సృష్టి స్వరూపమే ...

omkar swaroopమాఘ బహుళ చతుర్దశి రోజు అర్ధరాత్రినాడు ఈశ్వరుడు ప్రళయానంతరం లింగరూపం ధరించాడు. పునఃసృష్టి చేసాడు. ఇదొక వ్రతంగా ఆచరణలో ఉంది. శివపూజ లింగోద్భవ కాలంలో జరుగుతుంది. శివరాత్రిని ద్వాదశ శివలింగ క్షేత్రాలలోనూ ఘనంగా జరుపుతారు. కొన్ని ప్రధాన క్షేత్రాలు – ఉజ్జయినిలోని మహాకాళ. గరవాల్ లోని కేదార్ నాథ్, కాశీలోని విశ్వనాధుడు, బెంగాల్ లోని విద్యానాధుడు, కథియవార్ లోని సోమనాధుడు, పూనా దగ్గర భీమశంకరం, నాసిక్ లోని త్రయంబకం, కర్ణాటకలోని మల్లికార్జున, రామేశ్వరంలోని రామలింగేశ్వర క్షేత్రం,

లయ కారకుడైన శివుడు స్థిర స్వరూపుడు. మనం దర్శనం చేసుకునే శివలింగంలో లింగం పురుష స్వరూపం. లింగం కింద ఉండే పానపట్టం స్త్రీస్వరూపం. సృష్టి స్వరూపమే శివలింగం.

శివాలయాలలో ఎక్కడైనాసరే శివుడి ప్రతిమ ఉండదు. భ్రుగుమహర్షి శాపం వల్ల శివుడు లింగ రూపంగా పూజలు అందుకుంటున్నాడు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి అగ్ర, అధో జాతి అంటూ తేడాలు ఉండవు.
ఏ శివాలయంలోనైనా శివలింగాన్ని మనం చేతులతో తాకి శివశక్తిని పొందవచ్చు. శివోహం అని అనుకోవచ్చు.

శివుడు దేవాదిదేవుడు. పరమేశ్వరుడి శిరస్సుపై నుంచి గంగ జాలు వారుతుంది. శివుడిని అభిషేకించిన జలం ఆయన పీఠంపై జారి ఏర్పడిన దారి నుంచి బయటకు ప్రవహిస్తుంది. కనుక శివాలయంలో ప్రదక్షిణ సరికాదన్న విషయాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి.

తమిళనాడులోని చిదంబరంలో చిదంబరేశ్వరుడు ఆకాశ లింగ రూపంలో ఉన్నాడు. అది కనిపించదు కానీ నిరంతరం భక్తుల పూజలు అందుకుంటూనే ఉంది. అందుకే శివుడు రహస్యంగా కనబడకుండా ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే దీనిని చిదంబర రహస్యం అని అంటారు.

శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి దేవుడిని చూడాలను చెప్పడంలో ఓ వాస్తవం లేకపోలేదు. నంది వేదం ధర్మ స్వరూపం. నంది మనలోని పశు తత్వానికి నిదర్శనం. కొమ్ములు పట్టుకుని వెనుక తోక వైపు చేయి పెట్టి కొమ్ముల మధ్య నుంచి దేవుడిని చూస్తూ స్వామీ నేను నా పశు తత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను…అందరికీ మంచే చేస్తాను…న్యాయంగా ఉంటాను అని చెప్పాలి.

లింగ పురాణం – మహాశివుడు ఉపదేశించిన పురాణం ఇది. శివుడి లింగ రూప మహిమ, జ్యోతిష భూగోళ ఖగోళ నక్షత్ర మండల వివరాలతో పాటు శివారాధన విషయాలు ఈ పురాణంలో ఉన్నాయి.

శివ చాపం – దక్షయజ్ఞం ధ్వంసానికి శివుడు చాపం తీసుకెళతాడు. దేవతలను నొప్పిస్తాడు. దేవతలు ప్రార్ధించిన తర్వాత దానిని వాళ్లకు ఇస్తాడు. వాళ్ళు దేవరాతుడికి ఇస్తారు. ఆ తర్వాత అది జనకుడి ఇంటికి చేరింది. శ్రీరాముడు సీతా స్వయంవరంలో ఈ చాపాన్నే విరిచాడు.

Send a Comment

Your email address will not be published.