రీ ఇరవయ్యో శతాబ్దపు తెలుగు కవిత్వం మీద తిరుగులేని నియంతృత్వం చలాయించాలని నిశ్చయించి అందుకోసం జీవితమంతా కృషి చేసిన మహాకవి.
వ్యక్తులకు అంతం ఉంటుంది కానీ కవిత్వానికి కాదని చెప్పే శ్రీ శ్రీ “కవిత్వానికి వస్తువు ప్రాణం. శైలి శరీరం. ఆరోగ్యవంతమైన శరీరం. చైతన్యవంతంగా స్పందించే ప్రాణం. ఇవి రెండూ అవసరమైనవే. ఈ రెండిటిలో ఏ ఒక్కటి లేకున్నా రెండోది లేనట్టే. అందుచేత నా కవిత్వానికి వస్తువు, శైలి కలిసి దోహదం చేశాయి” అన్నారు.
కట్నానికీ లంచానికీ ఏమాత్రం తేడా లేదని అంటూ ఇవి రెండూ ఒకే నేరానికి రెండు పేర్ల లాంటివని చెప్పారు.
“…. అలాగే పుణ్యపురుషులు వేరయా అన్నాడు వేమన. నేను మాత్రం స్త్రీల నుంచి పుణ్య స్త్రీలను వేరు చెయ్యను. అందరు స్త్రీల మీద నాకు సమానమైన అభిమానమే ఉంది” అని ఓ చోట చెప్పిన శ్రీ శ్రీ “నేను ఇవాళ ఉంటాను  రేపు ఉండను …శ్రీ శ్రీ కవిత్వం ఇవాళే కాదు ఎల్లప్పుడూ ఉంటుంది” అని చెప్పుకున్న ఆయన ఆత్మవిశ్వాసానికి జోహార్లు.
భగవంతుడిని ప్రార్దించేటప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుంటారని అడిగితే శ్రీ శ్రీ సమాధానం చూడండి…
“మాది గుడ్డి నమ్మకం ” అని తెలియజెయ్యడానికేనట.
1950లో సినీ ఫీల్డులో ప్రవేశించక పూర్వం రకరకాల ఉద్యోగాలు చాలా చేసిన శ్రీ శ్రీ కవిత్వాన్ని చిన్నప్పటినుంచి రాస్తూ వచ్చారు. ఆయన తొలి సారిగా 1950 లో ఆహుతి అనే డబ్బింగ్ చిత్రానికి మాటలూ పాటలూ రాశారు.
కవిత్వం రాసేటప్పుడు తాను తాగుతాననడం తప్పని, తాగినప్పుడు కవిత్వం రాదనీ, నిద్ర వస్తుందనీ చెప్పిన శ్రీ శ్రీ మహాప్రస్థానం ప్రథమ ముద్రణకు  పదేళ్ళ పాటు ప్రచురణకర్త ఎవ్వడూ దొరకకపోతే చివరికి నళినీకుమార్  చేసిన ధన సహాయంతోనే అది సాధ్యమైందని రాసుకున్నారు.
చిన్నప్పుడు శ్రీశ్రీకి దేవుడిమీద నమ్మకమూ, భక్తీ ఉండేవి…..అయితే ఆయనలోని హేతువాద దృష్టి, శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ నాస్తికత్వం మీద విశ్వాసం బలపడుతూ వచ్చింది.
నిజం నిప్పు లాంటిదైతే అబద్ధం నీరు లాంటిదని చెప్పిన శ్రీ శ్రీ “బీదవాడు ఎప్పటికైనా ధనవంతున్ని కావాలని కోరుకుంటాడు. ధనవంతుడు ఎప్పుడూ బీదవాడిని కావాలని కోరుకోడు” అంటూ ధనికుడు, బీదవాడు కోరికల తారతమ్యాలను చెప్పిన ఆయన భావం అక్షరసత్యమే.
దేవులపల్లి కృష్ణ శాస్త్రిని జుంటి తేనెగా అభివర్ణించిన  శ్రీ శ్రీ తనను ఎర్ర సిరాగా చెప్పుకున్నారు.
దేవుడు లాగే ఆత్మ కూడా మానవుడు కల్పించుకున్న భ్రమమాత్రమే అని చెప్పిన ఆయన మినీ కవిత్వంపైనైనా తనకు సదభిప్రాయం ఉందని, ఎక్కడ దొరికినా ఏ సైజులో దొరికినా కవిత్వాన్ని అభిమానిస్తానని అనేవారు.
తన అభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఇది వరలో సృష్టిలో జననమరణాలు సంభవించాయని, ఇక మీద కూడా సంభవిస్తూనే ఉంటాయన్న శ్రీ శ్రీ 1970 లో షష్టి పూర్తి జరుపుకున్న ఆ ఏడాదే తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద మలుపు తీసుకుని విప్లవ రచయితల సంఘం ఏర్పడింది.  విరసానికి తొలి అధ్యక్షుడిగా శ్రీశ్రీని ఎన్నుకున్నారు. అప్పుడు ఆయన “ఇండియాకు రాష్ట్రపతి కావడం కన్నా వి.ర.సం అధ్యక్షుడిని కావడమే నాకు మహదానందకరం” అని చెప్పుకున్న  శ్రీ శ్రీ 1983 జూన్ నెల 15వ తేదీన అస్తమించారు. కానీ ఆయన అన్నట్టే శ్రీ శ్రీ మాటలు మనతోనే మనలోనే చిరస్మరణీయంగా ఉంటాయని చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించక్కర  లేదు.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.