సద్దుమణిగిన సమ్మెలు

సమైఖ్య  ఆంధ్రను కోరుతూ సమైక్య ఆంధ్రులు ప్రారంభించిన సమ్మె ఆగిపోయింది. ఆ ప్రాంత ఉద్యోగులు సైతం సమ్మెకు స్వస్తి చెప్పారు. నిజానికి సమ్మెను ప్రారంభించిన నాయకులకు కేంద్రం నుంచి లభించిన హామీలేమీ లేవు.
కేంద్రం నియమించిన మంత్రుల సంఘం అతి వేగంగా తన పని ముగించి కేంద్రానికి నివేదికను కూడా సమర్పించింది. సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించాలని అది సిఫార్సు చేసింది. కాగా, ఈ నెల 14, 15 తేదీలలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని, ఆ తరువాతే తెలంగాణా ఏర్పాటుకు తేదీని నిర్ణయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమావేశాన్ని బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీతో సహా ఒకటి రెండు పార్టీలు భావిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణా ఏర్పాటుకు కేంద్రం నుంచి అన్నీ సిద్ధమయిపోయాయని, కొత్త రాష్ట్రం ఏర్పడడం కేవలం లాంచనమేనని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా నాయకులు చెబుతున్నారు.

ఇది ఇలా వుండగా, రాయల తెలంగాణాను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో అనతపురం, కడప జిల్లాలను కలపాలని మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణపై శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినా బహుశా దాన్ని ఎవరూ తిరస్కరించకపోవచ్చని భావిస్తున్నారు.

సీమాంధ్ర సమ్మెను కిరణ్ అణచివేశారా?

సమైక్య ఆంధ్రను కోరుతూ ఉధృతంగా సాగుతున్నసమ్మెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలివిగా అణచి వేశారని పలువురు ఇతర పార్టీల నాయకులు అనుమానిస్తున్నారు. తాను కూడా సమైక్య ఆంధ్రను కోరుకుంటున్నట్టు, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ప్రకటించినందుకు తాను కూడా కేంద్రం మీద ఆగ్రహంతో ఉన్నట్టు ప్రకటించిన కిరణ్ వాస్తవానికి కేంద్రంతో కుమ్మక్కయి, చడీ చప్పుడు లేకుండా సమ్మెను అణచివేసినట్టు కనిపిస్తోంది. సమ్మెకు ఉద్యోగులను ఎగదోసిన ముఖ్యమంత్రి ఆ తరువాత నాయకులను కూడా రెచ్చగొట్టి ఆందోళన లేవదీశారు. ఉద్యోగుల సంఘం నాయకుడు అశోక్ బాబును తెలివిగా ఉపయోగించుకుని సమ్మెకు పురిగొల్పారు. కొద్ది రోజులు గడిచిన తరువాత, ఆ సమ్మెను ఆపించారు. ఉద్యమకారులకు ఆయన ఇచ్చిన హామీ, ప్రధానితోనూ, సోనియా గాంధీతోనూ సమావేశం ఏర్పాటు చేయిస్తానని చెప్పడం మాత్రమే. ఈలోగా పరిస్థితులన్నీ మారిపోయాయి.
కిరణ్ కేంద్రంతో చేతులు కలిపారని, అందువల్ల ఆయనను పదవి నుంచి తొలగించే ఆవకాశం లేనే లేదని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. కిరణ్ పార్టీ పెట్టడం కూడా వట్టి మాటేనని ఆ నాయకుడు చెప్పారు. సమైక్య అన్న్ధ్ర ఉద్యమ నాయకులను ఒక తాటి మీదకు తీసుకు రావడంలో కిరణ్ విజయం సాధించారని, ఆ తరువాత వారిని ఒప్పించి ఉద్యమాన్ని ఆపించారని, శాసనసభలో ఆయన తెలంగాణా తీర్మానాన్ని ఆమోదింప చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని ఆ నాయకుడు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.